వసూళ్లతో వావ్ అనిపించాయి!

20 Apr, 2014 01:28 IST|Sakshi
వసూళ్లతో వావ్ అనిపించాయి!

పంచామృతం: తుపానుతో పోల్చాలో, దబాయించి కురిసే జడివానగా అభివర్ణించాలో కానీ ఆ సినిమాలు విడుదల అయినప్పుడు థియేటర్ల బాక్సాఫీసుల్లో కాసుల కుంభవృష్టి కురిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నాయి. దశాబ్దాల హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలయ్యాయి. నిర్మాతలకు కలెక్షన్ల పంట పండించాయి. ప్రపంచ రికార్డులను సృష్టించాయి.  ఆ రికార్డుల పుటల్లోని తొలి ఐదు సినిమాలివి.
 
 స్టార్‌వార్స్-1(1999):  హాలీవుడ్‌లో స్థాయిని రెండు వేల కోట్ల రూపాయలకు చేర్చిన రెండో సినిమా ఇది. ఒక దశలో టైటానిక్ తర్వాతి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది. 47,45,44,677డాలర్ల వసూళ్లను సాధించిన ఈ సినిమా రేంజ్‌ను రూపాయల్లో చెప్పాలంటే రెండు వేల కోట్ల రూపాయలు.
 
 అవతార్(2009)
 సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో ‘ఎపిక్’ అనదగ్గ అవతార్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక  వసూళ్లను సాధించిన సినిమా. ఈ సినిమా వసూళ్ల మొత్తం మన రూపాయి ల్లో చెప్పాలంటే దాదాపు 4,500 కోట్లు. పాత రికార్డులను తుడిచిపెట్టేస్తూ ఇది ఈ మొత్తంతో కొత్త రికార్డును సృష్టించింది. దర్శకుడు జేమ్స్ కామెరున్. విశేషం ఏమిటంటే ఈ సినిమా కన్నా ముందు అత్యధిక స్థాయి వసూళ్లు చేసిన సినిమాల్లో తొలి స్థానంలో ఉన్న టైటానిక్‌ను కూడా కామెరూనే రూపొందించాడు.
 
 ది డార్క్‌నైట్ (2008)
 ఈ బ్రిటిష్-అమెరికన్ సూపర్‌హీరో సినిమాకు  53,31,60,671కోట్ల డాలర్లు కలెక్షన్లుగా వచ్చాయి. 2005లో విడుదల అయిన‘బ్యాట్‌మన్ బిగిన్స్’కు సీక్వెల్‌గా వచ్చింది ఈ సినిమా. దాదాపు మూడు వేల రెండువందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
 
 టైటానిక్ (1997): 1997 నాటికి ‘నభూతో నభవిష్యతి’ అనిపించిన సినిమా టైటానిక్. టైటానిక్ షిప్ ప్రమాదానికి కాల్పనికతను జోడించి జేమ్స్ కామెరూన్  రూపొందించిన  ఈ సినిమా 65,86,72,302 డాలర్ల సొమ్మును వసూలు చేసింది. లియొనార్డో డికాప్రియో, కేట్‌విన్‌సేట్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వసూళ్ల స్థాయి రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 4,000 కోట్లు.  
 
 ది అవేంజర్స్(2012)

 ఎన్నో యేళ్లుగా కొలువైన సినిమాల రికార్డులను తుడిచేస్తూ అత్యధిక స్థాయి వసూళ్లను సాధించిన వాటిల్లో మూడో స్థానంలో నిలిచిన సినిమా ‘ది అవేంజర్స్’.  ఇది వస్తూనే థియేటర్లను కళకలాడించింది. ఈ సినిమాకు దాదాపు 62,32,79,547డాలర్ల డబ్బు వచ్చింది. ఆ మొత్తాన్ని భారతీయ మారకంలో చెప్పాలంటే మూడువేల ఎనిమిదివందల కోట్ల రూపాయలు.

మరిన్ని వార్తలు