విలువ తెలిసినవారు

9 Feb, 2018 23:38 IST|Sakshi

చెట్టు నీడ

విలువైనవి ఆనందించడం  తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. 

ఒకానొక కాలంలో ఒక జెన్‌ గురువు ఉండేవాడు. ఆయన ఒక కొండవాలు దగ్గర చిన్న గుడిసె కట్టుకుని నివసిస్తుండేవాడు. ఆయన దగ్గర విలువైన వస్తువులు ఉండివుంటాయని పొరబడిన ఒక దొంగ ఒకరోజు రాత్రి  దొంగతనానికి వచ్చాడు. గుడిసెలో కొన్ని ముంతల్లాంటివి తప్ప అపహరించదగినవేవీ కనబడలేదు. కనీసం పాత బట్టలు కూడా లేవు. దొంగ తీవ్ర నిరాశ చెందాడు. అయితే, దొంగతనానికి వచ్చిన మనిషి అలికిడి విని గురువు నిద్ర లేచాడు. దొంగ ఉత్తిచేతుల్తో తిరిగి వెళ్లడం ఆయన్ని బాధించింది.  ‘మిత్రమా, కావాలంటే నువ్వు నేను వేసుకున్న బట్టలు తీసుకెళ్లు’ అన్నాడు.  దొంగ దానికి ఒప్పుకున్నాడు. గురువు వాటిని విడిచి ఇచ్చేశాడు. దొంగ వెళ్లిపోయాడు.  గురువు అలాగే ఆ రాత్రి ఆకాశంలో చందమామను చూస్తూ కూర్చున్నాడు.

దివ్యంగా వెలుగుతున్న జాబిలి అందానికి ముగ్ధుడై, ‘అయ్యో, అతడికి నేను పాత బట్టలు ఇచ్చిపంపానే; ఈ చందమామను ఇవ్వగలిగివుంటే ఎంత బాగుండేది’ అని తలపోశాడు.  ఈ కథ ఏం చెబుతోంది? దొంగతనం చేసినవాడిపట్ల కూడా చూపాల్సిన కరుణ గురించా? అదీ ఒక అంశమే. దానికన్నా కూడా ఇది చాటేది మరొకటుంది. విలువైనవి ఆనందించడం తెలిసినవాళ్లు అల్పమైన విషయాలను ఖాతరు చేయరు. బహుశా, మనలో చాలామందిమి దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామేమో!

మరిన్ని వార్తలు