దారి చూపుతున్న పాకెట్ మనీ

15 May, 2016 01:23 IST|Sakshi
అక్షరాలు నేర్పుతూ...అమ్మకే అమ్మ అవుతూ..

ఆదర్శం
విద్యార్థికి చదువు అనేది విలువైన బహుమతి. విజ్ఞానం నుంచి మాత్రమే కాదు విషాదం నుంచి కూడా విలువైన పాఠాలు నేర్చుకునేవాళ్లే నిజమైన విద్యార్థులవుతారు. చెన్నైలోని ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూలు’ విద్యార్థులను గమనిస్తే వారు నేర్చుకునే పాఠాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని, జీవితం నుంచి కూడా నేర్చుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. గత సంవత్సరం చెన్నై వీధుల్లో భిక్షాటన చేసిన సరోజ... ఇప్పుడు పెరంబూర్ బస్‌స్టాప్ సమీపంలో రకరకాల ఫ్యాషన్ వస్తువులు అమ్ముతున్నారు.

ఒక్క సరోజ మాత్రమే కాదు భిక్షాటనే ప్రపంచంగా బతికిన  కొద్దిమంది యాచకులు ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంతకాళ్ల మీద నిలబడ్డామనే తృప్తి వారి కళ్లలో బలంగా కనిపిస్తోంది. ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూల్’ విద్యార్థులు తమ పాకెట్‌మనీతో యాచకులను మార్చడానికి, వారిని కొత్త దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. యాచకవృత్తిని వదిలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లలో సరోజ నుంచి నాగర్ వరకు ఎందరో ఉన్నారు. ‘‘ఒకప్పుడు రూపాయి కోసం కూడా చేయి చాపాల్సి వచ్చేది.

ఇప్పుడు నేను సొంతకాళ్ల మీద నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను. ఇదంతా ఆ పిల్లల చలవే. వారిది చల్లని మనసు’’ అంటోంది సరోజ. రోశమ్మ అనే యాచకురాలిని తమ స్కూల్లో హౌస్‌కీపర్ ఉద్యోగంలో చేర్పించడం ద్వారా ఆమెను యాచకవృత్తి నుంచి బయటికి వచ్చేలా చేశారు విద్యార్థులు.  చిరిగిన మురికి దుస్తులతో దేవాలయాల దగ్గర యాచించే నాగర్ ఇప్పుడు ఆ పనికి స్వస్తి చెప్పాడు. ఒక స్టడీ టేబుల్ మీద చాక్లెట్లు అమ్ముతూ ఎవరినీ యాచించకుండా  పొట్ట నింపుకుంటున్నాడు. అతడిలో మార్పు రావడానికి కారణం స్కూలు పిల్లలు. అయితే అందరు యాచకులు ఒకేలా స్పందించలేదు.
 
‘‘మాకు ఎవరి సహాయం అక్కర్లేదు’’ అని కొందరు ఎప్పటిలాగే యాచననే నమ్ముకున్నారు. అలాంటి వాళ్లలో కూడా కొందరిని మాటలతో మార్చారు ఆ విద్యార్థులు.
  ఆర్థిక సహాయం చేసి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొనేలా చేయడమే కాదు... ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి సెక్యూరిటీ గార్డ్, స్వీపర్...మొదలైన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. ఒక చిన్న సంఘటన విద్యార్థుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది.
 ఒకసారి స్కూలు ముందు చిన్న అబ్బాయి, అమ్మాయి అడుక్కుంటూ కనిపించారు.

ఈ దృశ్యం విద్యార్థుల మనసులను కదిలించింది. ఇక అప్పటి నుంచి ‘బెగ్గర్‌లెస్ సొసైటీ’ నినాదంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ‘‘ఆనందం అనేది ఆటపాటల్లోనే కాదు...సేవ చేయడంలో కూడా ఉంటుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’’ అంటాడు క్రిస్టీ అనే విద్యార్థి.
 
‘‘యాచకులను చాలామంది దూరం పెడతారు. నిజానికి వారి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి మాటలు చెబితే... వారు యాచనకు దూరం అవుతారు. కొత్త జీవితాన్ని మొదలుపెడతారు’’ అంటోంది రోషిణి అనే విద్యార్థిని.
 ‘‘నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వంతో కూడిన మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఈ దిశలో అడుగులు వేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్ అనిత డేనియల్.
 విద్యార్థుల దగ్గర ధన సహాయాన్ని పొందిన వాళ్లలో కొందరు యాచకులు మళ్లీ కనిపించలేదు.

కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకొని సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు గానీ మద్యానికి బానిసై పక్కదోవ పడుతున్నారు. అయితే ఇవేమీ  విద్యార్థులను నిరాశపరచడం లేదు. మార్పు అనేది ఒక్క అడుగుతో. ఒక్కరోజుతో మొదలు కాదనే విషయం వారికి తెలుసు. అందుకే భవిష్యత్ పట్ల ధీమాగా ఉన్నారు. బెగ్గర్‌లెస్ సొసైటీ గురించి చిన్న వయసులోనే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు