అయినా మనిషి మారలేదు

15 Jul, 2018 00:32 IST|Sakshi

ఈవారం కథ

‘‘ఇది చాలా పొరపాటు సుకుమార్‌’’. మనసులోని కోపాన్నీ, బాధనూ అణచుకుంటూ సుకుమార్‌ని మెత్తగా మందలించాను. సుకుమార్‌ నా ముందు ప్రశాంతంగా, ఏ భావం మొహంలో కనబడకుండా కూర్చున్నాడు. సుకుమార్‌ భార్య కోమలి రెండోసారి గర్భవతి అయ్యింది. ఏడో నెలతో ఉంది. అప్పుడే తనని పరీక్ష చేసి బయటకు పంపించి సుకుమార్‌తో ఏకాంతంగా మాట్లాడుతున్నాను. గుండె వైద్యుడిగా క్లినిక్‌లో నా రోగుల మీద, వారి బంధువుల మీద నాకు కోపం వచ్చే సందర్భాలు తక్కువే. నా కోపంతో కొద్దిగా వేడెక్కిన గదిలో కూర్చోటానికి కించిత్‌ ఇబ్బందిగా అనిపించింది. నాకు మాత్రమేనేమో! సుకుమార్‌ ప్రశాంతంగానే ఉన్నాడు. 

రెండు సంవత్సరాల క్రితం కోమలి మొదటి కాన్పులో బంగారం లాంటి ఒక ఆడబిడ్డని ఏ సమస్యా లేకుండా ప్రసవించింది. అయితే పిల్ల పుట్టిన నెల రోజుల నుండి కోమలికి విపరీతమైన ఆయాసం మొదలైంది. ఆయాసంతో పడుకోలేక రాత్రంతా కూర్చొని ఉండాల్సి వచ్చేది. ఆమె గైనకాలజిస్ట్‌ ఆమెను నా దగ్గరకు పంపించారు. ప్రాథమిక పరీక్షల తరువాత కోమలికి పెరీ పార్టం కార్డియొమయోపతి అనే వ్యాధి ఉందని నిర్ధారించాను. ఆ జబ్బులో అప్పటివరకూ ఏ సమస్యా లేని బాలింతలకు గుండె అకస్మాత్తుగా బలహీన పడుతుంది. గుండె బలహీనంగా ఉండడం ప్రమాదకరం. కొంతమందికి ఆయాసం ఎక్కువై ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌ పెట్టాల్సిన అవసరం రావచ్చు. మరికొంతమంది ఏ హెచ్చరికా లేకుండా చనిపోవచ్చు కూడా. ఈ జబ్బు వున్న వారిలో కొందరు పూర్తిగా కోలుకుంటారు. కొందరికి గుండె కోలుకోక చనిపోయే అవకాశం ఉంది. కోమలికి ఈ జబ్బు తీవ్రంగా వచ్చింది. సుకుమార్‌ చిన్న బిడ్డతో, భార్య జబ్బుతో విపరీతంగా సతమతమయ్యాడు. రెండు రోజుల హాస్పిటల్‌ వైద్యం తరువాత కోమలి ఆరోగ్యం క్రమేణా మెరుగుపడింది. సుకుమార్‌ కొద్దిగా గాలి పీల్చుకున్నాడు. ఆరు నెలల వైద్యం తరువాత కోమలి గుండె దాదాపుగా పూర్తిగా కోలుకుంది. అయితే ఈ జబ్బు నుండి కోలుకున్న వారు ఒక్కటే జాగ్రత్త పాటించాలి. 
వాళ్ళు ఇంకెప్పుడూ గర్భం ధరించకూడదు.

గర్భం ధరిస్తే గుండె మళ్ళీ బలహీన పడవచ్చు. రెండోసారి గుండె బలహీన పడితే ప్రాణానికి ప్రమాదం మరీ ఎక్కువ. అయితే ఎవరికి మళ్ళీ జబ్బు రావచ్చు, ఎవరికి రాదు అని చెప్పటం చాలా కష్టం. రెండో కాన్పుకి వెళ్ళటం అనేది విధితో పందెం కట్టటం లాంటిదే. భార్యను ప్రేమించే ఏ భర్తా ఆ పందెం కట్టకూడదు. మొదటి సంతానాన్ని ప్రేమించే ఏ తల్లీ ఆ పందెంలో భాగం కాకూడదు. అయితే విధి విచిత్రమయినదే కాదు. జాలి లేనిది కూడా. సుకుమార్‌కి భార్య అంటే ఇష్టమే కానీ మగసంతానం కావాలనేది అతని బలీయమైన కోరిక. కోమలికి తన కూతురంటే ప్రాణమే కానీ సుకుమార్‌ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. రెండోసారి గర్భవతి అయితే గుండె జబ్బు రావచ్చు, రాకపోవచ్చు కూడా కదా! భర్త కోరిక కోసం ఆ మాత్రం రిస్క్‌ తీసుకోవాలి కదా? తీసుకుంటే తను అతనిని ఎంతగా ప్రేమిస్తుందో అతనికి తెలుస్తుంది కదా! కొన్ని సమయాల్లో మనసు చేసే వితండ వాదానికి పరిధులుండవు. 

ప్రస్తుతానికొస్తే, రెండు సంవత్సరాల తరువాత, అందుకనే సుకుమార్‌పై కోపంగా ఉన్నాను. కోమలికి ఏడో నెల. రెండు సంవత్సరాల బంగారు తల్లి సంయన తన మొదటి కూతురు. కోమలి ఆరోగ్యం అప్పటికి బాగానే ఉంది. మళ్ళీ గుండె జబ్బు వస్తుందో లేదో వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు. భయంతో కోమలి. కోపంగా నేను. రాగ ద్వేషాలకతీతంగా సుకుమార్‌. వేచి చూడటం తప్ప చేసేది నిజంగానే లేదు. కోమలిని ప్రతి నెలా గుండె పరీక్షలకు రమ్మన్నాను. కాన్పు సక్రమంగానే అయిపోయింది. తీసుకున్న రిస్క్‌కు తగిన ఫలంగా మగబిడ్డ కావాలనుకున్న సుకుమార్‌కీ, భర్త కోరికను ప్రాణాలని పణంగా పెట్టితీర్చాలనుకున్న కోమలికీ ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోతున్న ఆడపిల్ల, అక్కర్లేని బహుమతిలా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇంగ్లిష్‌లో మర్ఫీస్‌ సిద్ధాంతం అని చెబుతుంటారు – ‘ఒక పరిస్థితిలో ఏమేమి ఉపద్రవాలు జరగటానికి అవకాశం ఉన్నదో, అన్నీ జరుగుతాయి’. 

కోమలి విషయంలో మర్ఫీస్‌ సిద్ధాంతం మరో మూడు నెలల తరువాత నిజమైంది. ఈసారి ఆమె గుండె పూర్తిగా బలహీనపడింది. ఆమెను ఐసీయూలో అడ్మిట్‌ చేశాం. ఇద్దరు ఆడపిల్లలతో బయట నిలబడ్డ సుకుమార్‌కి పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. తను గెలవలేని పందేనికి భార్య ప్రాణాన్ని పణంగా పెట్టానని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు సుకుమార్‌.  అన్ని మానసిక స్థితులలోకీ భరించరాని, భరించలేని స్థితి పశ్చాత్తాపం. సుకుమార్‌ని ఓదార్చటానికి నాకు మాటలు మిగల్లేదు. అతను చేసింది తప్పే అయినా, తన తప్పు తను తెలుసుకున్నాడు. అయినా జాలితో బాధకి చికిత్స జరగదు. ఆరు రోజులు ఐసీయూలో ఉన్న తరువాత కొద్దిగా కోలుకున్న కోమలి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమె గుండె బలం మెరుగుపడలేదు. విపరీతమైన ఆయాసంతో రోజూ కష్టపడుతూనే ఉంది. రెండో బిడ్డకు సాన్వితి అని పేరు పెట్టారు. కోమలి అనారోగ్యంతో సాన్వితికి పోషణా, సంయన పట్ల శ్రద్ధా తక్కువయింది. సుకుమార్‌కి తనపై తనకి అసహ్యం పెరిగింది. 

ఆయాసం పెరిగినప్పుడల్లా కోమలిని మళ్ళీ అడ్మిట్‌ చెయ్యవలసి వచ్చేది. ఆరు నెలలూ, నాలుగు అడ్మిషన్లూ, మూడు లక్షల ఖర్చు తరువాత కోమలి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఓ రోజు సుకుమార్‌ ఇంటికి వెళ్ళాను. కోమలి పరిస్థితి ఏమీ బాగుండలేదనీ, ఒకసారి ఇంటి దగ్గర చూసి వెళ్ళమని సుకుమార్‌ ప్రాధేయపడితే వెళ్ళక తప్పలేదు. వాళ్ళది ఒక మూడు బెడ్‌ రూముల అపార్ట్‌మెంట్‌. నన్ను సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు సుకుమార్‌. కోమలి నిస్త్రాణతతో ఒక గదిలో పడుకొని ఉంది. పసిబిడ్డ సాన్వితి తన పక్కనే పడుకుని నిద్రపోతోంది. నన్ను చూసి లేవబోయిన కోమలిని వారించి తనను క్లుప్తంగా పరీక్షించాను. తన పరిస్థితి బాగాలేదని స్పష్టంగా తెలిసింది. ఇలాగే ఉంటే తను ఎక్కువకాలం బతకదని అర్థమయ్యింది. కొన్ని మందులు మార్చి రాసిచ్చి బయలుదేరబోయాను. కాఫీ తాగి వెళ్ళమని సుకుమార్‌ బలవంతం చేయటంతో వేరే గదిలో అతనూ నేనూ కూర్చున్నాము. నిశ్శబ్దమైన గదిలో స్తబ్ధ్దమయిన మనసులతో మౌనంగా కూర్చున్నామిద్దరం. అక్కడినుంచి మాయమైతే బాగుండుననిపించింది. 

సుకుమార్‌ కాఫీ కొంచెం తాగి అన్నాడు – ‘‘నేను పెట్టిన కాఫీలానే ఉంది సార్‌ నా జీవితం. కోమలి లేకుండా నేను బతకలేను సార్‌. నా పిల్లల పరిస్థితి తలుచుకుంటే, నేనెంత తప్పు చేశానో నాకర్థమవుతోంది.’’ మింగుతున్న బాధతో ఇక మాట్లాడలేకపోయాడు సుకుమార్‌.మళ్ళీ మా మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని తట్టి లేపుతున్నట్లు సుకుమార్‌ కంట్లోంచి జారి కాఫీ కప్పు మీద ఒక్కొక్కటే పడుతున్న కన్నీటి బొట్లు. 
‘‘ఒక మార్గం మాత్రమే ఉంది.’’ చెప్పాను. సుకుమార్‌ చటుక్కున తలెత్తి ఆశగా చూశాడు. ‘‘గుండెమార్పిడి ఆపరేషన్‌ చేయించొచ్చు. అయితే ఆపరేషన్‌కి ముప్పై లక్షల వరకూ అవుతుంది.’’ నా మాట విన్న సుకుమార్‌ మొహంలో ఆశ మెల్లగా మాయమైంది. ‘‘సార్‌! ఈ ఇంటి మీద నాకు ముప్పై అయిదు లక్షల అప్పుంది. ఇక నాకు అప్పిచ్చే వాళ్ళూ లేరు, తీర్చే స్థోమతా నాకు లేదు.’’ మళ్ళీ తలదించుకున్న సుకుమార్‌ భుజం మీద మెత్తగా తట్టి బయలుదేరాను. 

కోమలికి గుండె మార్పిడి తప్ప వేరే దారి లేదని తేలిపోయింది. సుకుమార్‌ పూర్తిగా కుంగిపోయాడు. విద్య నేర్పిన సంస్కారంతో పిల్లలను తను బాగానే చూసుకునేవాడు. కానీ గుండె మార్పిడికి తన దగ్గర డబ్బు లేదు. ప్రతిసారీ కాదుగాని, కొన్నిసార్లు డబ్బుకి ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. ఒకరోజు కోమలి, సుకుమార్‌ ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. బాగా ఆలోచిస్తే ఒక ఉపాయం దొరికింది. ఒక స్వచ్ఛంద సంస్థని నడిపే నా మిత్రులను, సినీ స్టార్స్‌ను సాయమడిగాను. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొంత సాయం అందింది. ఫేస్‌బుక్‌లో విరాళాలకై సుకుమార్, కోమలి ఇద్దరి పిల్లలతో ఉన్న ఫొటోని షేర్‌ చేశాను. మంచితనం ఇంకా మిగిలే ఉన్న సమాజం సుకుమార్‌ పశ్చాత్తాపంపై జాలి పడింది. మూడు నెలల తర్వాత మొత్తానికి డబ్బులు సమకూరాయి. ఆరు నెలల తరువాత బెంగళూరులో ఒక విద్యార్థి ప్రమాదంలో మరణిస్తే గుండె కూడా దొరికింది. గుండె మార్పిడి మామూలు విషయం కాదు. ఆపరేషన్‌ జరిగేటప్పుడూ, ఆ తరువాత రోగి మరణించే అవకాశాలు చాలా ఎక్కువ. అదృష్టవశాత్తూ కోమలి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిపోయింది. అత్యంత ఒడిదుడుకుల మధ్య మూడు నెలల తరువాత కోమలి చివరకు పూర్తిగా కోలుకుంది. సుకుమార్‌ ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. తను నా చేతులు పట్టుకొని ఆనందంతో ఏడుస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. సహాయం చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు భార్యాభర్తలు. వారి జీవితాన్ని ఆదర్శంగా చూపించిన చాలా టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు నమ్మే అందరు దేవుళ్ళకీ మొక్కులు సమర్పించుకున్నారు. కోమలికి రెండవ జీవితం మొదలైంది. సుకుమార్‌కి కోమలిపై ప్రేమ రెట్టింపైంది. ఇద్దరు పిల్లలతో, ప్రేమించే భర్తతో కలిసి ఒకరోజు కోమలి క్లినిక్‌కి వచ్చింది. కొంతసేపు మాట్లాడిన తరువాత కోమలినీ పిల్లలనూ బయటకు పంపించాడు సుకుమార్‌. తనిప్పుడెంతో ఆనందంగా కనిపించాడు. మనస్ఫూర్తిగా అభినందించాను. సంతృప్తిగా కూర్చున్న నేను ఆ తరువాత అతనడిగిన ప్రశ్నకి స్థాణువులా మిగిలిపోయాను. ‘‘మగ బిడ్డ కోసం ఇప్పుడు ప్రయత్నించవచ్చా సార్‌?’’ సుకుమార్‌ ప్రశాంతంగా మొహంలో ఏ భావం కనిపించకుండా ఉన్నాడు. నా మనసునే, బాధ సునామీలా ముంచెత్తింది.  ఏసీ రిమోట్‌ ఎక్కడో? రూమ్‌ ఇంత వేడిగా ఉంది!
  

మరిన్ని వార్తలు