నవ్వింత: మా బుడ్డోడూ... ఒక సైన్సు పాఠం!

22 Mar, 2014 21:16 IST|Sakshi
నవ్వింత: మా బుడ్డోడూ... ఒక సైన్సు పాఠం!

మొన్నోరోజు మా ఆవిడనూ, బుడ్డోడినీ బయటకు తీసుకెళ్దామని బైక్ దగ్గరకు వెళ్తుంటే బండి తాళంచెవి కిందపడింది. ‘‘తాళం చెవి కిందపడితే సౌండ్ ఎందుకు వస్తుంది నాన్నా?’’ అని అడిగాడు మా బుడ్డోడు. శబ్దం, కంపనం, పౌనఃపున్యం అంటూ నాకు తెలిసిన భౌతిక శాస్త్రం చెప్పబోయా. కానీ భౌతిక శాస్త్రాన్ని మా సీనియర్లు బహుతిక్క శాస్త్రమని ఎందుకనేవారో నాకు అప్పుడర్థమైంది. మనసులో ఏవో ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయిగానీ చెప్పడంలో కష్టమయ్యేలోపే బుడ్డోడు నా శ్రమను తగ్గించాడు. ‘‘తాళం చేవి కింద పడితే సౌండొచ్చేది ఎందుకంటే... మనం తాళం చెవిని కింద పడేసుకున్న విషయం మనకు తెలియాలని దేవుడు చేసిన ఏర్పాటది’’. వెళ్లక వెళ్లక ఏదో ఓ పూట ఇలా బయల్దేరబోయే సమయానికి తాళంచెవి ఎక్కడో పారేసుకున్నందుకు మా ఆవిడ కోప్పడుతుందేమోనని భయపడ్డాను. అయితే పొలంలో పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు అల్పపీడనం ఏర్పడ్డాక కూడా అది పెనుతుఫానుగా మారకపోతే రైతు ఎంతగా ఆనందిస్తాడో... అంతకు రెట్టింపు సంతోషంతో నేనూ మా బుడ్డోడి తెలివితేటలకు మురిసిపోయా. మావాడికి ఉన్న దైవభక్తికి మా ఆవిడ కూడా ముచ్చట పడటం కన్నా, మా ఆవిడకు కోపం రాలేదనే అంశమే నన్ను సంతోషపెట్టింది. దాంతో బహు తేలికమనస్కుడనై వెంటనే భగవంతుడికి గాల్లోనే దండం పెట్టుకున్నా.
 
 కానీ నా సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆ రాత్రి అల్పపీడనం ఏర్పడకుండానే తుఫాను తీరం దాటేసింది. ఇలాక్కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి! ఆ సాయంత్రం మా ఆవిడ కూల్‌డ్రింక్స్ పోసి గ్లాసు నా చేతికి ఇచ్చింది. అది కాస్తా జారి గ్లాసు భళ్లున మోగింది. గ్లాసు కింద పడగానే మావాడు తొలుత దిగ్భ్రాంతినీ, ఆ తర్వాత నాపట్ల సానుభూతినీ వ్యక్తం చేశాడు. అప్పుడు నాలోపల మళ్లీ పాఠం మొదలైంది. ‘శబ్దమూ... కంపనమూ’. కానీ ఆ యొక్క కంపనము ఏదైతే ఉందో అది నా గుండెది. దాని శబ్దం దడదడమని బయటకు వినిపిస్తూ నాలో మరింతగా ప్రతిధ్వనిస్తోంది. గ్లాసు పడేయడం ఎలా ఉన్నా, ఇంకా బింకంగానే దాన్నుంచి కూడా కనీసం ఏదో ఒకటి మా బుడ్డోడికి నేర్పుతున్నాను కదా అన్న విషయమైనా మా ఆవిడను సంతోషపెడుతుందేమో అన్నది నా స్వార్థం. ఫలితం లేకపోయింది. గత జన్మలో మొదలుకొని ఇలా గ్లాసును ఇప్పటివరకు నేనెన్నిసార్లు కింద పడేశాను అనే అంశంపై మా ఆవిడ ఒక శ్వేతపత్రం విడుదల చేసింది.
 
 ‘‘తాళం చెవికి పెట్టిన రూల్‌నే దేవుడు గ్లాసుకూ పెట్టడం దురదృష్టకరం నాన్నా... తాళంచెవి కిందపడ్డ  విషయం మనకు తెలిసేలా ఏర్పాటు చేసినట్టే, గ్లాసు కిందపడ్డ సంగతి అమ్మకు తెలియకుండా ఏర్పాటు చేసి ఉంటే దేవుడు మరింత గొప్పవాడయ్యేవాడు. అది చేసినవాడు నిజంగా దేవుడే నాన్నా’’ అని కండోలెన్స్ మెసేజ్ రూపంలో ఓ అనధికార ప్రకటనను (రహస్యంగా నా ఒక్కడి కోసమే) వెలువరించాడు మా బుడ్డోడు.  గుండెజారినా గ్లాసు జారినంత శబ్దం వస్తుందనీ, అయితే ఆ శబ్దం నాకు మాత్రమే వినిపిస్తుందనీ నాకో కొత్త అభౌతికశాస్త్రపాఠం తెలిసింది.
 - యాసీన్
 

మరిన్ని వార్తలు