డ్రైనేజీ బతుకులు

14 Dec, 2014 10:24 IST|Sakshi

స్టార్ రిపోర్టర్ - ఉత్తేజ్
 
నగరంలో అద్దాల్లా మెరిసే రోడ్ల పొడవునా.. భూగర్భంలో పరుచుకున్న అంధకూపాలకు పాలకులు వాళ్లు. తెల్లవారడంతోనే వీరి బతుకులు మురుగులో కూరుకుపోతాయి. పొద్దెక్కే వరకూ అందులోనే మురిగిపోతాయి. ఊపిరి సలపనివ్వని దుర్గంధంలో గంటల తరబడి పని చేస్తే గానీ వారి బతుకులు ముందుకు సాగవు. సాటి మనుషులు ఇదేం పనని మలినంలా చూస్తున్నా.. పొట్టకూటి కోసం మలినంలోనే మసలుతుంటారు. అదే మనుషుల వ్యర్థాలతో పేరుకుపోయిన మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసి.. అందరికీ స్వస్థత చేకూరుస్తారు. మురికిలో మగ్గుతున్న ఆ కార్మికులను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా నటుడు ఉత్తేజ్ పలకరించారు. హలో అంటూ వారితో చేయి కలిపి ఆ మనసులోని మాటలు మన ముందుంచారు.
ఉత్తేజ్: స్వచ్ఛ భారత్.. దేశం మొత్తం వినిపిస్తున్న మాట. నిజానికి మనం స్వచ్ఛ బారత్ నినాదాలం మాత్రమే. మీరు స్వచ్ఛ భారత్‌కు పునాదులు. డ్రైనేజ్ క్లీనర్స్.. ఈ మాట పలుకుతుంటేనే ముఖం చిట్లిస్తారు. కానీ, మీరే లేకుంటే మేం రోడ్డుపై ఒక్క నిమిషం నిలబడలేం. మీరు మురికిలో ఉంటూ మమ్మల్ని శుభ్రంగా ఉంచుతున్నారు. చెప్పండి భయ్యా ఎలా ఉన్నారు?
యాదయ్య:  చూస్తున్నరు కదా సార్! మురికిగుంటల పని చేసుకుంటున్నం.

ఉత్తేజ్: మీరు ఈ పనిచేయవట్టే కదా! మేమింత హాయిగా ఉన్నాం. లేదంటే మ్యాన్‌హోల్స్‌లో పడి కాదు.. రోడ్డుపై పారే బురదలో కొట్టుకుపోయే వాళ్లం.
వెంకటేష్: మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు సంతోషం సార్.
రాములు: అవ్ సార్.. మమ్మల్ని చూసి మా చుట్టాలే దూరం జరుగుతరు.
యాదయ్య: పనైపోయినాంక స్నానం చేసే ఇంటికి వోతం. అయినా వాసనొస్తుందంటరు.
 
ఉత్తేజ్: తప్పు భయ్యా.. చిన్న పిల్లల మలమూత్రాలు ఎత్తిపోసే అమ్మ ఎంత గొప్పదో.. వీధుల్లో డ్రైనేజీ క్లీన్ చేసే మీరు అంతేనయ్యా.
అంజయ్య: గట్ల అర్థం చేసుకునేటోళ్లు ఎవరు సార్ !
 
ఉత్తేజ్: బతకడానికి ఎన్నో వృత్తులుండగా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు?
రాములు: బతకడానికే సార్. గీ పనీ దొరకక బాధలు పడేటోళ్లు చానామందున్నరు.
యాదయ్య: సార్ మేం ఉండేది జనగాం దగ్గర. పని చేసేది ఖైరతాబాద్‌లో.   

ఉత్తేజ్: ఎక్కడ జనగాం.. ఎక్కడ ఖైరతాబాద్ ! పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు ?
యాదయ్య: మూడు గంటలకు సైకిల్ మీద రైలు స్టేషన్‌కు పోత. ఆడ రెలైక్కి సిటీల దిగుత. మళ్లీ బస్సెక్కి ఖైరతాబాద్ చేరుకుంట.
 
ఉత్తేజ్: ఓ మైగాడ్.. ఈ పని చేయడానికా?
రాములు: అంతేగా సార్. పొట్టకూటి కోసం.. ఏదో ఒకటి చేసుకోవాలే.

ఉత్తేజ్: మీ పని వేళల గురించి చెప్పండి?
మహ్మద్ చాద్మియ: పొద్దుగాళ్ల ఏడు గంటలకే షురువైతది. అంతేనా.. ఎప్పుడు ఫోనొస్తే అప్పుడు ఉరకాలే. మేం బండి మీద పని చేసేటోళ్లం. ఏడ కంప్లైంటొస్తే ఆడికి పోతం.
 
ఉత్తేజ్: మురిగునీటిపై వాలిన దోమలు, ఈగలు ఇంట్లోకి వస్తేనే రకరకాల జబ్బులొస్తాయంటారు కదా! అలాంటిది మీరు పొద్దంతా మ్యాన్‌హోల్స్‌లోనే ఉంటారు. మరి మీ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి?
అంజయ్య: జ్వరాలొస్తయ్. దగ్గు, దమ్ము ఉండనే ఉంటయి. చర్మరోగాలు ఎక్కువొస్తుంటయి.
 
ఉత్తేజ్: అలాంటి జబ్బులొచ్చినప్పుడు మీకు ఉచితంగా వైద్యం అందుతుందా?
యాదయ్య: ఎన్ని జబ్బులొచ్చినా.. డాక్టర్ కాడికి పోతే సొంతం పైసలే పెట్టుకోవాలే. సర్కార్ నుంచి ఏ సాయం ఉండదు.
 
ఉత్తేజ్: చాలాసార్లు విన్నాను. మీ కార్మికులు పనులు చేస్తూ మ్యాన్‌హోల్లో పడి గాయాలపాలైనట్టు.. ప్రాణాలు కోల్పోయినట్టు..!
వెంకటేష్: చిన్న చిన్న దెబ్బలు తగిలితే వెంటనే మా ఆఫీసుల మందురాసి కట్టుకట్టేటోళ్లు ఉంటరు సార్. పెద్ద దెబ్బలు తాకితే సర్కార్ దవాఖానకు పోతం. అప్పుడప్పుడూ ఊపిరాడకనో.. దెబ్బ బలంగా తాకో ప్రాణాలే పోతయ్ సార్.
 
ఉత్తేజ్: మ్యాన్‌హోల్‌లో పడి సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వార్తలు పేపర్‌లో చదువుతుంటాం. దానికి కారణం ఎవరు..? మీరు కాదంటారా ?
రాములు: కచ్చితంగా మేం కాదు సార్. రోడ్డుపక్కన షాపుల వాళ్లు వారి షాపు ముందు నిలిచిపోయిన నీళ్లు పోయేందుకు రాత్రి పూట అక్కడున్న మ్యాన్‌హోల్ మూత తీసి పక్కన పెడ్తరు. నీళ్లు పోయినాంక మూత పెట్టరు. మేం చూస్తే మూసేస్తాం. లేదంటే అది గట్లనే ఉంటది. ఈ విషయం తెల్వక అందరూ మమ్మల్ని అంటరు.
 
ఉత్తేజ్: రోడ్డుపై మ్యాన్‌హోల్స్ పక్కన లోపలి నుంచి తీసిన చెత్తను కుప్పగా పెట్టి వదిలేస్తారు? దాని వల్ల దుర్వాసనతో పాటు రోడ్డంతా పాడవుతుంది కదా?
వెంకటేష్: అది మా పొరపాటే సార్. దానికీ కారణం ఉంది. మా దగ్గర మ్యాన్‌హోల్స్‌లో దిగి క్లీన్ చేసే ఉద్యోగులు చానమంది ఉన్నరు. చెత్త తీస్కవోయేటోళ్లు, బండ్లు తక్కువున్నయి.
మహ్మద్ చాద్మియ: అదొక్కటే కారణం కాదు సార్. గప్పట్ల ఏడపడ్తే ఆడ చెత్తకుండీలు ఉండేటియి. మేం ఎండిపోయిన చెత్తను తీస్కవోయి వాటిల్ల వేసేటోళ్లం. ఇప్పుడు కాలనీలళ్ల చెత్తకుండీలు పెట్టనిస్తలేరు. దాంతో ఎప్పటికప్పుడు చెత్తను తీసేయ్యడం కష్టమైతుంది.
 
ఉత్తేజ్: మీకు జీతాలు ఎట్లుంటయి భయ్యా ?
యాదయ్య: ఏదో ఉంటయి సార్. ఐదేళ్లు అనుభవం ఉంటే పది,పదిహేను వేల దాకా వస్తుంది. కానీ ఇప్పటి ఖర్చులకు ఏడ సరిపోతది సార్. ఈ సిటీల సంసారమంటే గీ ైపైసలు ఏడికి రావు.
 
ఉత్తేజ్: మీకు సొంతిళ్లో, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లో ఏమన్న ఉన్నాయా..?
రాములు: అందరం అద్దె ఇళ్లల్లనే ఉంటున్నం సార్.
 
ఉత్తేజ్: చివరి ప్రశ్న.. మీరు మందుకొట్టి ఈ పనిచేస్తారని అంటారు నిజమేనా?
అంజయ్య: మామూలుగా మ్యాన్‌హోల్ దగ్గరికి వస్తేనే కళ్లు తిరుగుతయ్. గసొంటిది తాగి దాంట్లకు దిగితే మళ్లీ పైకొస్తమా సార్. ఏ మాత్రం తేడా అయినా.. లోపల పడి చస్తం. పని అయినాంక మాత్రం తాగుతం. కష్టం మరచిపోనికి తాగుతం సార్.
 
ఉత్తేజ్: ఓ.. సారీ. నేను ఎక్కడో విని మిమ్మల్ని అడిగాను. మీరు చెప్పిన మాట నిజమే. బుర్ర సరిగా పని చేయనపుడు మ్యాన్‌హోల్ చుట్టుపక్కలకు రావొద్దు. చాలా ప్రమాదం.
జగ్గయ్య: అంతేగా సార్.
 
ఉత్తేజ్: రోడ్డుపై నుంచి వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసి ఉన్న మ్యాన్‌హోల్ కనిపించగానే కారు అద్దాలు ఎత్తేసుకుంటాం. అలాంటిది అందులోకి దిగి అక్కడ జీవన పోరాటం సాగించే మిమ్మల్ని కలసి మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది భయ్యా. థ్యాంక్యూ.

ఉత్తేజ్: ఇక బయలుదేరుతాను.. చెయ్యి ఇవ్వండి
యాదయ్య: అయ్యో వద్దుసార్. అంతా బురదవట్టింది. వాసనొస్తది.
 
ఉత్తేజ్: నీ చెయ్యి మురికిగా ఉంది కాబట్టే మేమంతా శుభ్రంగా ఉన్నాం. ఒక్కసారికి ఏం కాదు.
 

మరిన్ని వార్తలు