నేను దొంగిలించలేదు

23 Feb, 2020 10:17 IST|Sakshi

కథా ప్రపంచం

జర్మన్‌ కథ

చాలా ఇరుకుగా వుంటుంది ఆ దొడ్డి. ఎప్పుడూ చీకటిగానూ వుంటుంది. చెమ్మతో చల్లగా వుండే నాలుగయిదు మెట్లు ఎలాగో తడుముకుంటూ దిగి వెళితే ఎదురుగా చిన్నద్వారం వున్న ఇల్లు కనిపిస్తుంది. గోడ మీద చిరిగిపోయిన అట్టముక్క మీద ‘స్టీబకే: జోళ్ళు తయారుచేసేవాడు’ అని రాసి వుంటుంది. మధ్యాహ్నమయింది. ఆ దొడ్డిలో కాపురం వున్న దురదృష్టవంతులు అప్పుడే తిళ్ళూ అవీ ముగించుకుని తీరికగా వున్నారు.
ఒకామె పెద్దగొంతుకతో  ఏదో వీధిపాట మొదలుపెట్టింది. దొడ్డి అవతల వరసనించి పెద్దగొంతుకతో ఎవరో అరిచారు ‘‘కొంచెం నోరు కట్టిపెట్టవమ్మా, నీలాగే అందరూ అరిస్తే ఇక్కడ వుండడమే రోత అయిపోతుంది’’
ఒక కిటికీ దభీమని మూతపడింది. కిటికీతో పాటూ పాటా బందయిపోయింది. నిశ్శబ్దంగా వుంది. బైట రోడ్ల మీద, రాళ్ళు పగుల్తున్నట్లుగా వుంది ఎండ. వేసవి నడియవ్వనంలో వుంది.

దొడ్డిలోని వాళ్ళు మధ్యాహ్న భోజనాలయాక, చిన్న కునుకు తీస్తున్నారు. ఒక కిటికీ తెరుచుకుంది. ఏదో దొడ్డి ముందు వచ్చిపడింది. దుమ్ముముక్క. ఎండ వెలుగులో అది మెరుస్తోంది! ఆ మూల వొక ముసిలికుక్క కూచునివుంది. బాగా బక్కచిక్కిపోయివుందది. దుమ్ముముక్క చూడగానే దాని కళ్ళు మెరిశాయి. ఒక కాలు మెల్లిగా చాచింది కుక్క. మెల్లిమెల్లిగా మరోకాలూ చాచింది. లేచిందది. ముందుకువచ్చింది. ఆకలితో అలిసిపోయిన దాని శరీరం వూగుతోంది. అరుగు చివరిదాకా ఎలాగో ఈడ్చుకుంటూ వచ్చింది. మెడ చాచింది. నాలిక పైకి తీసింది. దాని మెడకి కట్టిన గొలుసు పొట్టిగా వుంది. దుమ్ముముక్క దాకా అంది రాలేదది.
బాధతో గుర్రుమని మూలిగింది కుక్క. కాంక్ష సూచిస్తున్న కుక్క కళ్ళల్లో మరోసారి బాధతో కూడిన వొక తళుకు మెరిసింది. ఆఖరిసారి మళ్ళీ అటుచూసింది. పక్కనే వున్న చిప్పలో మూతి పెట్టింది. చిప్పలో నీళ్ళు లేవు. ఖాళీగానే వుందది. ఒక్క చుక్కయినా తడిలేదు. నాలిక పైకి చాచి మళ్ళీ పడుకుంది కుక్క. దొడ్డి ద్వారం చప్పుడైంది. రెండు చిన్న చేతులు కుక్కని కౌగిలించుకున్నాయి. ఒక కుర్రాడు దాని దగ్గిర నేల మీద చతికిలబడ్డాడు.

‘‘ప్లూటో, ప్లూటో నా ముసిలి ఫ్లూటో!’’ ఆ పిలుపులో ప్రేమ వొలికిపోతూ వుంది. తోక ఆడించింది కుక్క. కుర్రాడి బక్క గుండెల మీద మోర మోపింది. అతడి చేతులూ, మొహమూ నాకింది. అయితే దాని ఆనందంలో ఉత్సాహం లేదు. వేదన కనిపిస్తూనే వుంది. గ్రహించాడతడు.
‘‘అయ్యో, ప్లూటో, నీ దగ్గిర నీళ్ళూ లేవా? ఉండు’’ అంటూ  లేచాడతడు. విరిగిన మట్టిచిప్పతో పైపు దగ్గిర నించి నీళ్ళు తెచ్చాడు. కుక్క చూపు కనిపెట్టి, దుమ్ము ముక్క తెచ్చి వేశాడు. పెద్దపెద్ద కోరలతో దాన్ని కొరకడం మొదలెట్టింది కుక్క.
‘‘నా దగ్గిర ఏమీలేదు. కొంచెం వోపిక పట్టు ప్లూటో, నా చేతికి కొంచెం డబ్బు రానీ, నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు భలే మాంసం ముక్క తెచ్చిపెడతాను. నిజం. నా మాట నమ్ము’’ అన్నాడతడు.
చెప్పడం తేలికే హాస్‌స్టీబకేకి. తన చేతిలో దమ్మిడీ లేదు. తన దగ్గిర వుండేదల్లా తన రొట్టిలోంచి మిగిల్చిన నాను రొట్టిముక్క మాత్రమే. అదే తన నేస్తానికి పొద్దుటా, సాయంకాలం తాను ఇవ్వగిలిగింది. హాస్‌ స్టీబకే కుర్రాడు. పట్నం ఉత్తరభాగంలో  పాలు అమ్మడం అతడి పని. అతడి పెరగడం ఆగిపోయింది. అతడి జబ్బు కళ్ళూ, చప్పిడి ముక్కు, వాడిపోయిన చూపులు చూసినవాడు  ఎవడూ అతడికి పన్నెండేళ్ళే అయాయని అనుకోడు.
 ప్లూటోని తట్టాడు  హాస్‌. చీడీల మీంచి టకటకా నడుస్తూ కింది ఇంటిదిక్కు నడిచాడతడు. ఒక  ఇంటిగుమ్మం ముందు నుంచున్నాడతడు. అతడి కళ్ళలో వైరాగ్యం, జబ్బూ కనిపిస్తున్నాయి. మెల్లిమెల్లిగా ముందుకి అడుగులు వేశాడు. మెట్ల మీద నుంచి కిందికి దిగాడు.

ద్వారం దగ్గిర అట్ట మీద ‘స్టీబకే: జోళ్ళు తయారుచేసేవాడు.’ అని రాసి వుంది. లోపల ఏదో చప్పుడైంది. వెంటనే ఎవరో ఆవులించినట్టూ వినిపించింది. కుర్రాడి ముఖంలో భయం కనబడింది. అతడి తండ్రి ఇంట్లో వున్నాడు. జంకుతూ జాగ్రత్తగా తలుపు తోశాడు.
‘‘నువ్వు సరైన వేళకే వచ్చావు. చప్పున పరిగెత్తుకు వెళ్ళు. కులేకు దుకాణం నుంచి మూడణాల సారా పట్టుకురా. డబ్బులు లేవు. ఇస్తానని చెప్పు...’’
కుర్రాడు ఏడుపు గొంతుకతో జవాబు  చెప్పాడు: ‘‘డబ్బులివ్వకపోతే వాడు నాకు ఇవ్వడు నాన్నా! నిన్నే సీసా విసిరేశాడు. కొట్టడానికి వచ్చాడు. నాకు భయమేస్తోంది’’ అన్నాడు.
‘‘చాప్, వెధవా. వెళతావా తన్నమన్నావా’’ బెంచీ మీద పడుకున్న ఆ పెద్ద ముఖం మనిషి అరిచాడు. ‘‘స్టీబకే’’–పొయ్యి దగ్గిరినించి తల్లి, వొక పిల్లాణ్ణి గుండెల మీద వేసుకునీ, వొకణ్ణి వేలుచ్చుకు నడిపించుకునీ వచ్చింది. భర్తకీ, కొడుక్కీ మధ్యగా నుంచుంది. బతిమిలాడుతూ అంది ఆమె: ‘‘స్టీబకే కొంచెం ఆగు. కాస్త రొట్టి ముక్క తిననీ వాడు. తేరుకుంటాడు.
‘‘బాబూ, చూడమ్మా, తిండి తినేసి నాన్న కోసం సారా తెచ్చి పెట్టేం!’’
‘‘ఉహూ’’ అంటూ తలవూపి గొణికాడు హాస్‌.
‘‘నాకు భయమేస్తోంది. వాడు నన్ను కొడతాడు. సారా తాగాడంటే నాన్నా బజాయిస్తాడు. ఉహు, నేను వెళ్ళను...వెళ్ళను.’’
‘‘ఒరేయ్‌!’’ బెంచీ మీద పడుకున్న మనిషి జోరుగా కొడుతూ అరిచాడు. కుర్రాడు సీసా తీశాడు. క్షణంలో ద్వారం అవతలికి వెళ్ళిపోయాడు. వెనకాల వినబడుతూనే వుంది తండ్రి నువ్వు.

‘‘పాలమ్మే కుర్రాళ్ళలో ఎవడో మహాచెడ్డవాడున్నాడు. దొంగ, పచ్చిదొంగ వాడు’’
తుఫానులాగా ఈ వార్త వూళ్ళో అల్లుకుపోయింది. వాణ్ణి పట్టుకున్నారు. నీలిచొక్కా తొడుక్కున్నాడు వాడు. పారిపోకుండా కింద కూచోబెట్టారు. రెండూ రెండూ కలిపితే ఎంతవుతుందో తెలియనివాడు హాస్‌ స్టీబకే. రోడ్డు మీద డబ్బులు పడివుంటే తియ్యడు సరికదా, పక్కనించి తప్పించుకుపోతాడు. వాడా అర్ధరూపాయి దొంగిలించింది! ఇంత తెలివి తక్కువా? బాకీ డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు దొంగిలిస్తే డ్రైవర్‌ కనిపెట్టేశాడట!
అసలు కథ ఏమిటంటే, హాన్‌స్టీబకే దొంగిలించడం నిజం. అతడే వొప్పేసుకున్నాడు కూడా. వొణికిపోతూ, బిక్కచచ్చిన ముఖంతో తనంతట తానే డ్రైవర్‌కి లొంగిపోయాడు. ఇన్‌స్పెక్టర్‌ దగ్గిరికి వచ్చేక  నోరు విప్పలేదు.
బిక్కముఖం వేసి తలవొంచకున్నాడు. ఎంతో అంత తర్జనభర్జన జరిగింది.
‘‘ఎక్కడ దాచావు అర్ధరూపాయి?’’
‘‘కేకులు కొనుక్కు తిన్నావా?’’
దేనికి జవాబు లేదు.
‘‘ఏం రా, దొంగతనం తప్పని తెలియదూ? తెలిసిన్నీ డబ్బులు దొంగిలించావూ? సిగ్గు వేయ్యలేదూ నీకు? ఊరిపోసుకు చావలేకపోయావూ?’’
 కళ్లజోడు సర్దుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌. కుర్రాడి ముఖం తీవ్రంగా చూశాడు.
‘‘నీ నౌకరీ పీకెయ్యడం నా చేతిలో వుందని నీకు తెలుసుకదా! దొంగలకి మా దగ్గిర జాగా లేదు’’

ఈనెపుల్లలా వున్న హాస్‌ శరీరంలో మెరుపు పరిగెత్తినట్టయింది. క్షమాపణ చెప్పుకోవడానికి చేతులు జోడించాడతడు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
‘‘నా నౌకరీ తీసెయ్యకండి బాబయ్యా, దయచూడండి. చంపేస్తాడు మా బాబు. మరెప్పుడూ ఇలా చెయ్యను. నౌకరీ తీసెయ్యకండి.’’
అతడి నోరు తొట్రుకుంటూవుంది. కళ్ళలోంచి నీళ్ళు బొటబొటా కారుతున్నాయి.
‘‘మరి డబ్బులెందుకు కాజేశావ్‌?’’
హాస్‌ మళ్లీ మూగనోము పట్టాడు. అతడి కాళ్ళు వణుకుతున్నాయి.
‘‘పంతగొట్టులా వున్నాడు’’ పక్కమనిషితో అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. హాస్‌ని మళ్లీ గద్దిస్తూ అన్నాడు...
‘‘సరే, నువ్వు ఇంటికి వెళ్లవచ్చు. నీ బాబుని సాయంకాలం ఇక్కడికి రమ్మను మాట్లాడాలి. ఏడిస్తే వచ్చేదేమిటి? తిన్నగా ఇంటికి పో.’’

నీడ కదులుతున్నట్టు రోడ్ల మీద వెళుతూ కనిపించాడు హాస్‌. ఇల్లు దగ్గిరపడుతున్నకొద్దీ అతడి అడుగులు మందమవుతున్నాయి. తుదకి అతడు పాకుతున్నాడా అన్నట్టు వెళుతున్నాడు. కసాయి దుకాణం దగ్గిరకి వచ్చాడు. నిన్న ఇక్కడే ఆ సంఘటన జరిగింది. కిటికీ దగ్గిర వేలాడుతున్న మేకమాంసాన్ని లాలసత్వంతో చూస్తూ నుంచున్నాడు. గుటకలు మింగుతూ నుంచుకున్నాడు. నిజమే, కాని ఆ గుటకలు తన కోసం కాదు. కుక్క కోసం. దానికి ఇంత తిండి వేసేవాడే లేడు. దాని యజమాని లెహమాన్న్‌ లుబ్ధాగ్రేసర చక్రవర్తి. పగలనక, రాత్రనక దాని చేత రోడ్ల మీద బండి లాగిస్తూ వుంటాడు. అదే సమయానికి లేహమాన్న్‌ బండి తోలుకువచ్చాడు. సంచులు దొంతులుగా బండి మీద వున్నాయి. కుక్క ప్లూటో బండిలాగుతోంది. అది మరి నడవలేకపోతూవుంది. బండి కదల్లేదు. ఒకటి ఛళ్లున తగిలించాడు లెహమాన్న్‌. ప్లూటో వొణికింది. బలమంతా కుదించింది. ముందుకి ప్రయత్నించింది, బండి కొంచెం కదిలింది. కాని, మళ్లీ ఆగిపోయింది. కుక్క కిందపడుకుండి పోయింది.

‘‘స్కౌండ్రల్‌’’ అంటూ అరిచాడు లెహమాన్న్‌. కాలెత్తి కుక్కని తన్నడం మొదలెట్టాడు. కుక్క దుఃఖంతో అరుస్తోంది.
దుకాణం కిటికీ దగ్గిర నుంచి మెరుపులా పరుగెత్తుకువచ్చాడు హాస్‌. కుక్కకీ దాని యజమానికీ మధ్య నుంచున్నాడు.
‘‘నీకు పుణ్యముంటుంది, దీన్ని కొట్టకు. పాపం, దీన్ని కనికరించు’’ అంటూ దీనంగా బతిమాలాడు. కుర్రాడి కమీజు నులిపిపట్టుకున్నాడు లెహమాన్న్‌. వాడి చెవులు నులిపినంత పనిచేశాడు.
‘‘చచ్చుదద్దమ్మా, పో. నీ పనేదో నువ్వు చూసుకుని ఏడు’’
గుండెల నిండా బాధా బరువుగా వుంది హాస్‌కి. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కసాయి దుకాణంలో  వేలాడుతున్న మాంసం ముక్క, కళ్ళ ముందు కట్టినట్టుంది. ఊగుతోందది. రమ్మని పిలుస్తున్నట్టుంది. ఆహా! ప్లూటో! ప్లూటోకి ఆ ముక్క దొరికితేనా! ఇది నిన్నటి మాట. ఇవాళ డబ్బులు దొంగిలించాడు హాస్‌. అతడు డబ్బులు పట్టుకు వెళుతూ వుంటే తక్కిన కుర్రాళ్ళు అతణ్ణి వేలెత్తి చూపుతున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఏవో గుసగుసలాడుతున్నారు.
‘‘దొంగ, దొంగ’’

తన తండ్రితో సంగతంతా ఇన్‌స్పెక్టర్‌ చెపుతాడు. ఇదంతా అతడి తలలో గిర్రుమంటూవుంది. అయినా అతడి ముఖంలో విజయసూచకమైన ఒక తళుకు కనిపిస్తూనేవుంది. జంకుతూ జంకుతూ నాలుగు దిక్కులూ చూశాడు. నోట్లోంచి షిల్లింగు బైటికి లాగాడు. పిడికిట్లో బిగించి పట్టుకున్నాడు. చప్పున దుకాణంలోకి దూరాడు. రెండు నిమిషాల్లో చిన్న పొట్లం జేబులో పెట్టుకొని పైకి వచ్చాడు. ఒక్క వూపున–ఎవరో వెంటతరుముతున్నట్లు ఇంటిదిక్కు పరిగెత్తాడు. దొడ్డిలో మూల కుక్క దగ్గిర ముడుకులు మోపి కూచున్నాడు. కుక్క మట్టిరంగు తల  దడదడలాడుతున్న తన గుండెల మీదికి లాక్కున్నాడు.
‘‘ప్లూటో, నా నేస్తం, ఇదిగో నీకోసం తెచ్చాను.’’
కుక్క తల మీద దెబ్బ. చర్మం పగిలి లోపలి మాంసం పైకి కనిపిస్తూవుంది. గుడ్లనీళ్ళు తిరిగాయి హాస్‌కి.
‘‘మళ్ళీ కొట్టాడా? ముసిలి ప్లూటో, నా నేస్తం, ఏడ్చావా? వద్దు–ఇదిగో నీ కోసం మాంసం తెచ్చాను.’’
కుక్క వాసన చూసింది. చూసీచూడడంతోనే దాని కళ్ళు మెరిశాయి. నోరు విప్పింది. హాస్‌ సంతోషంగా మాంసం కోసి, ముక్క తరువాత ముక్క కుక్క నోట్లో వేయడం మొదలుపెట్టాడు. మాంసం క్రమంగా తరుగుతూ వచ్చింది. అయినా ప్లూటో నోరు ఇంకా చూస్తూనే వుంది.
‘‘అయిపోయింది. ఇంతే. దుకాణం వాడు షిల్లింగు పుచ్చుకుని ఇచ్చాడు. అంతా నీ కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు నన్ను పట్టుకు తీసుకుపోనీ. భయం లేదు’’
హాస్‌ తండ్రి ఇన్‌స్పెక్టర్‌ దగ్గరి నుంచి వచ్చాక హాస్‌కి దెబ్బలు తప్పలేదు. నోటికి వచ్చినట్లు తిట్టాడు తండ్రి.

‘‘లుచ్ఛా, దొంగా!’’
కిందపడవేసి చేతులు తీటతీరేట్టు కొట్టాడు హాస్‌ని. చేతులు పీకేక కాళ్ళతో లంకించుకున్నాడు.
‘‘డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు! ఆ షిల్లింగు నువ్వు ఏంచేశావో చెప్పు. నిన్ను చంపేసి మరీ వొదిలి పెడతాను.’’
‘‘స్టీబకే, నీకు పుణ్యముంటుంది...’’
హాస్‌ తల్లి పిచ్చిత్తినట్టున్న తండ్రి చెయ్యి పట్టుకుంది.
‘‘నిజంగా చచ్చిపోతాడు వాడు. కాలో చెయ్యో విరిగిపోతుంది. తరువాత చేసేదుండదు. స్టీబకే, నీకు పుణ్యముంటుంది.’’
నోటికొద్దీ అరుస్తుందామె. తక్కిన పిల్లలు మొర్రో మొర్రో అంటున్నారు.
‘‘కేకలు మాంతావా లేదా? నోరు ముయ్యి ముందు. నింద ఎవడిదనుకున్నావ్‌! ఏం, ఇదేనా నిన్ను పెళ్ళి చేసుకున్న తప్పుకి ఫలం? నా ముందు వీడి విలువేమిటంటా? వీణ్ణి చంపితే కాని, వొదిలిపెట్టను’’
‘‘స్టీబకే!’’
‘‘నోరుముయ్యి!’’
గా–ట్ఠి దెబ్బ తగిలిన శబ్దమయింది.
‘‘అమ్మో!’’ అని పెద్ద కేక.
ఆమె అంతదూరంలో వెళ్ళిపడింది. ఓమూల కూలబడి పోయిందామె. కొడుకు ఏడుపు వినలేక, రెండు చేతులతోనూ చెవులు మూసుకుంది.
ఆఖరికి వాడి కోపం తగ్గింది. కుర్చీ మీద వెళ్ళి చదికిలబడ్డాడు. గొణగడం మొదలుపెట్టాడు.

‘‘ఎంతో నమ్మకమైన వాణ్ణి నేను....గాడిద. దొంగవెధవ. ఇన్‌స్పెక్టర్‌ నన్ను చూడగానే అన్నాడు స్టీబకే, నమ్మకమైనవాడివి నువ్వు. నీ ముఖం చూసి, నీ కొడుక్కి మరో అవకాశం ఇస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే మాత్రం వాణ్ణి నౌకరీ నుంచి తీసేస్తాను అని. ఒరేయ్‌ హాస్, మళ్ళీ ఇలా చేశావంటే నిన్ను మహమ్మాయి వొండేస్తాను. బతుకంతా నేను చెమటోడ్చి, చస్తూ  వుంటే ఈ వెధవ ఇలా సర్వనాశనం చేస్తాడూ!’’
చివరి మాటలు సరిగా వినబడలేదు. అంతలోనే అతడు గుర్రు మొదలుపెట్టాడు. 
 ఆకాశం మీద చుక్కలు మెరుస్తున్నాయి. డేకుతూ హాస్‌ బయటికి వచ్చేసరికి అందులో వొకటి సరిగ్గా దొడ్డి మీద మెరుస్తూవుంది. అతడు నడవలేకపోతున్నాడు. ఎలాగో ఈడ్చుకుంటూ మెట్ల దగ్గిరికి వెళ్ళాడు. దొడ్డిలో తడుముకుంటూ వెళ్ళి కుక్క పడివున్న మూల చేరాడు. కుక్క దగ్గిర చాపచుట్టగా పడిపోయి బెక్కడం మొదలుపెట్టాడు. మెల్లిగా మొరుగుతూ ప్లూటో అతడి ముఖం నాకింది. తుదకు పాదాల మీద శరీరం వాల్చింది.
ప్లూటో, హాస్‌...ఇద్దరూ అక్కడ అలిసిపోయి, మూలుగుతో బాధతో పడివున్నారు. వాళ్ల మీద బంగారునక్షత్రం మెరుస్తూ వుంది. అయితే, వాళ్ళు మాత్రం దాన్ని చూడలేదు. కొన్నాళ్ళయాక–
‘‘ఒరే, పెన్నీలు రెండూ ఏవిరా? ఎక్కడున్నాయి? ఏం, నువ్వే కొట్టేశావా?’’ హాస్‌ భుజాలు పట్టుకుని వూపుతూ అడిగాడు డ్రైవర్‌.
‘‘అయ్యో! నేను తియ్యలేదు’’ ఉత్తి చేతులు చూపిస్తూ అన్నాడు హాస్‌. 
‘‘మిస్టర్‌ సూల్జే, నా మీద ఫిర్యాదు చెయ్యకు. నేను తియ్యలేదు...తియ్యలేదు’’ మతిపోయినట్టు మాటిమాటికీ ఇదే అంటున్నాడు హాస్‌.

‘‘నాతో కచేరికి పద. నేను ఫిర్యాదు చేయక తప్పదు.’’ కుర్రాడి కాలరు పట్టుకున్నాడు డ్రైవర్‌.
అయితే చివరికి రెండు పెన్నీలూ ఏమయినట్టు? ఎక్కడన్నా పడిపోయాయా? లేదా చిల్లరవాపసు చేసేటప్పుడు పొరపాటున ఎవరికయినా ఎక్కువ  వెళ్ళిపోయిందా? ఏదైనా అవి పోవడం నిజం. హాస్‌ వొకసారి దొంగతనం చేసి దొరికిపోయాడు. ఇప్పుడు మాత్రం అతడు కాదని ఎలా తప్పుతాడు?
‘‘నౌకరీ తీసెయ్యవలసిందే ఇక. నీ బాబుతో చెబుతాను’’  అన్నాడు  ఇన్‌స్పెక్టర్‌.
ఊగుతూ, తూలుతూ కల్లు తాగినవాడిలా తన పరిచితమయిన సందుల్లో నడవడం మొదలుపెట్టాడు హాస్‌.
వాళ్ళు అతణ్ణి నమ్మలేదు. భయం దెయ్యంలా అతడి నెత్తి మీద కూచుంది. వేసవిలో తన దుర్బల శరీరం మీద కురిసిన దెబ్బలు జ్ఞాపకం వస్తున్నాయి. చలికాలం వచ్చింది. అయినా ఆ నొప్పులు వొదలలేదు. తాను వేసిన కేకలూ, మూలుగులూ అన్నీ ఇప్పుడూ అతడికి వినిపిస్తున్నాయి. తల తిరిగినట్టయింది, కళ్ళు మూసుకున్నాడతడు. 
ఎక్కడికి వెళ్ళడం? అడవికి వెళ్ళిపోతేనో? పట్టి తీసుకువచ్చేస్తారు. ఏంచెయ్యాలి? ఈ విశాలప్రపంచంలో రోడ్ల మీద తిరుగుతూ వుండాలా? అక్కడయినా, ఎక్కడయినా పట్టుకుంటారు. నెత్తురుచుక్క లేని ముఖంతో ఇంటికి వచ్చాడు హాస్‌.
‘‘ఏం బాబూ,  వొంట్లో బావుండలేదా?’’ అతడి జుత్తు నిమురుతూ అడిగింది తల్లి.
 మెల్లిగా తల వూపి జవాబు చెప్పాడు హాస్‌. తిన్నగా పడుకునే చోటికి వెళ్ళాడు. రోజూ తక్కిన పిల్లలతో రాత్రిళ్ళు పడుకునే చిన్న మంచం మీద పడుకున్నాడు.
ముఖం గోడ దిక్కు తిప్పుకున్నాడు.
చెమటలో ముద్దయిపోతోంది శరీరం.
చేతులు బొంత కింద పెట్టుకున్నాడు.

సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చాడు. మంచి హుషారైన నిషా మీద వున్నాడతడు.
‘‘కుర్రవెధవ ఎక్కడున్నాడు?’’
హాస్‌ వొణకడం ప్రారంభించాడు. కాళ్ళ నుండి తలదాకా కప్పేసుకున్నాడు బొంత. ఊపిరి తియ్యడానికయినా అతడికి ధైర్యం లేదు.
‘‘వాడికి జబ్బుగా వుంది’’ తల్లి చెప్పింది.
‘‘గంగలో పడనీ దొంగవెధవ. రేపటి దాకా ఆగు. తెల్లవారాక–నేను’’ పక్క మీద వాలాడతడు.
‘‘రేపు? తెలిసిపోయిందా ఏమిటి చెప్మా?–తెలియదా?’’
జలుబు,జ్వరంతో కుర్రాడు వణికిపోతున్నాడు. మండుతూవున్న కళ్ళు చీకట్లో అంతలేసి చేసుకుచూస్తున్నాడు. అతడి మనస్సులో ఏదో తీవ్రమయిన ఆలోచన వేస్తోంది. భయం కంటే తీవ్రంగా వుందది. ఎక్కడికైనా పోవాలని, పగిలిపోతున్న తలకాయను కాపాడుకోవాలని కోరికగా వుంది.
 ప్లూటో!–హఠాత్తుగా మందహాసం చేశాడు కుర్రాడు. అవును. అదే సరయింది. తెల్లవారగానే అతడు ప్లూటో దగ్గిర చేరతాడు. హాస్‌ మనసులో ఆలోచనల కెరటాలు. ఒక ఆలోచన లేస్తుంది. వెళిపోతుంది. కానైతే, అన్నిటిలోనూ ప్లూటో వుంటుంది. 
చివరికి నిద్ర వచ్చేసింది. అతడి చేతులు బొంత మీద వున్నాయి. నోరు తెరిచి వుంది.
అతడి వూపిరి చప్పుడుకే అతడి నిద్ర తేలిపోయింది. అంతసేపూ గాఢంగా పట్టింది నిద్ర. పాలిపోయిన అర్ధచంద్రుడు కనిపిస్తూనే వున్నాడు.
ఇంకా తెల్లవారలేదు. ఊపిరి బిగపట్టి మెల్లిగా అడుగులు వేస్తూ లేచాడు హాస్‌. కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు. తల చక్కగా దువ్వుకున్నాడు. నీలికమీజు వేసుకున్నాడు. పచ్చగీత టోపీ పెట్టుకున్నాడు. చప్పుడు చెయ్యకుండా తల్లిమంచం దగ్గిరకి వెళ్ళాడు. ఒక్క క్షణం ఆమెని చూస్తూ నుంచున్నాడు. తరువాత తలుపు తీసి బైటికి  జారిపోయాడు.
స్టీబకే–జోళ్ళుకుట్టే స్టీబకే అర్ధరాత్రిలాగే ఇప్పుడు గట్టిగా గుర్రు కొడుతున్నాడు. కాని, అతడి భార్య గట్టిగా ఎవరో పిలవడం విని లేచింది. పిలుపు దొడ్డిలోంచే వచ్చింది.

‘‘స్టీబకే! ఏమమ్మో, స్టీబకే! స్టీ–బ–కే’’
ఏదైనా గందరగోళం జరిగిందా?
మంచం మీది నుంచి పిల్లలు లేచారు. అరవడం మొదలెట్టారు. ఆమె ఉలిక్కిపడి లేచింది, పడుతూ లేస్తూ  కిటికీ దగ్గరికి వెళ్ళింది. బైటి నుంచి కిటికీ కొడుతున్నారు.
‘‘స్టీబకే! ఏమమ్మో స్టీబకే!’’
‘‘ఏమిటి? ఏమయింది!’’
ఆమె వణకడం ప్రారంభించింది. ఏడుపుధ్వని బాధగా వుంది.
‘‘అయ్యో! నీ కొడుకు! ఏదో అయిపోయింది వాడికి!!’’
‘‘ఏదో అయిపోయిందా? ఏమైందమ్మా’’
తల్లి శరీరంలో భయం కెరటాల్లా పరిగెత్తింది. భర్తని లేపేసింది.
‘‘స్టీబకే!’’
స్టీబకే ఇటునించి అటు వొత్తిగిల్లాడు. బైట గోల  మరింత హెచ్చిపోయింది. మనుష్యుల కేకల్లో మధ్యమధ్య కుక్క మొరగడమూ వినిపిస్తోంది. హాస్‌ తల్లి బైటికి రావడమే తడువు– అంతమందీ వొకటేగోల. కుక్క కట్టివున్న మూల అందరూ మూగివున్నారు.

‘‘ఆ,  ఏమయింది? ఏమిటయిందీ?’’
‘‘ఘోరం! స్టీబకే కొడుకు! రామరామ!!’’
జనం పక్కకి తప్పుకున్నారు. తల్లి బలవంతంగా లోపల దూరింది. దూరీ దూరడం తోటే ఆమె వొక్క అరుపు అరిచింది. దొడ్డి దొడ్డంతా ప్రతిధ్వనించింది అరుపు. దానికి ప్రతిధ్వనిలా వుంది కుక్క అరుపు.
కుక్క కట్టివున్న దగ్గిర, మీద గొడకి వొక ఇనప నాగవాసం వుంది. దానికో తాడూ–తాడుతో వొక కుర్రాడి దేహమూ వేలాడుతున్నాయి. పచ్చటి గీతల టోపీ కింద పడివుంది. ప్రాతఃకాలం గాలికి కుర్రాడి ముంగుర్లు కదలాడుతున్నాయి. నోరు తెరిచి వుంది, కళ్ళు పైకి వచ్చేసి మెరుస్తున్నాయి.
వేలాడుతున్న కుర్రాడి దగ్గరికి వెళ్ళాలని, పిచ్చెత్తినట్టు కుక్క వురుకుతూ వుంది. కాని వెళ్ళలేకపోతోంది. కింద సాగిలబడుతోందది. మీదికి నోరెత్తి అరుస్తోంది. ఎవ్వరినీ దగ్గరికి రానివ్వకుండా వుంది.
కుక్క దగ్గిర నల్లటి గోడ మీద, చదవడానికి వీలుగా, కుర్రాడు చేత్తో రాసిన పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి.
‘రెండు పెన్నీలు నేను దొంగిలించలేదు.
ప్లూటోని బాగా  చూడండి.
హాస్‌ స్టీబకే’
మూలం : క్లారాఫ్రీబిగ్‌
తెలుగు: పురిపండా అప్పలస్వామి 

మరిన్ని వార్తలు