ఆలయంలో వెయ్యి టన్నుల బంగారు నిధి?

15 Oct, 2013 17:55 IST|Sakshi
ఆలయంలో వెయ్యి టన్నుల బంగారు నిధి?

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం  నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ నిధిలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు చెబుతున్నారు. వెయ్యి టన్నులా? అసలు అంత బంగారం ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. అయితే ఉన్నా ఉండవచ్చు అంటున్నారు.  కేరళలోని త్రివేండ్రం పద్మనాభస్వామి ఆలయంలో వెలుగు చూడలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

 దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్‌భక్ష్‌ సింగ్‌   శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఈ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్‌ సర్కారు చెబుతున్నారు.  ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానికి, రిజర్వ్‌ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు.  ఉన్నావ్‌ ప్రాంతంలో స్వామి శోభన్‌ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు.    పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో  తవ్వకాలు చేపట్టింది.  60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది.  ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో అక్కడ తవ్వకాలను ఈ నెల 18 నుంచి చేపట్టనున్నారు.  ఈ నిధి చుట్లూ  రాజు ఆత్మ తిరుగుతోందని స్వామి అంటున్నారు. తనకు విముక్తి కల్పించాలని ఆ ఆత్మ కోరుతున్నట్లు స్వామీజీ చెప్తున్నారు. బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకుంటున్నారు.  నిధి విషయం తెలిసినప్పటి నుంచి ఊళ్లో మగవాళ్లందరూ పనులు మానేసి గుడి చుట్టు కాపలా కాస్తున్నారు.  ఇక తమ దశ తిరిగిపోయినట్లు వారు ఊహించుకుంటున్నారు.

 

మరిన్ని వార్తలు