క్లెయిమ్ చేస్తున్నారా..! | Sakshi
Sakshi News home page

క్లెయిమ్ చేస్తున్నారా..!

Published Sun, Feb 16 2014 1:04 AM

క్లెయిమ్ చేస్తున్నారా..! - Sakshi

కారు చౌక ప్రీమియం. ఏడాదికి వెయ్యి రూపాయలు చాలు. లక్ష రూపాయల కవరేజీ... అంటూ బీమా కంపెనీలు ప్రచారాన్ని ఊదరగొట్టి మరీ పాలసీలిస్తుంటాయి. తీరా పాలసీ కట్టి, అవసరానికి క్లెయిమ్ చేస్తే... సవాలక్ష కొర్రీలు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో... జరగకుండా ఏం చేయాలో వివరించారు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్ అండ్ క్లెయిమ్స్ విభాగం) ఫ్రెడరిక్ డిసౌజా. అది ఆయన మాటల్లోనే...
 సాధారణంగా పాలసీ తీసుకునేటప్పుడు పాలసీదారు పూర్తి వాస్తవాలు వెల్లడించకపోవడం వల్లే చాలా క్లెయిములు తిరస్కరణకు గురవుతుంటాయి. దిగువ మూడు అంశాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తదు.

 అవి..
 వాస్తవాలు వెల్లడించడం..
 బీమా నిబంధనల ప్రకారం పాలసీ కాంట్రాక్టు తీసుకునేటప్పుడు తన ఆరోగ్య వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత పాలసీదారుదే. ఉదాహరణకు.. పాలసీదారుకి అధిక రక్తపోటు లాంటివి ఉంటే ఆ విషయాలను కచ్చితంగా ముందే చెప్పాలి. పాలసీదారు ఇవేవీ చెప్పకుండా తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడినని చెప్పి కూడా పాలసీ తీసుకోవచ్చు. అతనిచ్చిన డిక్లరేషన్‌ను విశ్వసించి బీమా కంపెనీ కవరేజి ఇవ్వొచ్చు కూడా. కానీ, నిజంగా ఏదైనా దుర్ఘటన జరిగితే ఇలాంటి వాటితోనే సమస్య వస్తుంది.

 ఇలాంటి కేసులో పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం అతను పూర్తి వివరాలు వెల్లడించలేదన్న కారణంగా క్లెయిమును బీమా కంపెనీ తిరస్కరించే అవకాశం ఉంది. ఇందులో కంపెనీని కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే.. పాలసీదారుల నుంచి వచ్చే ప్రీమియాల నుంచే కంపెనీ క్లెయిములు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వారి ప్రయోజనాలను కూడా దష్టిలో పెట్టుకుని కంపెనీ వ్యవహరించాల్సి వస్తుంది.  

 నామినేషన్..
 పాలసీ సొమ్ము సరైన వారికి దక్కేలా చూసేందుకు నామినీని పేర్కొనడం కూడా పాలసీ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాల్లో ఒకటి. చట్టబద్ధమైన వారసులకు, పాలసీదారు పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే పాలసీ డబ్బు చెల్లించాల్సిన బాధ్యత కూడా బీమా కంపెనీపై ఉంటుంది. నామినేషన్ లేకపోతే.. క్లెయిములను ఎవరికి ఇవ్వాలన్నది రూఢిగా తెలియనందు వల్ల కంపెనీ క్లెయిములను చెల్లించలేకపోవచ్చు. అందుకే, నామినీ గురించి కచ్చితంగా పేర్కొనాలి. మరో విషయం, పాలసీదారు ఒకే నామినీని చివరికంటా కొనసాగించాలన్న నిబంధనేమీ లేదు. సందర్భాన్ని బట్టి పాలసీదారు నామినీని మార్చుకోవచ్చు.

 పత్రాలు కీలకం..
     క్లెయిము సత్వరమే పరిష్కారం కావాలంటే అవసరమైన ధవీకరణ పత్రాలన్నింటినీ కంపెనీకి ఇవ్వాలి.

ఇవి మూడు రకాలు...
     ఘటనకు సంబంధించిన వివరాలను ధవీకరించే పత్రాలు
     పాలసీ నిబంధనల పరిధిలోనే ఘటన జరిగిందనే పత్రాలు
     పాలసీ సొమ్మును పొందేందుకు తానే సిసలైన నామినీని అని ధ్రువీకరించే పత్రాలు.

Advertisement

తప్పక చదవండి

Advertisement