ఈస్ట్రోజెన్‌ తగ్గకుండా ఉండాలంటే?

3 Feb, 2019 10:36 IST|Sakshi

సందేహం

నాకు ఈమధ్య బాగా చెమటలు పడుతున్నాయి. చికాకుగా ఉంటోంది. మెనోపాజ్‌ అని అనుమానంగా ఉంది. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గిపోకుండా శరీరానికి అవసరమైన ఆహారం తీసుకోవచ్చు అని విన్నాను. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నీరజ, సింగరాయకొండ

మీ వయసు ఎంత అని రాయలేదు. పీరియడ్స్‌ అవుతున్నాయా లేదా రాయలేదు. చెమటలు పట్టడం, చిరాకు వంటి లక్షణాలు మెనోపాజ్‌ సమయంలోనే కాకుండా, వేరే హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, విటమిన్‌ లోపాలు, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు ఎన్నో కారణాల వల్ల ఉండవచ్చు.కొందరిలో పీరియడ్స్‌ ఆగిపోయే 4–5 సంవత్సరాల ముందు నుంచి కూడా అండాశయాలు తగ్గి వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ శాతం మెల్లగా తగ్గిపోతూ వచ్చి చాలావరకు  ఆగిపోతుంది.ఈస్ట్రోజన్‌ తగ్గిపోవడం వల్ల  ఉన్నట్టుండీ శరీరం వేడిగా అనిపించడం, అలాగే చెమటలు పట్టడం (hotflushes), చికాకు, కోపం, డిప్రెషన్‌ వంటి అనేక మార్పులు జరుగుతుంటాయి. వీటినే మెనోపాజల్‌ లక్షణాలుగా పరిగణించటం జరుగుతుంది. 

సహజంగా వచ్చే  ఈ మార్పులను మనం నివారించలేము. కాకపోతే, తప్పిపోయిన ఈస్ట్రోజన్‌కు బదులుగా, ఈస్ట్రోజన్‌లాగా పనిచేసే ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్‌ అనే పదార్థాలను వాడవచ్చు. ఇవి సాధారణంగా సోయాబీన్స్, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, పిస్తా, బఠాణీలు, పప్పులు, లవంగాలు, ఎండు ఖర్జూరాలు, నారింజలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి.

సోయాబీన్స్, వాటి ఉత్పత్తులయిన సోయా పాలు, చీజ్, సోయాపిండి, తోçఫు... వంటివాటిలో ఎక్కువగా ఐసోఫ్లావోన్స్‌ అనే ఫైటో ఈస్ట్రోజన్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో ఇడ్లీలలో మినపప్పు బదులు, ఉడికించిన సోయాగింజలు, చపాతీల్లో సోయా పిండి అలా రకరకాలుగా తీసుకోవచ్చు.

అలాగే ఎక్కువగా నీళ్ళు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. (ఈ సమయంలో ఈస్ట్రోజన్‌ తగ్గడం వల్ల ఎముకలు అరగటం, గుండె పనితీరులో మార్పులు కూడా జరుగుతాయి) వాకింగ్, వ్యాయామాలు, ధ్యానం చెయ్యటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం దృఢంగా ఉంటుంది. కాఫీ, టీ, కారం, మసాలాలు బాగా తగ్గించడం మంచిది. ఈ ఫైటోఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావోన్స్‌ ఆహారంలోనే కాకుండా, టాబ్లెట్స్‌ రూపంలో కూడా దొరుకుతాయి. ఇవి డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవచ్చు.

బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పాపాయికి ఏ సమయాల్లో పాలు పట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వివరంగా తెలియజేయగలరు. – బి.సుమ, సామర్లకోట
బాలింతలలో కాన్పుకి ముందు కంటే ఎక్కువగా ఆహారంలో మంచి పోషక పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డ పెరగటానికి, తల్లిలో మార్పులకు, కలిగిన అలసటకు, కాన్పు తర్వాత ఆ నీరసం తగ్గటానికి, బిడ్డకు పాలు ఇవ్వటానికి తగిన శక్తి కావలసి ఉంటుంది. బిడ్డకు కావలసిన పోషకాలు అన్నీ తల్లి పాల ద్వారానే అందుతాయి. కాబట్టి కాన్పు తర్వాత ఆహారంలో అన్నం, చపాతీలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రైప్రూట్స్, పాలు, పెరుగు, మాంసాహారులు అయితే చేపలు, మాంసం అన్నీ కొద్దికొద్దిగా రోజూ తీసుకోవచ్చు. వీటివల్ల తల్లికి చీముపట్టడం, బిడ్డకు జలుబు చెయ్యడం వంటి సమస్యలు ఏమీ ఉండవు. తల్లి ఆహారంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొటీన్స్‌ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి పాలు బాగా పడతాయి. కుట్లు తొందరగా మానుతాయి. ఎక్కువగా మంచినీళ్లు తీసుకోవాలి. దాని వల్ల పాలు బాగా వస్తాయి. అలాగే యూరిన్‌ ఇన్‌ఫెక్షన్స్‌ లేకుండా, మలబద్ధకం లేకుండా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు త్రాగడం వల్ల పొట్ట పెద్దగా రావడం ఉండదు.

పాపకి పాలు 3 గంటలకొకసారి తాగించాలి. పాలు తాగించేటప్పుడు బిడ్డను సరిగా పట్టుకొని, రొమ్ములను సరిగా పట్టించి తాగించాలి. పాలు సరిగా రావటానికి పౌష్టికాహారంతో పాటు, తల్లి మానసికంగా సంతోషంగా ఉండటం కూడా ముఖ్యం.కాన్పు తర్వాత తల్లి కనీసం మూడునెలల పాటు ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవాలి. కాన్పు తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా, కొద్దిగా మెల్లగా నడవడం వంటి చిన్న పనులు చేసుకుంటూ ఉండటం, రెండు నెలల తర్వాత వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది.

నా వయను 29 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్‌. నాకు డయాబెటిస్‌ ఉంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను బరువు ఎక్కువగా ఉన్నాను. ఈ టైమ్‌లో బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చా? ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. – యస్‌.పల్లవి, సిద్దిపేట
మీకు డయాబెటిస్‌ ప్రెగ్నెన్సీలో వచ్చిందా, లేక గర్భం రాక ముందు నుంచే ఉందా అనేది సరిగా రాయలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రెగ్నెన్సీలో మార్పుల వల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. దాన్ని నియంత్రించడానికి మందులు (ఇన్సులిన్‌) ఎక్కువ డోసులో వాడవలసి ఉంటుంది. ఇప్పుడు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఈ సమయంలో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. దీనికోసం ఆహారంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆహారంలో అన్నం తక్కువ (కార్బోహైడ్రేట్స్‌) తీసుకోవాలి. స్వీట్లు, షుగర్‌ ఎక్కువ ఉన్న అరటిపండ్లు, సపోటా వంటివి తీసుకోకపోవడం మంచింది.
పాలలో షుగర్‌ లేకుండా తీసుకోవాలి. ఆహారం కొద్దికొద్దిగా 4,5 సార్లుగా విభజించుకుని తీసుకోవడం మంచిది. ఒకసారి డైటీషియన్, నిపుణులను సంప్రదిస్తే వారు మీ బరువుకి తగ్గ ఆహార నియమాలను ప్లాన్‌ చేసి ఇస్తారు. అలాగే ఫిజీషియన్‌ దగ్గర సక్రమంగా చెకప్‌లకు వెళ్ళడం, షుగర్‌ లెవెల్స్‌ అవసరాన్ని బట్టి 15 రోజులకు లేదా నెలకోకసారి పరీక్ష ద్వారా తెలుసుకుంటూ, డాక్టర్‌ పర్యవేక్షణలో షుగర్‌ మందులు, ఇన్సులిన్‌ డోస్‌ను సరిచేసుకుంటూ వాడుకోవాలి. ఈ సమయంలో గైనకాలజిస్ట్‌ సలహా మేరకు, రోజూ అరగంట వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు, యోగ, ప్రాణాయామం వంటివి చెయ్యడం తప్పనిసరి.

- డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా