పరమ పవిత్రులందరికీ ప్రణామాలు!

7 Jan, 2015 01:22 IST|Sakshi
స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలతో వెంకయ్య నాయుడు (ఫైల్ ఫొటో)

 ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారభారాన్ని వెంకయామాత్యుడు తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. కడు నిరాడంబరంగా కనిపించే వెంకయామాత్యుడు తనకు నచ్చిన తారలను ఎంపిక చేసి వారిని పరిశుభ్రతకు ప్రతీకలుగా, నిర్మల హృదయులుగా, పరమపావనులుగా తెలుగునాట స్వచ్ఛభారత్ కార్యక్రమ ప్రచారదూతలుగా ఒకానొక మహాసభలో ప్రకటించినారు.
 
 మన దేశానికి నిజంగానే అచ్ఛేదిన్ వచ్చేశాయి. ఇకపైన మనదేశం పరిశుభ్రంగా, నందనవనంగా, ఆనందమ యంగా, శక్తిమంతంగా, అద్భుతంగా, అందంగా ఉండబో తోందనే ఆశ కలుగుతోంది.  అధర్మం నుంచి భూమిని కాపాడటానికి శ్రీమన్మహావిష్ణువు అవతారం దాల్చినట్టు భారతావనిని కాంగ్రెస్ రాక్షస(సి)పాలననుంచి విముక్తం చేయడానికి ధిల్లీలో వెలసిన నరేంద్ర ప్రభువు ధర్మపాల నలో దేశం అన్ని సమస్యలనూ అధిగమించి అగ్ర రాజ్యంగా అవతరించబోతోందనడంలో సందేహం లేదు.

 కారణజన్ముడైన  మోదీ మహాశయుడు ఒకానొక అప్రాచ్య మహిళ సారథ్యంలోని సైన్యాన్ని వధించి సకల కుంభకోణాలకూ, అక్రమాలకూ, అసమర్థతకూ, ఆశ్రీత పక్షపాతానికీ, చీకటిబజారుకూ, బంధుప్రీతికీ తటాలున తెరదించిన వైనం తెలిసిందే. ఆనక స్వాతంత్య్ర దినోత్స వంనాడు ఒక గొప్ప సంకల్పం జాతికి వెల్లడించారు ప్రధాన్. స్వచ్ఛభారత్ అభియాన్ మంత్రోపదేశం చేశారు.  యాభైమూడు అంగుళాల ఛాతీ, చెక్కుచెదరని కుర్తా, పైజమా, నెహ్రూ (పాపము శమించుగాక)జాకెట్టూ, రాజ స్థానీ తలపాగా పెట్టుకొని జలపాత సదృశంగా సాగిపో తున్న ప్రసంగమధ్యంలో స్వచ్ఛభారత్ అభియాన్‌ను  అత్యంత నాటకీయంగా ప్రకటించారు. భారత దేశాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అద్దంలాగా చేయాలంటూ ఉద్బోధించి చరిత్ర సృష్టించారు. ఇంతటి మౌలికమైన సమస్యను, అవమానకరమైన పరిస్థితిని ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించడమే కాకుండా జాతి చేత ప్రమా ణం చేయించడం సాహసం.  దుర్భర దారిద్య్రంలో పుట్టి చాయ్‌తో కడుపు నింపుకొని  ఆరెస్సెస్  కార్యకర్తగా పని చేసి, తాళికట్టిన  భార్యకు దూరంగా హిమాలయ సాను వుల్లోకి వెళ్ళి తపస్సు చేసి దివ్యశక్తులు పొంది జన్మభూమి రుణం తీర్చుకోవాలనే అంకితభావంతో రాజకీయాలలో ప్రవేశించి కొండెత్తు ఎదిగిన మోదీ వంటి గండరగండడికే ఇది సాధ్యం.
 జాతీయ స్థాయిలో సముజ్జ్వలంగా వెలిగిపోతున్న అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ వంటి తారలనూ, మీడియా మొఘల్ రామోజీరావు వంటి సచ్ఛీలురనూ స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారదూతలుగా నియమించి జాతిని ప్రేరేపించాలనీ, జనానికి స్ఫూర్తి ప్రసాదించాలని మోదీ నిర్ణయించినట్టున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛభారత్ అభియాన్ ప్రచారభా రాన్ని వెంకయామాత్యుడు తన భుజస్కంధాలపైన వేసు కున్నారు. కడు నిరాడంబరంగా కనిపించే వెంకయా మాత్యుడు తనకు నచ్చిన తారలను ఎంపిక చేసి వారిని పరిశుభ్రతకు ప్రతీకలుగా, నిర్మల హృదయులుగా, ఆదర్శ మూర్తులుగా, పరమపావనులుగా తెలుగునాట స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచారదూతలుగా ఒకానొక మహా సభలో ప్రకటించినారు. తెలుగు తేజాల జాబితాను పత్రికలలో చదువుకొనీ, టీవీలలో వినీ తెలుగుజాతి కడుంగడు సంతసించింది. వాజపేయి అయినా మోదీ అయినా మరెవరు ప్రధాని అయినా చక్రం తిప్పే తెలుగు సచివుడు వెంకయ్యే కావడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. తెలుగు సమాజానికి ఎటువంటి ఉపకారం ఎన్‌డిఏ ప్రభుత్వాల హయంలో జరిగినా అది వెంకయా మాత్యుడి చలవే. పద్మ అవార్డులు ఇప్పించడం కావచ్చు. డీలర్‌షిప్పులు కావచ్చు. అనేక రకాల పదవులు కావచ్చు. ఇదిగో ఇటువంటి పురస్కారాలు  కావచ్చు. ఆయన ఆశీస్సులు లేకుండా అసంభవం.  ప్రతిభామూర్తుల జాబితా చదివినవారిలో కొందరు ఫలానావారు ఎందుకు న్నారని ఆగ్రహిస్తే మరికొందరు ఫలానావారు ఎందుకు లేరంటూ తిట్టిపోశారు. దూషణభూషణలను సమంగా తనదైన శైలిలో చిరునవ్వుతో స్వీకరించే సాత్వికుడు వెంకయామాత్యుడి చెవికి కొన్ని ఫిర్యాదులు చేరినా  కలత చెందలేదు.

 దూతలందరూ సంపన్నులే. మోదీ భావజాలాన్ని అభిమానించేవారే. రైతుల ఆత్మహత్యలూ, ఘర్ వాప్సీలూ, భూసేకరణ చట్టానికి తూట్లూ, కార్మికుల చట్టా లకు కంతలూ వంటి చిన్ని చిన్ని విషయాలను వినకుండా, కనకుండా, మూర్కొనకుండా తమతమ వ్యాపార సామ్య్రాజ్యాలనూ,  పరిశ్రమాలనూ, కీర్తిప్రతిష్ఠలనూ జాగ్రత్తగా కాపాడుకుంటూ సమాజంలో ఉన్నతులుగా చలామణి అవుతున్నవారే. ఈ జాబితాలో అరుణారాయ్, హర్షమందిర్, మేధాఫాట్కర్ వంటివారు ఉండరు. మురికి బట్టలతో, పేదరికంతో, బక్కచిక్కి అసహ్యంగా కనిపించే నిరక్షరాస్యులను, అనాగరికులను ఉద్ధరిస్తున్నామనే భ్రమలలో జీవించే సామాజిక కార్యకర్తలు  ఉండరు. వెంకయామాత్యుడి జాబితాలో కనిపించేవారందరికంటే గొప్పగా, ధాటిగా ఇంగ్లీషు రాసే, మాట్లాడే అరుంధ తీరాయ్ సైతం దూతగా అనర్హురాలే. దండకారణ్యంలో క్రిమికీటకాదులు వేధిస్తుంటే లెక్కపెట్టకుండా వనవా సులను పరామర్శించడానికీ, మావోయిస్టులు నడిపిస్తున్న జనతన సర్కారు వివరాలు స్వయంగా చూసి తెలుసుకో వడానికి నడుచుకుంటూ వెళ్ళిన అరుంధతికి కార్పొరేట్ల సరసం తెలియదు. పల్లెలు చల్లగా ఉండాలని కోరుకునే వారికీ, దున్నేవాడికి భూమి ఉండాలని వాదించేవారికీ, పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమించేవారికీ, మానవహక్కులకోసం పరితపించేవారికీ, ప్రభుత్వరంగం చదువుకీ, ఆరోగ్యానికీ పూచీపడాలంటూ ఉద్ఘోషించేవారికీ వెంకయామాత్యుడి జాబితాలో చోటు దక్కకపోవడంలో ఆశ్చర్యం లేదు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తిరిగి వచ్చి వందేళ్ళు నిండిన సందర్భంగా చేస్తున్న హడా విడిలో గాంధీతత్వాన్ని గౌరవించనివారూ, గ్రామస్వరా జ్యాన్ని విశ్వసించనివారూ, సత్యం, అహింస వంటి సూత్రాలను పెద్దగా పట్టించుకోనివారూ కొందరు జాబితాలో ఉండవచ్చు. స్వచ్ఛభారత్ ఉద్యమ ప్రచా రానికి ఈ జాబితాలోని పుణ్యపురుషులూ, స్త్ర్రీలూ మనస్ఫూర్తిగా సహకరిస్తారనీ, వారికి ఎనలేని గౌరవం ఆపాదిస్తున్న కారణంగా మోదీకి ఎల్లవేళలా రుణపడి ఉం టారనే భావనకావచ్చు. జాబితా అంతా వెంకయా మాత్యులు ఒక్కరే తయారు చేశారని అనుకోనక్కరలేదు. ఈ దేశంలో నరేంద్రుడి ఆజ ్ఞలేకుండా చీమ కూడా కుట్ట దట. మధ్యతరగతినీ, ఎగువతరగతినీ, బడా వ్యాపార సంస్థలనీ, పారిశ్రామిక సంస్థలనీ కలుపుకొని ఒక మహా సంకీర్ణ సమాజాన్ని నిర్మించడానికి మోదీ, అమిత్‌షా, కమలనాధులలో ఇతర అగ్రనేతలూ ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగం కావచ్చు.

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామా లలో కాలకృత్యాలు బహిరంగ ప్రదేశాలలో తీర్చుకునే దుస్థితిలేకుండా అవసరమైన సౌచాలయాలను కట్టిం చడం వంటి పనులు ప్రచారార్భటి లేకుండా సమర్థంగా చేయవచ్చు. కానీ స్వచ్ఛభారత్ అభియాన్‌ను వినియోగిం చుకొని అధికార పార్టీకీ, అగ్రవాద వ్యవస్థకూ సన్నిహితు లైనవారినీ, ఆమోదయోగ్యులైనవారినీ, పనికివచ్చేవారినీ సమాజంలో ఉన్నతులుగా, అనుసరణీయులుగా నిలబెట్టి వారికి నమస్కారం చేయవలసిందిగా ప్రజలను పరోక్షం గా పురమాయించడమే ఇది.  మరుగుదొడ్ల నిర్మాణానికి మించిన మర్మక్రీడ. ప్రస్తుత వ్యవస్థలో రాణించాలంటే, ప్రభువులను మెప్పించాలంటే, నజరానా అందుకోవాలం టే సంపద సృష్టించడం తెలియాలి. అడ్డదారులు తొక్కినా పర్వాలేదు కానీ పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలి. అన్నిటికంటే ముఖ్యంగా  అందంగా కనిపించాలి. నిరు పేదల గురించీ, నిర్వాసితుల గురించీ, నిరుద్యోగుల గురించీ, నిర్భాగ్యుల గురించీ, పీడితుల గురించీ, తాడి తుల గురించీ ఆలోచించకూడదు. వారి మానాన వారిని చావనివ్వాలి. అభివృద్ధి గురించీ, పెట్టుబడుల గురించీ, లాభాల గురించీ, ఆకాశహర్మ్యాల గురించీ  మాట్లాడాలి. డబ్బు సంపాదించేందుకు ఏమైనా చేయవచ్చు. డబ్బుతో ఏమైనా చేయవచ్చు. ఇదీ యుగధర్మం. అర్థం చేసుకోక పోతే మీ ఖర్మం. వెంకయామాత్యుని మిత్రులందరికీ శిరస్సువంచి నమస్కరించాలి. ఆ జాబితాలోని వారి అడు గుజాడలలో నడిచి జాతిపిత కలలో కూడా ఊహించనట్టు ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దాం. జై భారత్.
 -క్రీడి

మరిన్ని వార్తలు