హార్న్ ఆఫ్ ఆఫ్రికా

22 Sep, 2017 12:44 IST|Sakshi
హార్న్ ఆఫ్ ఆఫ్రికా

జిబౌటి
హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి... జిబౌటి. ఈ దేశానికి  ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు.

60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిరసనలు ఆగలేదు.
 
స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది.
ఎట్టకేలకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి.
ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, మరోవైపు ‘ఈ చిన్న దేశం... అంతర్యుద్ధాలతో  కుప్పకూలిపోవడం ఖాయం. దేశానికి భవిష్యత్ లేదు’ అనే జోస్యాలు మొదలయ్యాయి.
దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు... దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో... ఆ అనుమానాలు,  అంచనాలేవీ నిజం కాలేదు.
 
1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది.
 పరిపాలనపరంగా జిబౌటి ఆరు విభాగాలుగా విభజించబడింది. వీటిని 11 జిల్లాలుగా విభజించారు.
 820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగుబంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో కానుక.
 కళల విషయానికి వస్తే... జిబౌటి సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర     ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది.
 
తక్కువ వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు.
అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది.
 
టాప్ 10

1. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి.
2. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది.
3. {ఫెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది.
4. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ ఇంటి అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
5. జిబౌటిలో మాత్రం క్రిస్మస్‌ను జనవరి 7న జరుపుకుంటారు.
6. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి.
7. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు.
8. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్‌లను మాట్లాడతారు.
9. కన్‌స్ట్రక్షన్, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్, సాల్ట్‌మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ... మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు.
10. దేశంలో అక్షరాస్యత 68 శాతం.

మరిన్ని వార్తలు