మళ్లీ వస్తున్నా!

16 Sep, 2018 00:27 IST|Sakshi

‘పదమూడేళ్ల తరువాత అంజలి మళ్లీ నన్ను చూసింది. అంజలిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. గుర్తు పట్ట లేదు. గుర్తు కూడా లేనా!’ ‘మళ్లీ రావా’ సినిమాలో అంజలిని చూస్తూ కార్తిక్‌ మనసులో అనుకున్న మాటలివి. ‘మళ్లీ రావా’  మంచి సినిమా అనిపించుకోవడంతో పాటు ‘ఎవరీ అంజలి? బాగా చేసింది’ అనే ప్రశంస కూడా వచ్చింది. ‘మళ్లీ రావా’ తరువాత మళ్లీ కనిపిస్తుందో లేదో అనుకున్న  ఆకాంక్ష సింగ్‌... అదేనండీ అంజలి త్వరలో నాగార్జున–నానీల ‘దేవదాస్‌’లో కనిపించబోతుంది. ఆకాంక్ష తన గురించి చెప్పిన కొన్ని విషయాలు...

చిన్నప్పుడు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. డ్యాన్సర్‌ కావాలనుకునేదాన్ని. అమ్మ, సోదరి థియేటర్‌ ఆర్టిస్ట్‌లు. పదిహేనో యేట  థియేటర్‌  ఆర్టిస్ట్‌గా నా ఆరంగేట్రం మొదలైంది. పదికి పైగా నాటకాల్లో నటించాను.‘ఇక్కడ చేయడానికి ఎంతో ఉంది’ అనిపించింది. ఒకప్పుడు అద్దం ముందు  నిల్చొని సరదాగా డైలాగులు చెప్పేదాన్ని. అలాంటి నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌గా  నటనను సీరియస్‌గా తీసుకున్నాను.

మొదటి నుంచి చదువులో  ముందు ఉండేదాన్ని. సినిమా రంగంలో అస్థిరత్వం ఎక్కువ. ఇవ్వాళ ఉన్నట్లు  రేపు ఉండకపోవచ్చు. రేపు  ఏమిటనేది ఎవరూ చెప్పలేరు. ఈ భావన అంతర్లీనంగా  ఉండేదేమో తెలియదుగానీ నాకు చదువుపై శ్రద్ధ ఎక్కువగా ఉండేది. చదువు అనేది ఎప్పటికీ ముఖ్యమైనదే. మనం ఏదీ కావాలనుకున్నా  ‘చదువు’ అనే పునాది  గట్టిగా ఉండాలి.

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే కలర్స్‌ టీవీలో ‘న బోలే తుమ్‌ న మైనే కుచ్‌ కహా’ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. ‘చేయగలనా?’ అనిపించింది. ఎందుకంటే అది విడో పాత్ర. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఛాలెంజింగ్‌గా  అనిపించింది.ఫ్లైవోవర్‌  కూలిన దుర్ఘటనలో మేఘావ్యాస్‌ అనే యువతి  భర్తను కోల్పోతుంది. నాసిరకం సామగ్రిని ఉపయోగించి నిర్మించిన ఫ్లైవోవర్‌ తన భర్తను బలితీసుకుంటుంది.  ఇద్దరు పిల్లల తల్లి అయిన మేఘావ్యాస్‌ దీనిపై న్యాయపోరాటానికి దిగుతుంది. లోతైన భావోద్వేగాలు ఉన్న పాత్ర ఇది. మేఘావ్యాస్‌ నటనపరంగా నన్ను రెండు మెట్లు పైకి ఎక్కించింది. అందుకే  ఆ  పాత్ర విషయంలో... ‘నో రిగ్రేట్స్‌’ అని చెబుతుంటాను.

‘బాహుబలి’కి ముందు హిందీలోకి డబ్‌ అయిన తెలుగు సినిమాలు చూడడం తప్ప వాటి గురించి పెద్దగా తెలియదు. ‘బాహుబలి’ నాకు బాగా నచ్చింది. ప్రభాస్, విక్రమ్, మాధవన్‌లతో నటించాలని ఉంది. ‘మళ్లీ రావా’ సినిమాతో తొలిసారిగా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. నిజానికి భాష తప్ప అక్కడికి(ముంబై)  ఇక్కడికి పెద్ద తేడా అనిపించలేదు. ఇక్కడ ఆతిథ్యం, అభిమానం గొప్పగా ఉంటాయి. ఈ సినిమాలో డైలాగులను బట్టీ పట్టడం కాకుండా వాటి అర్థాన్ని, భావోద్వేగాలను, యాసను  తెలుసుకునేదాన్ని. అరువు గొంతు కంటే సినిమాలో నా గొంతు వినబడడానికే ఎక్కువ ఇష్టపడతాను.

ఏదైనా త్వరగా నేర్చుకుంటానని ‘క్విక్‌ లెర్నర్‌’ అని నాకు పేరు. ఇప్పుడు చిన్న చిన్న తెలుగు పదాలకు అర్థాలు తెలుసు.  ‘మళ్లీరావా’ సినిమా ద్వారా నాగార్జున ‘దేవదాస్‌’లో నటించే అవకాశం వచ్చింది. ‘మళ్లీరావా’తో తెలుగుతో కలిగిన పరిచయం ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. బాలీవుడ్‌ సినిమా ‘బద్రీనాథ్‌ కీ దునియా’లో చిన్న పాత్రలో కనిపించాను. అది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు తెచ్చింది.

మరిన్ని వార్తలు