అది కొకైన్‌, హెరాయిన్‌తో సమానం

14 Jan, 2019 16:54 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

లండన్‌ : సోషల్‌ మీడియాకు బానిసైతే అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని గత అథ్యయనాలు స్పష్టం చేయగా,  ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు అడిక్ట్‌ కావడం, కొకైన్‌, హెరాయిన్‌లకు బానిసవడం వంటిదేనని తాజా అథ్యయనం హెచ్చరించింది. సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయిన వారు నిజజీవితంలో స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేరని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ చేపట్టిన ఈ అథ్యయన నివేదిక కుండబద్దలు కొట్టింది.

కొకైన్‌, హెరాయిన్‌ల వంటి డ్రగ్స్‌ తీసుకునే వారిలో కనిపించే ప్రవర్తనా శైలి సోషల్‌ మీడియా అడిక్ట్స్‌లో కనిపిస్తుందని ఈ అథ్యయన పరిశోధనా పత్రం పేర్కొనడం గమనార్హం. 71 మందిపై చేపట్టిన ఈ సర్వేలో ఫేస్‌బుక్‌పై గంటల తరబడి కాలక్షేపం చేసేవారు స్ధిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని,  వారితో పోలిస్తే ఎఫ్‌బీపై తక్కువ సమయం వెచ్చిస్తున్న వారు చురుగ్గా ఉంటున్నారని వెల్లడైంది.

సోషల్‌ మీడియా దుష్ప్రభావాలపై తాజా సర్వే వెల్లడించిన అంశాలు చర్చకు తావిస్తున్నాయి. కాగా సోషల్‌ మీడియా ఎడిక్షన్‌తో కుంగుబాలు, గాబరా, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని గతంలో రాయల్‌ సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ హెల్త్‌ సర్వే నివేదిక స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు