అల్ప సంతోషి

25 Nov, 2018 02:39 IST|Sakshi

పిల్లల కథ

ఒకప్పుడు నీలగిరి కొండల్లో శతానందుడనే మహర్షి గురుకులం నడిపేవాడు. దూరప్రాంతాల నుంచి అక్కడ విద్యను అభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు వచ్చేవారు. కొన్నాళ్లు ఆశ్రమంలోనే ఉండి విద్యాభ్యాసం పూర్తయ్యాక తమ తమ ఊర్లకు వెళ్లిపోయేవారు. అవంతిపురం రాజ్యానికి చెందిన అనంత శర్మ అనే యువకుడు కూడా ఆ ఆశ్రమంలో ఉండి చదువుకునేవాడు. అనంతశర్మ ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్లో కెల్లా తెలివైనవాడు. అయితే మహా గర్వి. తను తెలివైనవాడు గనుక అందరూ తనను గౌరవించాలనుకునేవాడు. ముఖ్యంగా గురువు తనను ప్రత్యేకంగా చూడాలనుకునేవాడు. కానీ శతానందుడు అతన్ని మిగతా విద్యార్థులతో సమానంగా చూసేవాడు. ఆయన ధోరణి అనంతశర్మకి నచ్చేది కాదు. ఓ రోజు శతానందుడు ఆశ్రమంలో తన విద్యార్థులకు సాత్విక జీవన విధానం గురించి బోధిస్తున్నాడు. ‘‘మనుషుల మధ్య ఎన్ని అంతరాలున్నా దేవుడి ముందు అందరూ సమానులే! ఉన్నత కులస్తులు, ధనవంతులు, మేధావులు తమని తాము గొప్పవారిగా భావించకూడదు. ఇతరుల కన్నా తమకు ఎక్కువ మర్యాదలు, సౌఖ్యాలు లభించాలని ఆశించకూడదు. దొరికినదానితో తృప్తి పడి జీవించడం అలవాటు చేసుకోవాలి. అలా అల్ప సంతోషిగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు’ అంటూ బోధించాడు. గురువుగారి మాటలు అనంత శర్మకు రుచించలేదు. ‘గురుదేవా..! మన సామర్థ్యానికి, తెలివితేటలకు తగ్గ ప్రతిఫలం పొందటం మన హక్కు కదా!? దాని కోసం ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను’ అన్నాడు.

‘‘ఆశించడంలో తప్పులేదు కానీ ఆ ఆశ అత్యాశగా మారకూడదు. తెలివైన వారు పని చెయ్యటం కోసం తమ తెలివిని ఉపయోగించాలి గానీ ప్రతిఫలం పొందటం కోసం ఉపయోగించకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు దొరికిన ప్రతిఫలం కూడా చేజారిపోవచ్చు’’ అంటూ అనంత శర్మకు బోధించాడు శతానందుడు. ఆశ్రమ నియమాల ప్రకారం అక్కడ చదువుకొనే విద్యార్థులు వ్యవసాయపనులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చుట్టుపక్కల గల పొలాలకు వెళ్లి అక్కడ రైతులకు సేద్యపు పనుల్లో సాయపడాలి. దీనివల్ల రైతుల కష్టాల గురించి విద్యార్థులకు తెలుస్తుంది. ఓ రోజు గురువు  ఆదేశానుసారం విద్యార్థులంతా ఓ రైతు పొలంలో పని చేశారు. ఆ రైతు పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ రైతు బాగా పండిన పళ్లను బుట్టనిండా కోసుకొచ్చి గురువుగారికి అందించాడు. శతానందుడు తానొక పండు తీసుకుని మిగతా పండ్లను ఒక్కొక్కరికీ ఒక్కటి చొప్పున పంచమని అనంతశర్మను ఆదేశించాడు. ఆ బుట్టలో ఒక పెద్ద పండు ఉండటం అనంత శర్మ గమనించాడు. మిగతా పండ్లు చిన్నగా ఉన్నాయి. అనంతశర్మ అందరికీ చిన్న పండ్లు పంచి తాను పెద్ద పండు తీసుకొన్నాడు. మిగతా పండ్లను రైతుకిచ్చేశాడు. తర్వాత అందరూ పండ్లు తిన్నారు. అందరి పండ్లు తియ్యగా ఉన్నాయి. కానీ అనంతశర్మ  తీసుకున్న పెద్ద పండు మాత్రం పుల్లగా ఉంది. దాన్ని తినలేక అతను పండును పారవేశాడు. అది గమనించిన శతానందుడు ‘‘చూశావా శర్మా? మిగతా వారి కన్నా ఎక్కువ ప్రతిఫలం పొందాలని నువ్వు పెద్ద పండు తీసుకున్నావ్‌. కానీ అది తినటానికి పనికి రాకుండా పోయింది. కొన్ని సార్లు అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందనటానికి ఇదే ఉదాహరణ. అందుకే దొరికిన దానితో తృప్తి పడాలని పెద్దలంటారు. అల్ప సంతోషిగా జీవించే వ్యక్తికి జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు’’ అంటూ హితబోధ చేసి ఆనక రైతుకి చెప్పి అనంతశర్మకు మరో పండు ఇప్పించాడు. అలా జ్ఞానోదయమైన అనంతశర్మ ఆ నాటి నుంచి గర్వాన్ని, అత్యాశను విడిచి అల్ప సంతోషిగా ఉంటూ తృప్తిగా జీవించసాగాడు.
  

మరిన్ని వార్తలు