జీవితమే సపొలం

5 Apr, 2015 22:51 IST|Sakshi
జీవితమే సపొలం

చుట్టూ భవనాలు.. వీటి మధ్యకు కాడెడ్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా..! ఈ వ్యవసాయ క్షేత్రం హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉంది. ఓ పదేళ్లు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ఇక్కడన్నీ వ్యవసాయ భూములే. అభివృద్ధి పథంలో ముందుగా ఇక్కడికి హైటెక్ సిటీ వచ్చింది.. దాని వెంట దేశవిదేశాలకు చెందిన ఎన్నో ఐటీ కంపెనీలు బారులు తీరాయి.. అంతే.. అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్  బూమ్ రెక్కలు తొడిగి.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. వాలిపోయింది. కాసుల గలగల ముందు ధాన్యరాసుల కళ చిన్నబోయింది. వందలాది ఎకరాల వ్యవసాయ భూమి రియల్ సెక్టర్‌గా మారిపోయింది. ఇదే జోరులో ఎందరో కట్టల గుట్టలు ఆఫర్ చేసినా.. ఓ పెద్దాయన మాత్రం తన భూమిని అమ్మేదిలేదని భీష్మించుకున్నాడు. చుట్టూ ఐటీ ప్రపంచం సోకులు పోతున్నా.. నేటికీ పల్లెటూరి మోతుబరిలా దర్జాగా వ్యవసాయం  చేసుకుంటున్నాడు.

 ఓ వైపు తళతళ మెరిసే రోడ్లు.. మరోవైపు ఆకాశాన్నంటే ఐటీ భవనాలు.. వీటి మధ్యే ఉంది సయ్యద్ జాఫర్ ఐదెకరాల వ్యవసాయ భూమి. ఆయన పొలానికి అటుఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ కోట్లకు అమ్ముడుపోయాయి. అయినా జాఫర్ బాయ్.. ‘భూమిని నమ్ముకుంటాను కానీ అమ్ముకోనని’ డిసైడ్ అయ్యాడు. ఆయన మనసెరిగిన కొడుకు సయ్యద్ గౌస్ కూడా తండ్రి బాటలోనే సాగుతున్నాడు.
 
తృణప్రాయంగా..

నాలుగు తరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది ఈ కుటుంబం. తాతలనాడు అరక పట్టి.. మెరక దున్నారంటే ఓకే..! తమ పొలానికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తోసిపుచ్చి.. నేటికీ సయ్యద్ కుటుంబం పొలం పనులతోనే జీవనం సాగిస్తోంది. ఇప్పటికీ కాడెడ్లతోనే పొలాన్ని దున్నుతున్నారు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తున్నారు. తిండిగింజలు కరువైన నాడు ఎన్ని డబ్బులు ఉన్నా ఏం లాభం అంటాడు జాఫర్ ఉరఫ్ ఫకీర్‌సాబ్. రైతులు ఉన్నప్పుడే.. జనజీవనం సాగుతుందని చెబుతాడు. ఈ పొలంలో వరితోపాటు టమాటాలు, వంకాయలు, సొరకాయలు వంటి కూరగాయలతో పాటు, ఆకుకూరలూ పండిస్తున్నారు. ‘ఎనిమిదేళ్ల నుంచి ఈ పొలంలో పనిచేస్తున్నా. మాదాపూర్‌లో పొలం పనులకు వెళ్తున్నా అంటే హైటెక్‌సిటీలో పొలమేందని మా వాళ్లు ఆశ్చర్యపోతుంటరు’ అని చెబుతుంది రైతు కూలి శాంతమ్మ.

మా ఇంటి పంటే తింటాం..

‘నాకిప్పుడు 80 ఏళ్లు. నా కొడుకులు, మనవళ్లతో సమానంగా నడుస్తా. మా పొలంలో పండిన కూరగాయలే తింటం. మా ఇంటి నుంచి పొలానికి కిలోమీటర్ ఉంటది. రోజూ రెండు మూడు సార్లు పొలానికి నడుచుకుంటనే పోయొస్తుంట. ఈ తరం వారికి వ్యవసాయం భారంగా తోస్తోంది. గిట్టుబాటుకాకా.. పల్లెల్లో కూడా చాలామంది రైతులు వ్యవసాయానికి దూరమైతున్నరు’ అని అంటారు సయ్యద్ జాఫర్.
 
నాన్న కోరిక.. నా ఇష్టం..

‘చిన్నప్పటి నుంచే మా నాన్న వ్యవసాయంపై నాకు ఆసక్తి కలిగించారు. మా నాన్న కోరిక మేరకు వ్యవసాయం చేస్తున్నా. మా తమ్ముడు హోటల్ నడిపిస్తున్నాడు. బాగానే లాభాలు వస్తున్నాయి. అయినా పొలంబాట వీడేది లేదు. మా పిల్లలు ‘వ్యవసాయం ఎందుకు నాన్నా’ అని అంటుంటారు. ఈ దారిలో వెళ్తూ చాలామంది మా పొలం దగ్గర ఆగి చూస్తుంటారు. ‘ఇక్కడ వ్యవసాయమా.. మంచి పని చేస్తున్నావ్..!’ అని మెచ్చుకుంటారు కూడా’ అంటూ సంతోషంగా చెబుతారు సయ్యద్ గౌస్ .
  .:: తన్నీరు సింహాద్రి, మాదాపూర్
 

మరిన్ని వార్తలు