మాస్టర్ మైండ్

1 Nov, 2015 00:25 IST|Sakshi
మాస్టర్ మైండ్

క్రైమ్ ఫైల్
మార్చి 19, 2004... కన్సాస్ (యు.ఎస్.)...
టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగు తున్నాడు ఇన్‌స్పెక్టర్ జేమ్స్. సబార్డినే ట్లంతా ఆయనేం చెబుతాడా అని చూస్తున్నారు రెప్ప వేయకుండా. పది నిమిషాల తర్వాత నోరు విప్పాడు జేమ్స్.
 ‘‘కొన్ని నెలల క్రితం పక్క రాష్ట్రంలో కొన్ని హత్యలు జరిగాయి. వేర్వేరు కుటుం బాలకు చెందినవారు, వేర్వేరు వయసుల వారు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు... కానీ అందరూ ఒకేలా హత్యకు గురయ్యారు. వాళ్లలో మగవాళ్లున్నారు, ఆడవాళ్లున్నారు.

అత్యాచారం చేసి, కాళ్లూ చేతులూ కట్టేసి, తాడు మెడకు బిగించి చంపారు. హత్య జరిగిన ప్రతిచోటా ‘బీటీకే’ అన్న మూడక్షరాలు రాసివున్న కాగితం దొరికింది’’ అని చెప్పి ఆగాడు జేమ్స్.
 ‘‘అంటే ఏంటి సర్?’’ అన్నాడు రోనీ.
 
తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు జేమ్స్. ‘‘అది తెలుసుకోవడంలో అక్కడి పోలీసులు పూర్తిగా ఫెయిల య్యారు. కానీ మనం సక్సెస్ కావాలి.’’
 అందరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘మనకేం సంబంధం సర్? అది మన పరిధిలోకి రాదు కదా?’’ అన్నాడు మరో సబార్డినేట్ పాల్సన్.
 ‘‘ఆ హంతకుడు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నాడు.’’
 అందరూ అలెర్ట్ అయ్యారు. ‘‘అంటే ఇక్కడ హత్యలు మొదలెట్టాడా సర్?’’ అడిగాడు రోనీ ఆదుర్దాగా.
 ‘‘లేదు. కానీ మొదలుపెడతాడేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే... ఇవాళ నా ఆఫీసుకు ఒక లెటర్ వచ్చింది’’ అంటూ టేబుల్ మీద ఉన్న కాగితాన్ని అందుకున్నాడు జేమ్స్. మడతలు విప్పి, చదవడం మొదలుపెట్టాడు.
 
‘‘మై డియర్ ఫ్రెండ్స్. నేను వచ్చేశా. మీకోసం చాలా సర్‌ప్రైజులు తీసుకొచ్చా. అవి మీకు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో ఇప్పుడే చెప్పలేను. అయినా సర్‌ప్రైజులు ఇవ్వడం నాకు కొత్తకాదు. అందుకోవడం మీకూ కొత్త కాదు. నన్ను మర్చిపోయా రేమోనన్న అనుమానంతో గుర్తు చేయ డానికి కొన్ని తీపి జ్ఞాపకాలు పంపు తున్నాను’’... చదవడం ఆపి టేబుల్ మీద ఉన్న ఫొటోలు తీసి చూపించాడు జేమ్స్. తర్వాత మళ్లీ చదవడం మొదలెట్టాడు.
 ‘‘ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు వికీ వెగర్లీ. 1986, సెప్టెంబర్ 16న నా చేతుల్లో కన్నుమూసింది. చనిపోయే ముందు నాకు చాలా సంతోషాన్ని, తృప్తిని మిగిల్చింది.

అందుకే తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరూ మర్చిపోకండి. తనని కాదు, నన్ను. బై - బిల్ థామస్ కిల్‌మేన్.’’
 అందరూ అవాక్కయిపోయారు. ‘‘బీటీకే అంటే బిల్ థామస్ కిల్‌మేన్ అన్నమాట. ఎంత పొగరు వాడికి! వాణ్ని వదలకూడదు సర్’’ అన్నాడు రోనీ కసిగా. అందరి పిడికిళ్లూ బిగుసుకున్నాయి.
 ‘‘వదలం రోనీ. వాణ్ని మనం పట్టుకుంటున్నాం. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. ఇప్పటికి పదిమందిని చంపేశాడు. పదకొండో మనిషి వాడి చేతికి చిక్కడానికి వీల్లేదు’’ అన్నాడు జేమ్స్ గంభీరంగా.
 కానీ అతను అనుకున్నది జరగలేదు. ఆ హంతకుడిని పట్టుకోవడం వాళ్ల వల్ల కాలేదు. రాత్రింబవళ్లు తిరిగారు. కానీ అతను దొరకలేదు.
     
జూన్ 9, 2004. కవర్ తెరిచాడు జేమ్స్. ఓ ఫ్లాపీ ఉంది. దానిమీద ‘బీటీకే స్టోరీ’ అని రాసి ఉంది. ఆ ఫ్లాపీలో బీటీకే కిల్లర్ గురించి పలు పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్, క్రైమ్ సీన్స్‌కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. మరణం మీద రాసిన ఓ కవిత కూడా ఉంది. చివరిలో... ‘‘మరణం అనేది ఓ వరం. ఆ వరాన్ని నేను ఎంతోమందికి అందించాను. అందిస్తూనే ఉంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. చివరికి మీరు కూడా’’ అన్న మెసేజ్ ఉంది.
 
జేమ్స్‌కి బీపీ వచ్చేసింది. చేతిలో ఉన్న ఫ్లాపీ కవర్‌ని విసిరి కొట్టాడు. ‘‘స్కౌండ్రల్. ముప్ఫయ్యేళ్లుగా తప్పించుకు తిరుగుతు న్నాడు. పైగా మనల్నే వెక్కిరిస్తున్నాడు. ఐ విల్ సీ హిజ్ ఎండ్’’ అంటూ ఆవేశంగా అక్కడ్నుంచి కదిలాడు.
 డెట్రాయిట్‌లోని ఓ అపార్ట్‌మెంట్ తలుపు తెరచుకుంది. తలుపు తీసిన యువతి వయసు ముప్ఫైలోపే ఉంటుంది. తెల్లగా, అందంగా ఉంది.
 ‘‘ఎస్... ఎవరు కావాలి?’’ అంది ఎంతో మృదువుగా.
 జేమ్స్ తన జేబులోని ఐడీ కార్డ్ తీసి చూపించాడు. ఆమె నొసలు ముడిచింది. ‘‘పోలీసులా? ఏం జరిగింది సర్? ఎవరి కోసం వచ్చారు?’’ అంది కంగారుగా.
 
జేమ్స్, అతని టీమ్ లోపలికి నడి చారు. ‘‘మీ పేరు తెలుసుకోవచ్చా?’’ అన్నాడు జేమ్స్ ఇల్లంతా పరిశీలిస్తూ. ‘‘కెర్రీ... కెర్రీ రాసన్’’ చెప్పిందామె.
 ‘‘బీటీకే అంటే తెలుసా మిస్ కెర్రీ?’’
 ‘‘మిస్ కాదు... మిసెస్ కెర్రీ. నాకు తెలియదు బీటీకే అంటే ఏమిటో?’’
 ‘‘పోనీ బిల్ థామస్ కిల్‌మేన్ ఎవరో తెలుసా?’’
 తెలీదన్నట్టు తలూపి, ‘‘ఎవరతను?’’ అడిగింది.
 ‘‘మీ నాన్న’’
 విస్తుపోయింది కెర్రీ. ‘‘మా నాన్నగారి పేరు అది కాదు. డెన్నిస్ రాడర్.’’
 
నవ్వాడు జేమ్స్. ‘‘తెలుసు. కొద్ది సేపటి క్రితం మేం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతను ఓ సీరియల్ కిల్లర్. పదిమందిని అనుభవించి, అత్యంత కిరాతంగా చంపేసిన క్రూరుడు. తనను పట్టుకొమ్మంటూ పోలీసులకే సవాలు విసిరిన పొగరబోతు. దురదృష్టంకొద్దీ... అతడు మీ నాన్నే.’’
 అవాక్కయిపోయింది కెర్రీ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదామెకి. మౌనంగా సోఫాలో కూలబడిపోయింది.
 ‘‘ఏంటి కెర్రీ? ఎవరు వీళ్లు? ఏమంటున్నారు?’’ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి వచ్చింది, అప్పుడే లంచ్‌కి కూర్చున్న కెర్రీ తల్లి పౌలా. ఆమె ఎవరు అన్నట్టుగా కెర్రీ వైపు చూశాడు జేమ్స్. ‘‘మా అమ్మగారు... పౌలా రాడర్’’ అంది కెర్రీ.
 ‘‘సారీ మిసెస్ రాడర్. మీకు ఈ విషయం ఇలా చెప్పాల్సి రావడం బాధా కరమే. కానీ తప్పదు. మీ భర్త డెన్నిస్ రాడర్ ఒక సీరియల్ కిల్లర్. ఇందాకే అరెస్ట్ చేశాం. మీరు, మీ అమ్మాయి స్టేషన్‌కి వస్తే కొన్ని వివరాలు తీసుకోవాలి. మళ్లీ కలుద్దాం’’ అనేసి కదిలాడు జేమ్స్. లిఫ్టులోకి వెళ్లేవరకూ వెనుక నుంచి పౌలా గట్టిగట్టిగా ఏడుస్తోన్న శబ్దం వినిపిస్తూనే ఉంది అతనికి.
     
‘‘ఎట్టకేలకు దొరికావ్ మిస్టర్ రాడర్. ఓ సారీ... బీటీకే, బిల్ థామస్ కిల్‌మేన్.’’
 జేమ్స్ అలా అనగానే నవ్వాడు డెన్నిస్. ‘‘నో... బిల్ థామస్ కిల్‌మేన్ కాదు. బైండ్... టార్చర్... కిల్. అంటే కట్టు... హింసించు... చంపు’’ అన్నాడు ఎంతో కూల్‌గా.
 ‘‘అలాగే చంపావ్‌గా అందరినీ. సిగ్గుగా లేదూ ఈ పని చేయడానికి? ఆడా లేదు మగా లేదు. చిన్నా లేదు పెద్దా లేదు. మితిమీరిన కోరికతో నీ కళ్లు మూసుకు పోయాయి’’ అన్నాడు జేమ్స్ చిరాకు పడుతూ.
 
డెన్నిస్ రియాక్ట్ కాలేదు. నవ్వుతూ జేమ్స్ వైపు చూస్తున్నాడు. ‘‘ఆవేశపడకండి సర్. మొత్తానికి దొరికానుగా, ఇంకా ఎందుకు బీపీ పెంచుకుంటారు! అయినా నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. బీటీకే కిల్లర్ నేనేనని ఎలా కనిపెట్టారు మీరు?’’
 చిర్రెత్తుకొచ్చింది జేమ్స్‌కి. ఇన్‌స్పెక్టర్ తను. ప్రశ్నలు తను వేయాలి. క్రిమినల్‌గాడు... వాడు వేస్తాడేంటి?
 ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఓ చోట తప్పటడుగు వేస్తాడు మిస్టర్ రాడర్. ఫ్లాపీ పంపించావ్‌గా. దానిలో డేటా ఎక్కించిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టవచ్చని, దాని ద్వారా ఆ ఐపీ ఉన్న కంప్యూటర్‌ను ట్రేస్ చేయొచ్చని నీకు తెలియదో, తెలిసినా మర్చిపోయావో నాకు తెలీదు. ఆ ఫ్లాపీయే నిన్ను పట్టించింది. పాపం, చాలా తెలివైనవాణ్ని అనుకున్నావ్ కదూ?’’
 ‘‘ముప్ఫయ్యేళ్లుగా నన్ను పట్టుకోలేక ముప్పుతిప్పలు పడ్డారు. దాన్ని బట్టి తెలియడం లేదా ఎవరు తెలివైనవాళ్లో! నిజం మీకూ తెలుసు. కాకపోతే ఒప్పుకోవ డానికి మీ ఇగో అడ్డు వస్తోందంతే.’’
 
లాగిపెట్టి కొట్టాడు జేమ్స్. ‘‘నీలాగే చాలామంది క్రిమినల్స్ తెలివైనవాళ్లం అనుకుంటారు. పోలీసుల్ని పిచ్చివాళ్లుగా జమకడతారు. చివరికి మేము గెలవకా తప్పదు. మీరు మా చేతుల్లో నలగకా తప్పదు. దేవుడనేవాడే ఉంటే, నీలాంటి క్రూరుణ్ని ఇక ఈ భూమి మీద ఒక్క క్షణం ఉండనివ్వడు. నీకు మరణశిక్ష పడి తీరుతుంది.’’
 ఆ క్షణంలో జేమ్స్ అన్న మాట తథాస్తు దేవతలు విన్నట్టు లేరు. అందుకే డెన్నిస్‌కి మరణశిక్ష పడలేదు. కాకపోతే మరణించేవరకూ నరక యాతన అనుభ వించమంటూ న్యాయస్థానం శపించింది. అతడు చంపిన మనిషికో జీవితఖైదు చొప్పున పది జీవితఖైదులు విధించింది. 175 యేళ్ల తర్వాత గానీ బెయిలుకు అప్లై చేయడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది.
 అన్నేళ్లు అతను బతికుండడు. అప్పటి వరకూ బతికినా అది బతుకూ కాదు. ఆ విషయం... జైలు గోడల మధ్య జీవచ్ఛవంలా బతుకుతోన్న డెన్నిస్‌కి ఇప్పటికైనా అర్థమైందో లేదో మరి!
 - సమీర నేలపూడి
 
డెన్నిస్ రాడర్ కేసు నడుస్తుండగానే అతని భార్య అనారోగ్యంతో మరణించింది. అతని కూతురు కెర్రీ... తన తండ్రి ఓ కసాయి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నేటికీ తల్లడిల్లుతోంది. ‘బయటికెళ్లినప్పుడు జాగ్రత్తమ్మా, మనుషులు మంచోళ్లు కాదు’ అంటూ చెప్పిన తన తండ్రే మంచోడు కాదని, తనలాంటి కొందరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోతోంది. కెర్రీయే కాదు, డెన్నిస్ అలాంటివాడంటే ఎవ్వరూ నమ్మలేదు. అతను మంచి ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. స్థానిక లూథరన్ చర్చికి పెద్దగా వ్యవహ రించేవాడు. కూల్‌గా, వినయంగా, అందరితో ఆప్యాయంగా ఉంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఉన్నట్టుండి అతడో మేకవన్నె పులి అని తెలిస్తే నమ్మడం కష్టమే కదా మరి!

మరిన్ని వార్తలు