సముద్రమంత అందం

10 Feb, 2015 01:00 IST|Sakshi
సముద్రమంత అందం

సముద్ర తీరంలో దొరికే గవ్వలు... ఆల్చిప్పలను ఏరుకుని గర్వంగా దాచుకున్న తడి జ్ఞాపకం బాల్యంలో అందరి అనుభవం. ఆ అందమైన  వాటిని దాచేయకుండా... చెవి లోలాకులా, మెడలో హారంలా అందరికీ షో చెయ్యొచ్చు. అవును సీషెల్స్‌ను ఒక్కసారి పరికించి చూడండి. ఒకదానితో ఒకటి పోటీపడే అందమైన రూపం. వాటితో తయారైన అద్భుతమైన కళాకృతులేలేటెస్ట్ ఫ్యాషన్!
 
ఆల్చిప్పల్లాంటి కళ్లు అమ్మాయికి అందం. కానీ ఆల్చిప్పల్నే అమ్మాయిగా మలిస్తే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి సెట్స్ ఇప్పుడు ఎన్నో. ఆల్చిప్పలతో తయారైన అందమైన అమ్మాయి చేతిలో వీణ వాయిస్తున్న అందమైన చిత్రం చూస్తే మన మదిలో వీణలు మోగుతాయి. మెడలో ముత్యాలహారం... అందరికీ తెలిసిందే! ఆ ముత్యాలకు ఆల్చిప్పలు, గవ్వలు దండ గుచ్చి వేసుకుంటే చూసినవాళ్లు కళ్లప్పగించడం ఖాయం. ఇక ఆల్చిప్పలతో యునిక్‌గా డిజైన్ చేసిన హ్యాండ్ బ్యాగ్‌లూ రీసెంట్ పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు సైతం ఇప్పడు సీషెల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.
 
ముత్యాలు, కుందన్ల స్థానంలో బట్టలకి రంగురాళ్లు, గవ్వలు, ఆల్చిప్పలను ఉపయోగిస్తున్నారు. ఇవేకాదు మగువల చేతికి గాజుల్లానూ, వాల్ హ్యాంగింగ్స్‌లోనూ అందంగా కొలువుదీరుతున్నాయి. షెల్స్‌తో తయారు చేసిన యాష్ ట్రేలు ఇప్పుడు టేబుల్‌పై దర్జా ఒలకబోస్తున్నాయి.
 
ప్రకృతి ప్రసాదించిన సీషెల్స్ కంటే సహజమైన ఫ్యాషన్ ప్రస్తుతం ఇంకేదీ లేదంటున్నారు డిజైనర్స్. ఆ ప్రకృతి ప్రసాదాలను టెక్నాలజీ సాయంతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది గృహాలంకరణ నుంచి ఆభకరణాల వరకూ డిజైన్ చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు.
 
-  శిరీష చల్లపల్లి

మరిన్ని వార్తలు