స్నేహ అంతరంగావిష్కరణ

28 Jun, 2015 01:01 IST|Sakshi
స్నేహ అంతరంగావిష్కరణ

ఇంటర్వ్యూ
స్నేహకి ఇప్పుడు రెండు గుండెలు. తనదో గుండె,
తన కడుపులోని బిడ్డది మరోగుండె.
మరో రెండు నెలల్లో ఆ ఇంట్లో ‘కువా కువా..’ శబ్దం వినిపించనుంది.
ఇటీవలే సీమంతం జరుపుకున్న స్నేహ...
అంతరంగావిష్కరణ ఈ ‘ఫన్‌డే’ స్పెషల్.


 
అమ్మ కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏమనిపించింది?
జీవితంలో ఇదో ప్రత్యేకమైన దశ. ‘మీరు అమ్మ కాబోతున్నారు’ అని డాక్టర్ నోటి నుంచి వినగానే ఒళ్లంతా పులకరించింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలున్నాయి. కానీ, ఈ ఆనందం చాలా ప్రత్యేకం.
     
ఆనందమేనా? భయం కూడానా?
భయం కాదు కానీ, ఒక్కసారిగా బాధ్యత పెరిగిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో అన్ని బాధ్యతల్లోకెల్లా బిడ్డని కనడం, పెంచడం పెద్ద బాధ్యత.
     
కొంతమందిని వేవిళ్లు (వాంతులు) తెగ ఇబ్బందిపెట్టేస్తాయ్... మీకలాంటివి?
అదృష్టం కొద్దీ అలాంటివేవీ లేవు. కాకపోతే, అప్పుడప్పుడు నీరసంగా అనిపిస్తోంది. అదేం పెద్ద విషయం కాదు.
     
మొదటిసారి స్కానింగ్‌లో...?
మూడో నెలలో తీసినప్పుడు నామమాత్రంగా ఓ రూపం కనిపించింది. ఆ మాత్రానికే సంతోషం పట్టలేకపోయా. ఆనందంతో ఏడుపొచ్చేసింది.
     
బిడ్డ గుండె చప్పుడు విన్నారా?
అది సో స్వీట్. ‘నీకు పుట్టబోయే బిడ్డ హార్ట్ బీట్ వింటావా’ అని డాక్టర్ అడిగినప్పుడు చాలా ఎగ్జయిట్ అయిపోయాను. లబ్ డబ్ అని శబ్దం వినగానే, నా హార్ట్ బీట్ పెరిగినంత పనైంది. అదంతా ఆనందంతోనే.
     
నెలలు నిండే కొద్దీ...?
చిన్న చిన్న కాళ్లు, చేతులు చూసి, ‘జీవితం ఎంత మాయ. ఒక మనిషిలో ఇంకో మనిషి పెరగడమా’ అనుకున్నా. అప్పటికప్పుడు ఆ కాళ్లను ముద్దాడాలని మనసు తపించిపోయింది.
     
గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?
అక్క, వదినలను దగ్గరగా చూశాను. గర్భం ధరించినప్పట్నుంచీ, బిడ్డ పుట్టే వరకూ ఎలాంటి జాగ్రత్తలు పాటించారో, బిడ్డ పుట్టాక ఎలా పెంచారో చూశాను.
     
బాబు కావాలనుకుంటున్నారా? పాపా?

నాకూ, మా ఆయనకు (హీరో ప్రసన్న) ఎవరైనా ఓకే. ఫస్ట్ బేబీ అప్పుడు ఎవరైనా ఫర్వాలేదనుకుంటాం. మొదటిసారి బాబు పుడితే, రెండో సారి పాపను కోరుకుంటాం. అయినా మన చేతుల్లో ఏముంటుంది?
     
‘శ్రీరామదాసు’లో అమ్మ పాత్ర చేసే నాటికే మీరు అమ్మ అయ్యుంటే ఇంకా బాగా నటించేదాన్ని-అనుకున్నారా?
లేదు, ఎందుకంటే, అప్పటికే ‘అమ్మా’ అనే పిలుపుకి నేను అలవాటు పడిపోయా.
     
అదెలా?
మా అక్క కొడుకు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తాడు. బయటవాళ్లు చూస్తే, వాడు నా కొడుకే అనుకుంటారు.
     
అత్తవారింట్లో...
మా అత్తగారింటికి రాబోతున్న మొదటి గ్రాండ్ చైల్డ్ కావడంతో అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలామందికి ఏవేవో తినాలపిస్తుందట. నాకు మాత్రం ఏమీ తినాలనిపించడం లేదు. మా అత్తగారైతే నేనేం కావాలంటే అది చేసి పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
     
మరి... మీ భర్త గురించి?
ఆయనైతే మరీనూ. కాలు కిందపెడితే కందిపోతానేమో అనే టైప్‌లో చూసుకుంటున్నారు. ఇలా ఇంట్లో అందరూ ప్రత్యేకంగా చూడటం భలే ఉంటుంది. అందుకే, ఈ దశ జీవితాంతం గుర్తుండిపోతుంది.
     
పసిపిల్లలకు స్నానం... అదీ...?
మా అక్క పిల్లాడికి నేనే స్నానం చేయించేదాన్ని. శుభ్రంగా స్నానం చేయించి, కాసేపు ఎండ సోకేలా బిడ్డను కాళ్ల మీద పడుకోబెట్టుకుని, ఒంటి నిండా పౌడరు వేసి, మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరి సహాయమూ లేకుండా నా బిడ్డను నేనే పెంచగలుగుతాను.
     
మీరు ప్రెగ్నెంట్ అని వినగానే అభిమానులు పటాసులు కాల్చి పండగ చేసుకున్న విషయం తెలుసా?
అవునవును. ఆ ఫొటోలు మా ట్విట్టర్‌కి కూడా పంపించారు. కుప్పలు తెప్పలుగా శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. ‘స్నేహా సిస్టర్.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ జాగ్రత్తలు చెప్పారు. ఆ అభిమానానికి కదిలిపోయాను.
     
మళ్లీ సినిమాలు చేస్తారా?
అసలు కెరీర్ గురించి ఏమీ ఆలోచించడంలేదు. ఇది ఎంజాయ్ చేసే దశ. దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా.
 
ఓకేనండీ.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాం...
చాలా చాలా థ్యాంక్సండీ.
 - డి.జి. భవాని  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు