తూర్పు పడమర!

7 Nov, 2015 22:24 IST|Sakshi
తూర్పు పడమర!

ఆంగ్‌సాన్ సూచీ అనగానే రాజకీయాలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు మాత్రమే గుర్తుకు వచ్చే వారికి... రెబెకా ఫ్రాన్ రాసిన ‘ది అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ ఆఫ్ ఆంగ్ సాన్ సూచీ’ వ్యాసం చదివితే, ఆమెలోని మరో కోణం, ఆమె ప్రేమ లోతు తెలుస్తాయి.
 
 ఆమెది తూర్పు. అతడిది పశ్చిమం. అయినా ఇద్దరిదీ ఒకే ప్రపంచమయ్యింది. ఎందుకంటే... ఎక్కడైనా నిబంధనలు వర్తిసాయి గానీ, ప్రేమలో మాత్రం వర్తించవు. ప్రేమలో ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలు పుట్టి కొత్త బంధాలను పరిచయం చేస్తాయి. ప్రేమ గట్టిదైతే తూర్పూపడమరలు సైతం ఇలాగే ఏకమవుతాయి!
 
 జీవితం అంటే... రోజూ పాలిటిక్స్, ఫిలాసఫీ, ఎకనమిక్స్ క్లాసులు బుద్ధిగా వినడమే అన్నట్లుండేది, ఆక్స్‌ఫర్‌‌డ యూనివర్శిటీలో చదువుతోన్న సూచీకి. అలాంటి సమయంలో తన గార్డియన్ లార్డ్ గోర్ ద్వారా ఇంగ్లండ్ కుర్రాడు మైఖేల్ ఓరీస్ ఆమెకు పరిచయమయ్యాడు.
 ‘మనం బతకడానికి ఆహారం మాత్రమే సరిపోదు... హాస్యం కూడా అవసరం’ అని తన డైరీలో ఒకసారి రాసుకుంది సూచీ. దురదృష్టమేమిటంటే నవ్వే పరిస్థితి గానీ, ఇతరులను నవ్వించే అవకాశం గానీ అంతవరకూ ఆమెకు రాలేదు.
 
  కానీ మైఖేల్ వచ్చాకే అవన్నీ జరిగాయి. అతడి రూపంలో నవ్వు ఆమెకు దగ్గరైంది. అతడి హాస్యంతో పొట్ట చెక్క లయ్యేలా నవ్వేది సూచీ. అంతకు ముందె ప్పుడూ ఒంటరిగా కనిపించే ఆమె... మైఖేల్‌తో కనిపించసాగింది. ఎప్పుడూ మౌనంగా ఉండేది... నవ్వుల వెన్నెల్లో విహరించసాగింది. అంతగా ఆమె జీవితాన్ని మార్చింది మైఖేల్ రాక.
 
 ఒకరోజు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పార్క్‌లో... ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవా లనుకుంటున్నాను’’ అని ప్రపోజ్ చేశాడు మైఖేల్. ఆమె నుంచి ఎలాంటి స్పందనా లేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది.
 ‘‘తప్పుగా మాట్లాడితే క్షమించు’’  అన్నాడు మైఖేల్. కొద్దిసేపటి తరువాత మౌనం వీడింది సూచీ. ‘‘నేను నా దేశం కోసం బతుకుతున్నాను. అక్కడి నుంచి ఏ క్షణం పిలుపు వచ్చినా రెక్కలు కట్టుకొని వెళతాను.
 
 నీకు సమ్మతమేనా?’’ అంది. ‘‘ఏదైనా చేసే స్వేచ్ఛ నీకుంది. నువ్వు నాతో ఉన్నా, లేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పుడూ ఉంటావు’’ అన్నాడు మైఖేల్. ఆ మాటలు సూచీకి నచ్చాయి. అక్కడికక్కడే  గ్రీన్‌సిగ్నలిచ్చింది. మైఖేల్‌కి భార్య అయ్యింది. పెళ్లి చేసుకుని ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సాధారణ గృహిణిలాగే వంట చేయడం నుంచి ఇల్లు శుభ్రం చేయడం వరకు అన్నీ చేయ సాగింది. పిల్లలు (అలెగ్జాండర్, కిమ్) ఆమె పంచప్రాణాలు. ‘గృహమే కదా స్వర్గసీమ’ అనుకునేంత ఆనందం!  
 
 అంతలోనే తల్లి ఆరోగ్యం బాలేదని మయన్మార్ నుంచి సూచీకి ఫోన్ కాల్. ‘‘అక్కడి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్లడం మంచిది కాదేమో’’ అన్నారు సన్నిహితులు. భయానికి ఆమె ఎప్పుడు భయపడింది గనుక! వెంటనే బయలుదేరింది. తల్లిని చూడ్డానికి హాస్పి టల్‌కి వెళ్లింది. అక్కడ మిలిటరీ పాలకుల రాక్షసత్వానికి బలైన బాధితులను, శవాలుగా పడి ఉన్న విద్యార్థులను చూసి కదిలిపోయింది. మహా నాయకుడు ఆంగ్‌సాన్ కుమార్తె సూచీ వచ్చిందని తెలిసి ఎక్కడెక్కడి నుంచో జనాలు రావడంతో రంగూన్ హాస్పిటల్ కాస్తా జనసముద్రం అయింది!
 
 ‘‘అమ్మా!... ఇక్కడి పరిస్థితులను చూస్తున్నావు కదా... నీ నాయకత్వం  ఈ దేశానికి అవసరం’’ అన్నారు సూచీని కలిసిన విద్యావేత్తలు. వెంటనే సరే అంది. అంతవరకూ సాధారణ గృహిణిగా ఉన్న ఆమె, ప్రజాస్వామిక ఉద్యమంలో బలమైన నాయకురాలిగా మారింది.
 ఇవన్నీ చూసి భయపడిపోయాడు మైఖేల్. తండ్రిని చంపినట్టే ఆమెనూ చంపేస్తారేమోననే దిగులు పట్టుకుంది అతడికి. అయినా భార్యకు అడ్డు చెప్ప లేదు. చెప్పడు కూడా. ఎందుకంటే, ఆమె ఆలోచనలను గౌరవిస్తాడు. ఆమె లక్ష్యాలకు అనుగుణంగా తాను జీవిస్తాడు. అంతగా తనను ప్రేమిస్తున్నాడు.
 
  అందుకే తన భయాన్ని తనలోనే అణచుకుని ఆమెకు తోడుగా నిలిచాడు. అయితే తర్వాత సూచీ హౌజ్ అరెస్ట్ కావడంతో ఒంటరివాడయ్యాడు. ఆమె జ్ఞాపకాల సుడిలో కొట్టుమిట్టాడాడు. ఆ జ్ఞాపకాలతో జీవిస్తూనే మరణించాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలతో సూచీ జీవిస్తున్నారు. లక్ష్యం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ఆమె, ఆమె కోసం తన సంతోషాన్ని వదులుకున్న ఆయన... ఇంతకన్నా గొప్ప ప్రేమ ఉంటుందా!                        
 - యాకూబ్ పాషా
 

మరిన్ని వార్తలు