ఈ- రిజిస్ట్రేషన్‌లో ‘ట్రేడ్ లెసైన్స్’ పొందండిలా..

9 Feb, 2015 23:53 IST|Sakshi
ఈ- రిజిస్ట్రేషన్‌లో ‘ట్రేడ్ లెసైన్స్’ పొందండిలా..

మహానగరంలో ఏ వ్యాపారం చేయాలన్నా తప్పకుండా లెసైన్స్ ఉండాల్సిందే. వ్యాపార అనుమతి పత్రాన్ని (ట్రేడ్ లెసైన్స్) గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జారీ చేసేది. అయితే, లెసైన్స్ జారీలో పారదర్శకత, త్వరితంగా ధృవీకరణ పత్రాలు మంజూరు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండేందుకు ‘ఆన్‌లైన్’లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.

దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రొవిజనల్ లెసైన్స్ పొందే వీలుండడం ఈ విధానం ప్రత్యేకత. ట్రేడ్ లెసైన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు జతచేయాలి? తదితర విషయాలు మీ కోసం..            

 
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి..
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొన్ని సేవలను ఈ- రిజిస్ట్రేషన్ విధానంతో అందిస్తున్నారు.
ఈ సేవలను పొందాలంటే ముందుగా మనం సంబంధిత సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి.  
ఇందుకు http://eghmc.ghmc.gov.in/ సైట్‌లో సిటిజన్ లాగిన్ కాలమ్‌లో ‘రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ను క్లిక్ చేయాలి.
 ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, చిరునామా, పిన్‌కోడ్, ఈ- మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది.
తరువాత ‘సబ్‌మిట్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఈ- మెయిల్‌కు, ఫోన్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.
మీ మొబైల్ ఫోన్ నంబరు మీకు యూజర్ నేమ్‌గా ఉంటుంది.
 
స్కాన్ చేసి ఉంచుకోవాల్సిన పత్రాలు..
రెంటల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రసీదు, బిల్డింగ్ ప్లాన్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉంచుకోవాలి.
పైన పేర్కొన్న పత్రాల పరిమాణం ‘1 ఎంబీ’కి మించకూడదు.
 
దరఖాస్తు విధానం ఇలా...
మీకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వచ్చిన తరువాత లాగిన్ అవ్వండి.
ఇక్కడి విండోలో ‘ట్రేడ్ లెసైన్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘ట్రాన్సాక్షన్’ ఆప్షన్‌లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ‘అప్లై ఫర్ న్యూ ట్రేడ్ లెసైన్స్’ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు దరఖాస్తు ఫామ్ వస్తుంది.
ఈ దరఖాస్తును నింపిన తర్వాత ‘సబ్‌మిట్’ చేస్తే మీకు దరఖాస్తు నంబరుతో ‘ఎకనాలెడ్జ్‌మెంట్- ప్రొవిజినల్ డిమాండ్ నోటీస్’ వస్తుంది.
ఇందులో మీరు చెల్లించాల్సిన రుసుం ఎంతో తెలియపరుస్తారు.
ఈ రుసుంను ‘మీ-సేవ’లో గానీ, ఇదే సైట్‌లో ‘ఆన్‌లైన్ పేమెంట్’ గాని చేయవచ్చు.
తరువాత మీకు రుసుం రసీదు, ప్రొవిజనల్ లెసైన్స్ జారీ చేస్తారు.  
దరఖాస్తు అనంతరం ఎకనాలెడ్జ్‌మెంట్ పత్రాలు మీ ఈ-మెయిల్‌కు వచ్చేస్తాయి.
సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో దరఖాస్తులో మీరు పేర్కొన్న అంశాలు సరైనవి అని తేలిన అనంతరం మీకు ‘ట్రేడ్ లెసైన్స్’ మంజూరు చేస్తారు.
 
దరఖాస్తు పరిశీలన గురించి..
ఇదే సైట్‌లో ‘రిపోర్ట్స్’ ఆప్షన్‌లో ‘అప్లికేషన్ స్టేటస్’ను క్లిక్ చేయాలి.
ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీ దరఖాస్తు నంబర్ కనిపిస్తుంది.  
దాని స్టేటస్ కూడా కాలమ్‌లో చివర కనిపిస్తుంది.
మీకు మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత దరఖాస్తును క్లిక్ చేసి ‘వ్యూ డీటేల్స్’ను క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి.
 
నోట్ : దరఖాస్తులో ‘*’ గుర్తున్న వాటిని కచ్చితంగా పూరించాలి. ఫోన్ నంబరు, ఈ-మెయిల్, చిరునామా కరెక్ట్‌గా ఇవ్వాలి. భవిష్యత్తులో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్లింత్ ఏరియాను కరెక్ట్‌గా నమోదు చేయాలి.

మరిన్ని వార్తలు