సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..

8 May, 2015 00:25 IST|Sakshi
సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..

బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష ఖరారవడం నగరవాసుల్లో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ హీరోల్లో బహుశా ఎవరికీ లేనంత అనుబంధం సల్మాన్‌ఖాన్‌కి సిటీతో ఉంది. సల్లూభాయ్ నగరానికి వస్తే చాలు అతడిని చూడడానికి ఎగబడతారు. తన సినిమాలను సూపర్‌హిట్ చేయడంలో రికార్డులు సృష్టించిన జోధ్‌పూర్ వంటి నగరాలను దాటి సల్మాన్ మన హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి అభిమానులు సల్మాన్ మానియాకు కేరాఫ్‌గా నిలిచారనేది అధికారికంగా రూఢీ అయిన విషయం. అందుకే.. ‘సల్లూభాయ్ వుయ్ లవ్ యు’ అంటూ సిటీ సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.          - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
క్రేజ్‌కి కేరాఫ్   సల్లూభాయ్
 
 సల్మాన్‌కి సిటీ అంటే మహా ఇష్టం. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్స్ అంటే ఇష్టపడేవాడని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారు. తెలుగు నటి భూమికాచావ్లాతో నటించిన ‘తేరేనామ్’ ఇక్కడి సిటీ కాలేజ్‌లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఇంకా ‘వాంటెడ్’ తదితర సినిమాలూ షూటింగ్ జరుపుకున్నాయిక్కడ. మన బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా సల్మాన్‌కి చాలా ఇష్టం. తన సోదరి అర్పిత పెళ్లి నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయడం సిటీ మీద సల్మాన్‌కి ఉన్న అభిమానానికి నిదర్శనం. సల్మాన్ హోస్ట్ చేసిన టీవీ షో ‘బిగ్‌బాస్’లో తొలి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఖాసిఫ్ ఖురేషి నగరవాసే. సిటీలోని సబేరీ కళ్లజోడు షోరూమ్‌కి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి నడుడికి శిక్ష పడడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
 
అందరికీ మంచి చేసే వ్యక్తి..
 
పలు ఈవెంట్స్‌తో పాటు అర్పిత మ్యారేజ్‌కు సల్మాన్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా పనిచేశా. సీసీఎల్ ఆఫ్టర్ పార్టీలో సంతోష్‌నగర్‌కు చెందిన బౌన్సర్ రఫీఖ్.. సల్మాన్‌ని ఆర్మ్ రెజ్లింగ్‌లో ఓడించాడు. దీనికి ఏ మాత్రం ఫీలవ్వకపోగా, అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రశంసించాడు. తన దగ్గర పనిచేసేవారిని సల్లూభాయ్ బాగా చూస్తాడు. అందరికీ మంచి చేసే వ్యక్తికి శిక్ష పడడం వేదనకు గురిచేసింది.
 - మహ్మద్ అబ్రార్, సల్మాన్‌కు
 సిటీలో సెక్యూరిటీ
 
చాలా మారిపోయాడు..
 
చాలా బాధగా ఉంది. సిటీకి సల్మాన్ ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూసేవాడిని. తనని చూసే రెగ్యులర్‌గా బ్రాస్లెట్ వాడుతున్నా. హీరోగా ఎంత మంచి నటుడో.. వ్యక్తిగా అంత సహృదయుడు. ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ వంటి చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఐదేళ్ల ఖైదు వల్ల సినిమాలకు మాత్రమే కాదు.. ఆయన్ను నమ్ముకున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత తను చాలా మారాడు. వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఒక అభిమానిగానే కాకుండా ఆయన కారణంగా సాయం పొందుతున్న వారి తరపున ఆలోచించి బాధపడుతున్నా. - అహ్మద్‌ఖాన్, ఈవెంట్ కో ఆర్డినేటర్
 
 రియల్ ‘హ్యూమన్’ సల్మాన్
 
చిన్నప్పటి నుంచీ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు కలవాలనుకున్నా కుదర్లేదు. అతను చేసే చారిటీ కార్యక్రమాలు నాలో మరింత అభిమానాన్ని పెంచాయి. అలాంటిది.. అతనికి ఇలా శిక్ష పడడం చాలా బాధగా అనిపిస్తోంది. తన వల్ల చాలా మంది చిన్నారులు సేవ్ అయ్యారు. దేవుడు అతనికి మంచి చేయాలని కోరుకుంటున్నాను.
  - ప్రత్యూష, సిటీ మోడల్
 
 

మరిన్ని వార్తలు