వివేకం: మీ పథకం ప్రకారమే మీ జీవితం సాగాలా?

16 Feb, 2014 01:12 IST|Sakshi
వివేకం: మీ పథకం ప్రకారమే మీ జీవితం సాగాలా?

మీ పథకానికి, మీ ఆకాంక్షలకు మించి ఇంకా ఎంతో ఉన్నతంగా మీ జీవితం సాగాలని ఎప్పుడూ కలలు కనండి.  పథకం అంటే ముందస్తు ఆలోచన. మన ఆలోచనలన్నీ మనకు ఇంతకు ముందుగా తెలుసున్న దాన్నుంచే వస్తాయి. అంటే గతంలోని ఓ భాగాన్ని తీసుకొని దానికి మెరుగులు దిద్దడంగా ప్రణాళికను చెప్పుకోవచ్చు. ఇది చాలా హీనమైన జీవన విధానం. వాస్తవానికి మనకు ప్రణాళిక అవసరమే. కానీ మీ ప్రణాళిక ప్రకారమే మీ జీవితం సాగుతున్నదంటే, మీరు చాలా హీనమైన జీవితాన్ని గడుపుతున్నారన్నమాట. అలా కాక, మీరు ఊహించని రీతిలో మీ జీవితం సాగించాలి.
 
 ఎవరూ ప్రణాళికలు రచించలేనంత విస్తారమైనది జీవితం. ప్రణాళిక అనేదాన్ని వేసుకోండి, అయితే దానిని అలానే ఉంచి, జీవితాన్ని మాత్రం దాని తీరులోనే సాగనివ్వండి. ఎప్పటికప్పుడు జీవితం అందించేవాటిని శోధించి చూడండి. ఏమి ఎదురౌతుందో మీరు ఊహించలేరు. మరెవరికీ ఇంతవరకూ సంభవించనిదేదో మీకు జరగవచ్చు. మీ పథకం ప్రకారమే మీ జీవితం సాగుతున్నట్టయితే, ఇంతవరకూ ఈ ప్రపంచంలో జరుగుతూ వచ్చిన పనికిమాలినవే మీ జీవితంలోనూ సంభవిస్తాయి. మీకు ఇప్పటికే తెలిసున్న గత అనుభవాలు, సమాచారాల ఆధారంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నవి కాబట్టి జీవితంలో కొత్తదనమనేదే ఉండదు.


 అందువల్ల ప్రణాళికా రచన ఏమేరకు జరగాలనేది మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. అసలు మీకు ఎటువంటి ప్రణాళికా లేనట్టయితే, రేపేమి చేయాలనేదానిపై మీకేమీ అవగాహన ఉండదు. అందువల్ల ఏవిధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఏ మేరకు దాన్ని పక్కకు పెట్టి జీవించాలి అనేది విజ్ఞతతో, సమతుల్యతతో సాగించాల్సిన ప్రక్రియ. ఎటువంటి గొప్ప ఆలోచనలూ లేకుండానే చాలామంది ప్రణాళికలు వేస్తుంటారు. వారి ప్రణాళికలన్నీ, జీవితంలోని అనూహ్య పరిణామాలను ఎదుర్కోలేని నిస్సహాయత, భయాల నుంచి రూపుదిద్దుకొనేవే.
 
 తమ జీవితాలు ఎలా సాగాలని భావిస్తున్నారో ఆ రకంగా సాగకపోవడమే మానవాళికి ఎదురవుతున్న బాధ. ఉదయం కాగానే కాఫీ తాగాలనిపిస్తుంది. కానీ కాఫీ తయారు కాలేదు. దానివల్ల బాధ. అదే సమయంలో సూర్యోదయం అవుతుంటుంది. దాన్ని మీరు చూడరు. ఆ రకంగా ఆ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. మీరనుకొన్న పనికిమాలినదేదో జరగని తరుణంలో, దానికన్నా చాలా ఉత్కృష్టమైనదేదో జరిగిపోతుంటుంది.
 
 రేపు గురించి మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. కానీ ఈ విశ్వాంతరాళాల్లో, మీ చుట్టూ సాగే జీవిత నృత్యంలో మీ ప్రణాళిక చాలా అత్యల్పమైనది. అందువల్ల మీ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. మనకు ప్రణాళికలు అవసరమే. రేపు ఉదయం చేయాల్సినదేమిటో తేల్చుకోవడానికి అవి కావాలి. కానీ, ఆ పథకం ప్రకారమే మీ జీవితం తు.చ. తప్పకుండా నడవాలని కోరుకోవద్దు. మీ ఆకాంక్షలు, మీ ఊహాపోహలు, మీ ప్రణాళికలకు అతీతంగా మీ జీవితం సాగిపోయేట్లు ఎప్పుడూ కలలు కంటూ ఉండండి.
 
 సమస్య - పరిష్కారం
 సంస్కృతి వేగంగా మారిపోతోంది. దీన్ని ఆపడం ఎలా?
 - ఎస్.భూపతి, కరీంనగర్
 సంస్కృతి ఒక సామాజిక కట్టుబాటు. వాతావరణ పరిస్థితుల వల్లో, ఇతర ప్రభావాల వల్లో ఒక ప్రత్యేక రీతిలో వారు జీవిస్తారు. భారతీయ సంస్కృతి మనుషుల్ని క్రమంగా ఆధ్యాత్మిక బాట పట్టేట్లుగా మలచబడింది. ఈ పద్ధతులు, కట్టుబాట్లు మీ జీవితంలోకి ఎందుకొచ్చాయంటే, వాటివల్ల మానవ సంక్షేమానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక.
 
 కానీ ఇప్పుడు కొన్ని వ్యాపార శక్తులు తమ ప్రయోజనాల కోసం ప్రతిదాన్నీ మార్చాలనుకుంటున్నాయి. చాలా కంపెనీల్లో ఉత్పత్తి శాఖల కంటే మార్కెటింగ్ శాఖలు పెద్దవిగా ఉన్నాయి. వీటికి తోడు, మత శక్తులు సంస్కృతిని మార్చడం కోసం, ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడైనా మార్పు ఆపే ప్రయత్నం జరిగినా, అది చాలా మోటు పద్ధతుల్లో జరుగుతోంది. అందుకే అందరూ దాన్ని అసహ్యించుకుంటున్నారు. మంచివాళ్లు మాట్లాడటం మొదలుపెడితే, కొంత అవగాహన తెస్తే, ఈ వీధి రౌడీలకు పని ఉండదు.
 - జగ్గీ వాసుదేవ్

మరిన్ని వార్తలు