కథ: తోడూ నీడా

5 Apr, 2014 23:47 IST|Sakshi
కథ: తోడూ నీడా

‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు.
 
‘‘అమ్మా!’’  ‘‘మమ్మీ!’’  ‘‘అబ్బబ్బా! ఎందుకర్రా ఆ కేకలు. ఏదో భాషలో పిలవండి. ఏమయింది?’’  వంటింటిలోంచి వస్తున్న సుమతిని చూస్తూ షేవ్ చేసుకుంటున్న మధు అద్దంలోంచి చూస్తూ నవ్వుతున్నందుకు ఉడుక్కుని,  ‘‘ఊ! అలా నవ్వే బదులు వాళ్లను కాస్త చూడొచ్చు కదా, ఎందుకరుస్తున్నారు?’’  ‘‘అది నీ సెక్షనోయ్!’’  ‘‘అవును. ఈ సెక్షనాఫీసరుగారికి ఇంట్లో కూడా రూల్సే. ఇంతకీ ఏమిటర్రా మీ గోల?’’  ‘‘ఈ పొట్టోడు జామంతా ఉత్తినే తినేస్తున్నాడు. మరి నేనెలా తినాలి ఈ బ్రెడ్డుని?’’ దీర్ఘం తీసింది సిరి. దానికే ఎనిమిదేళ్లు. దాని కన్నా ఏడాది చిన్న ఫణి. వాడు దీనికి పొట్టోడు. ఇది మరీ పొడుగ్గా ఉన్నట్లు. నవ్వాపుకుంటూ, ‘‘పోనీలే. ఈసారికి పాలల్లో వేసిస్తాను. నా తల్లివి కదూ. వేగిరం తినాలి. టైమవుతుంది. ఆటో వచ్చేస్తుంది. మరి రేపు నీకు వేరే జాము కొంటాను కదూ.’’
 ‘‘మమ్మీ! రోజూ ఈ బ్రెడ్డేనా? ఏదైనా టిఫిన్ చెయ్యమ్మా?’’
 ‘‘అలాగే. రేపు సండే కదా. పూరీ చేస్తాను. సరేనా?’’
 పిల్లలిద్దరికీ బాక్సులు సర్ది, వాళ్లని ఆటో ఎక్కించి వచ్చినప్పటికి శ్రీవారు రెడీ. అతనికి కొంచెం పెరుగన్నం పెట్టి, తనూ రెండు ముద్దలు ఆదరాబాదరాగా తిని, ఇద్దరికీ టిఫిన్ బాక్సులు సర్ది, తను తయారైనప్పటికి తొమ్మిదిన్నర. డోర్ లాక్ చేసి, పరుగుపరుగున వచ్చి కూర్చున్న సుమతిని చూసి, ‘‘గ్యాస్ కట్టావా? మొన్నటిలా మర్చిపోయావా?’’ బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు మధు.
 ‘‘మొన్న ఏదో తొందరలో అలా చేశానుగాని, ఎప్పుడూ జాగ్రత్త గానే ఉంటాను.’’  వీళ్లు ఏం మాట్లాడుకున్నా ఆ పావుగంట ప్రయాణంలోనే. అన్ని కబుర్లనూ. సుమతి ఆఫీసు ముందు వస్తుంది. తనని అక్కడ డ్రాప్ చేసి, మధు ఆఫీస్‌కి వెళ్తాడు. సాయంత్రం మాత్రం వీలుపడదు. సుమతి ముందుగా వస్తుంది ఆటోలో. పిల్లలు, అప్పటికే వచ్చి వరండాలో కూర్చుని ఉంటారు.
     
ఆఫీసులో లంచ్ టైమ్‌లో కలిసింది సుధ. ఇద్దరూ ఒకే దగ్గర పనిచేస్తున్నా గాని, వాళ్లు కలిసేది, ఈ లంచ్ టైమ్‌లో మాత్రమే.
‘‘ఏమిటే! అలా ఉన్నావు? కొంచెం డల్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఎనీ ప్రాబ్లమ్?’’ కూర్చుంటూ అడిగింది. ఉదయం సిరి అన్న మాటలు చెప్పి, ‘‘వాళ్లు ఎదిగే వయసులో సరైన సంరక్షణ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అప్పటికి ఉదయం ఐదింటికే లేస్తాను. గదులు ఊడ్చి, స్నానం చేసి, కుక్కరు పెట్టి, దేవునికి ఒక దీపం పెట్టేటప్పటికి వీళ్లు లేస్తారు. వాళ్ల పనులు చూసి వంటయేటప్పటికి వీళ్ల ఆటో ఎనిమిదింటికి వస్తుంది. వాళ్లని తయారుచేసి పంపేటప్పటికి ఈయన రెడీ అవుతారు. ఆయనకి, నాకు బాక్సులు కట్టుకుని, తయారయ్యేప్పటికి టైమవుతుంది. ఏం చేయడం? ఆఫీసు పది గంటలకైనా, ఈ ట్రాఫిక్ నుండి తొమ్మిదిన్నరకే బయల్దేరాల్సొస్తుంది’’
 ‘‘మీవారేమి సాయం చేయరా?’’
 ‘‘చేస్తారు. పిల్లలకి షూస్ వేయడం, వాళ్ల పనులు కొంచెం చూస్తారు.’’
 ‘‘పనమ్మాయి ఉంది గాబోలు.’’
 ‘‘ఆ! అది వచ్చేప్పటికి మేము వెళ్లిపోతాం. వరండాలో సామాన్లు పడేస్తే, తోమి వెళ్తుంది. సాయంకాలం రాదు. ఆదివారం నాడు ఇల్లు వత్తుతుంది. దానికే, ఆరు వందలు. మరి ఏం చేస్తాం? తప్పదు. అప్పటికి క్యారియర్లు, అన్నీ నేనే కడుక్కుంటాను.’’
 సింక్‌లో చేతులు కడుక్కువచ్చి,
 ‘‘అన్నట్లు సుమా! మీ అత్తగారు ఆ పల్లెటూరులో ఒక్కళ్లే ఉండే బదులు మీ దగ్గరే ఉండొచ్చు కదా! నీకూ కొంచెం సాయం ఉంటుంది. పిల్లలకీ బాగుంటుంది.’’
 ‘‘నిజమే గాని! ఆవిడ ఆ ఊరు వదలి రారు. ఎప్పుడైనా వచ్చినా అదే టైముకి నాకు డేట్సు వస్తాయి. వారం కన్నా ఎక్కువ ఉండరు. మా అత్తగారిది ఉమ్మడి కుటుంబం. ఈవిడ వాళ్లతో కలిసే ఉంటుంది. మా చినమామగారిది, మాది పక్కపక్కన ఇళ్లే. పక్కనే ఉన్నారు గనుక ఆవిడకు తోడుగా ఉన్నారని మేము అంతగా బలవంతం చేయలేదు. అదీగాక, ఆవిడకు కొంచెం మడీ తడీ ఎక్కువ. నెలనెలా ఇదొక ప్రాబ్లమ్ కదా. ఇన్నాళ్లూ అంటే ఖాళీగా ఉన్నాను గనక పర్వాలేకపోయింది. ఈ వచ్చింది గవర్నమెంటు జాబు. మానలేను.’’ ‘‘మానమని ఎవరు చెప్పేరే? నువ్వు కొంచం సర్దుకుపోతే బాగుంటుంది కదా. ఆ మూడు రోజులు. వంటింటివైపు వెళ్లకు. నువ్వు కొంచం ఎడంగా ఉంటే, ఆవిడే సర్దుకుంటారు.
 
 పెద్దవాళ్లు కదా, వాళ్లకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అయినా, మన పూర్వీకులు చాలా తెలివిగా ఈ కట్టుబాట్లు పెట్టారు. పూర్వం అందరివీ ఉమ్మడి కుటుంబాలు. జనాభాలూ ఎక్కువే ఉండేవి. అలాగే, ఆడవాళ్లకి పనులు కూడా ఎక్కువే ఉండేవి. అందుకే, ఆ సమయంలో ఆడవారికి రెస్టు ఉండాలన్న ఉద్దేశంతో, ఆ నియమాన్ని అలా పెట్టారు. చూశావా? మన పూర్వీకులకి స్త్రీల పట్ల ఎంత అభిమానము, గౌరవమో! లేకపోతే, ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ల పని అయిపోయేదే! ఆ పద్ధతి ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో పెద్దవాళ్లు పాటిస్తున్నారు. అంతే! దానికి మనమే ఎడ్జస్టయిపోతే సరిపోతుంది కదా’’ అని వాచీ చూసుకులేచి సుమతి భుజం మీద చెయ్యేసి, నవ్వుతూ,
 ‘‘గాడ్ బ్లెస్ యూ’’ అంటూ వెళ్లిపోయింది. సుమతికి ఇంటికి వెళ్లినంతవరకూ ఇవే ఆలోచన్లు. ‘‘నిజమే! సుధ చెప్పినట్లు చేస్తే బాగుణ్ను గాని, ఆవిడ వస్తారా? ఈ సంగతి మధుకి ఎలా చెప్పడం? ఏమనుకుంటారు? నీ సాయం కోసం అమ్మని తెమ్మంటావా అంటారేమో! ఏమని చెప్పాలి?’’
 
 ఆలోచన్లలోనే పనులు చేసుకుంటోంది. మధు రానే వచ్చాడు. వస్తూనే,  ‘‘సుమా! చిన్న న్యూస్, ఇలారా?’’ అంటూ కూర్చుని బూట్లు విప్పుకుంటూ సోఫాకి చేరబడి, సుమతి ఇచ్చిన టీ అందుకుంటూ, ‘‘చిన్నాన్న ఫోన్ చేశారోయ్! ఈ వర్షాలకి మన ఇల్లు కారుతోందట. ఇల్లు రిపేరు చేయించాలి. అమ్మను తీసుకెళ్లమని చెప్పారు. రేపు ఆదివారం. వెళ్లి తెస్తాను. ఏమంటావు?’’ తనేమంటుంది? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు... సుమతి మనసులో సంశయం తీరిపోయింది. ‘‘ఏమంటాను? తప్పక తీసుకురండి. పాపం! ఒక్కళ్లే ఏం ఇబ్బంది పడుతున్నారో’’ అంది సంతోషంగా. పిల్లలు కూడా సరదా పడ్డారు నానమ్మ వస్తుందని. మర్నాడే ఉదయం బస్సుకి వెళ్లాడు మధు. సాయంత్రంకల్లా రానే వచ్చేశారు. అనకాపల్లి ఎంత దూరమని, రెండు గంటల ప్రయాణం. రాగానే ఇద్దరి మనవల్ని దగ్గరకు తీసుకుని ముద్దులాడి, సుమతిని పలకరించింది జానకమ్మ. అత్తగారి కాళ్లకి నమస్కరించి, కుశలాలు పలకరింపులు అయ్యాక, ఇద్దరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. సుమతి. ‘‘అత్తయ్యా! ఈ రోజు ఆదివారం కదా. రాత్రికి భోజనం చెయ్యరు. ఏం టిఫిను చెయ్యమంటారు?’’
 ‘‘మినపరుబ్బు కొంచెం ఉంటే తెచ్చానమ్మా. నూక కలిపిందే. నాకు చిన్న రొట్టి కాల్చి మిగతాది ఉదయం ఇడ్లీకి ఉంచు..’’ అంటూ తను తెచ్చినవన్నీ, బయటకు ఒక్కొక్కటీ పెట్టింది. పిల్లలకి సున్నుండలు, మధుకి ఇష్టమని జంతికలు, చెరుకు ముక్కలు, అనకాపల్లి ఫేమస్ చిన్న బెల్లం దిమ్మ, పచ్చళ్లు పేరిన నెయ్యి... ఇవన్నీ చూసి పిల్లలు సంబరపడిపోయారు. సుమతి అవన్నీ తీసి సర్దుతూ, ‘‘ఇవన్నీ ఎప్పుడు చేయించారత్తయ్యా?’’  ‘‘రమణ నిన్న చెప్పాడు, మధుకి ఫోన్ చేశాను, రేపు వస్తాడని. మీ చిన్నత్త రాత్రి చేయించింది. బెల్లం, మినప్పప్పు ఇంట్లో ఉన్నవే పట్టుకొచ్చాను. రాత్రికి కొంచెం గుమ్మడి వడియాలు వేయించు. పిల్లలు ఇష్టంగా తింటారు.’’
 ‘‘మీరు అలా కాసేపు చేరబడండి. బస్సులో అలా కూర్చొనుంటారు’’
 సామానులన్నీ ఫ్రిజ్‌లో పెట్టి, వంటగదిలోకి వెళ్లింది. తల్లి కొడుకు ఊరి సంగతులు మాట్లాడుకుంటూండగా గబగబా వంట చేసి, భోజనాలకు పిలిచింది. అత్తగారు తెచ్చిన ఆవకాయ పచ్చళ్లు, కమ్మని నెయ్యితో సంతృప్తిగా భోజనాలు చేశారు.
 పిల్లలిద్దరూ ముందు గదిలో మంచం మీద నానమ్మ పక్కలో చేరిపోయారు కథ చెప్పమని!
     
 జానకమ్మ వచ్చాక సుమతికి కొంత స్వస్తత కలిగింది. ఉదయం దేవునికి దీపం. కాయగూరలు తరగడం, సిరికి జడ వేయడం అవన్నీ ఆమె చేస్తుండబట్టి, కాస్త వంట దగ్గర సులువవుతుంది. అందరికీ టిఫిను కూడా చేయగలుగుతుంది. సాయంకాలం పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ల కోసం ఏదో ఒకటి తినడానికి ఉంటుంది. సుధ చెప్పిన విధంగా ఆ మూడు రోజులు కూడా పాటించినందుకు ఆవిడ కూడా ఇబ్బంది పడలేదు.
 చాలా రోజులకి, ఆఫీస్‌లో లంచ్ టైమ్‌లో సుధ సుమతిని కలిసింది.  ‘‘హాయ్ సుమా! ఎలా ఉన్నావు. హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఏమిటి విశేషం?’’ కుర్చీ దగ్గర జరిపి కూర్చుంది సుమతి.  ‘‘అక్కా!’’ సుధని అక్కా అని పిలుస్తుంది సుమతి.  ‘‘అక్కా! నువ్వు చెప్పిన మర్నాడే అనుకోకుండా ఆవిడ్ని తేవల్సివచ్చింది. దేవుడే నీ నోట అనిపించాడేమో అనుకున్నాను’’ జరిగినవన్నీ చెప్పి,‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు. పనమ్మాయి కూడా వస్తే దగ్గరుండి అన్ని పనులూ చేయిస్తున్నారు.
 
 మిల్లుకి పంపి పిండిమర పట్టించడం, గ్రైండరుకి పంపి పప్పు రుబ్బించడం, వీధిలోకి మంచి కూరలు వస్తే కొని ఉంచటం, ఉదయం వాకింగ్‌కి వెళ్లినట్లు పిల్లలతో కలసివెళ్లి పూజకు పూలు తెచ్చుకోవటం, కాయగూరలు తరిగి ఇవ్వటం... ఇలా చాలా విషయాల్లో నాకు సాయంగా ఉంటున్నారు. నా కన్నా ఆమె వంట కూడా బాగా చేస్తారు. నువ్వు చెప్పిన సలహా భగవంతుడు తీర్చినందుకు మీ ఇద్దరికీ వందనాలు. ఇంకో గుడ్ న్యూస్. మా ఊళ్లో ఇల్లు అమ్మి, ఇక్కడ ఫ్లాట్ తీసుకోమనీ, తనూ ఇక్కడే ఉండిపోతాననీ అన్నారు.’’ సుమతి చేయి పట్టుకుని సుధ షేక్‌హాండ్ ఇస్తూ, ‘‘నువ్వు అదృష్టవంతురాలివే. ఈ రోజుల్లో అత్తగార్ని బయటపెట్టే కోడల్ని చూశాను గానీ, అత్తగార్ని పొగిడే కోడల్ని నిన్నే చూస్తున్నాను. నీమీద జలసీ కలుగుతుందే. మా అత్త లేనందుకు. ఇంతకీ మీ అత్తగారి వయసెంతే?’’
 
 ‘‘డెభ్భయ్.’’  ‘‘ఆ..?!’’  ‘‘ఏమిటలా ఆశ్చర్యపోతున్నావ్?’’  ‘‘ఏమీ లేదు. ఈ వయసులో కూడా అంత యాక్టివ్‌గా ఉన్నారంటే గ్రేట్. అందుకే అంటారు, ఇంటికో పెద్దతోడు ఉండాలని. పిల్లలు కూడా ఆమె దగ్గర పడుకోవడం మంచిదే. ఎదుగుతున్న వయసులో అది మంచి పద్ధతి. చిన్నప్పుడు తల్లి దగ్గర, కొంత ఎదిగాక, వాళ్లకి వేరే పక్కలు అమర్చాలి. ఈ విధంగా మీ అత్తగారు మీకు ఫ్రీడమ్ కూడా కల్పిస్తున్నారన్నమాట. సంతోషం! ఒకసారి ఆవిణ్ని చూడాలి.’’ ‘‘తప్పకుండా. ఈ సండే ఉదయాన్నే వచ్చీ. లంచ్ అక్కడే చేద్దూగాని. మా అత్తగారి చేతివంట కూడా రుచి చూద్దువుగాని. మీవారిని, అదే బావగారిని కూడా తీసుకురా. నేను ఫోను చేసి పిలుస్తాను. తప్పకుండా రండి. సరేనా?’’   ‘‘ఓకే.’’
 
 ‘‘ఆవిడ వచ్చిన దగ్గర్నుంచీ, నాకు చాలా రిలీవ్ అయింది. ఇంటి గురించి, పిల్లల గురించి బెంగ తగ్గింది. తాళం సరిగ్గా వేశానో, గ్యాసు కట్టానో లేదో, పనమ్మాయి వచ్చిందో లేదో, పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారో అని రకరకాల టెన్షన్లు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పిల్లలు కూడా వాళ్ల నానమ్మ దగ్గర బాగా చేరికయ్యారు. చిన్న చిన్న పద్యాలు, దేవుని కథలు అన్ని నేర్చుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు