మా అమ్మ కాజల్

10 May, 2015 01:01 IST|Sakshi
తల్లి సుమన్ అగర్వాల్‌తో కాజల్...

మదర్స్ డే స్పెషల్
హిందీలో కాజల్ అంటే కాటుక... కళ్లని చల్లగా ఉంచే కాటుక. కనురెప్పలా కాపాడుకునే అమ్మలాంటి కాటుక.
నా స్నేహితురాలు, సలహాదారు,  మార్గదర్శకురాలు, నా నమ్మకం, నా ధైర్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే మా అమ్మ గురించి ఎంతైనా చెప్పొచ్చు. తనతో నా రహస్యాలు మొత్తం చెప్పుకునేంత చనువు ఉంది. మా అమ్మ ముందు నాకు ఏ దాపరికమూ లేదు.
మా చిన్నప్పుడు మా అమ్మ ఉద్యోగం చేసేది. అప్పుడు నాకేం అనిపించలేదు ఇప్పుడు ఆలోచిస్తే ఇంటినీ, ఉద్యోగాన్నీ ఎలా బ్యాలెన్స్ చేసిందా? అనిపిస్తోంది.

అప్పుడేమో మమ్మల్ని చదివించడానికి, మా ఆలనా పాలనా చూసుకోవడానికి తను ఒత్తిడికి గురయ్యేది. ఇప్పుడూ అంతే. నేను ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మే. ఆవిడ సహకారం లేకపోతే నేనీ స్థాయికి వచ్చేదాన్ని కాదు.
బాల్యంలో మా వేలు పట్టుకుని నడిపించిన మా అమ్మ, మేం పెద్దయ్యాక కూడా వదల్లేదు. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటాం. మాతో పాటు తనూ వస్తుంటుంది. మాకు అమ్మ చేతి వంట తినే అవకాశం చాలా తక్కువ. ఆ విషయం తనకెప్పటికీ కొరతగానే ఉంటుంది. అందుకే, వీలు కుదిరినప్పుడల్లా స్వయంగా వంట చేసి, తినిపిస్తుంటుంది.
మా అమ్మ అందరితో ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరి మనసూ నొప్పించదు. అదెలా? అని నేనే ఆశ్చర్యపోతుంటాను. మా అమ్మతో పరిచయం ఉన్నవాళ్లెవరూ తనని ఇష్టపడకుండా ఉండలేరు. అసలీ ప్రపంచంలో మా అమ్మలాంటి అమ్మ ఉంటుందా? అనే సందేహం నాకు లేకపోలేదు.
మా అమ్మ చాలా సున్నిత మనస్కురాలు. దానివల్ల జరగకూడదని ఏదైనా జరిగినప్పుడు.. అది చిన్నదైనా సరే చాలా ఉద్వేగపడిపోతుంటుంది. అందుకని మా అమ్మ మనసు కొంచెం కఠినంగా మారితే బాగుంటుందనిపిస్తుంటుంది. అంతకు మించి ఆమెలో నేనే మార్పూ కోరుకోవడంలేదు.
అమ్మ కోసం ఒక్క రోజేంటి? 365 రోజులూ కేటాయించవచ్చు. ‘మదర్స్ డే నాడు’ తనను సంతోషపెట్టేసి, మిగతా రోజుల్లో నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. బహుమతులుగా వస్తువులివ్వాలనుకోను. మా అమ్మ ప్రేమను వస్తువులతో వెలకట్టడం నాకు నచ్చదు.
భవిష్యత్తులో పెళ్లి చేసుకుని, నేను తల్లవుతా. అప్పుడు మా అమ్మలాంటి ‘అమ్మ’గా ఉంటా. పూర్తిగా మా అమ్మలా కాకపోయినా అందులో సగం ఉన్నా, నా పిల్లలు మంచి పౌరులవుతారని నా నమ్మకం.
మా అమ్మ తనకోసం షాపింగ్‌కి వెళుతుంది. కానీ, ఇంటికొచ్చేటప్పుడు మా కోసం ఏదైనా కొని తెస్తుంటుంది. తన గురించి దాదాపు మర్చిపోతుంది. ఒక తల్లి తన బిడ్డలను ఏ స్థాయిలో ప్రేమిస్తుందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు.
ఈ ‘మదర్స్ డే’కి నేను మలేసియాలో ఉంటాను. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళుతున్నా. నేనెక్కడికి వెళ్లినా మా అమ్మ దాదాపు నాతో పాటే ఉంటుంది. మదర్స్ డే కోసం నేనేదీ ప్లాన్ చేయలేదు. మా అమ్మ ఆనందం కోసం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. మా అమ్మ నా దగ్గర్నుంచీ ఏమీ ఆశించదు. వృత్తిపరంగా నా ఎదుగుదలను ఆశిస్తుంది. అలాగే, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అదే మంచి బహుమతిలా భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి.. ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్ ఇన్ ది వరల్డ్’ అంటే అతిశయోక్తి కాదు కదా.
  - డి.జి.భవాని, కవర్ ఫొటో: శివమల్లాల
 
 పేరు: కాజల్ అగర్వాల్
 తల్లిదండ్రులు: వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్
 చెల్లెలు: నిషా అగర్వాల్
 పుట్టింది: ముంబై
 చదువు: బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా
 నటి కాకముందు: మోడలింగ్
 తొలి చిత్రం(హిందీ): ‘క్యూం! హో గయా నా’ (చెల్లెలి పాత్ర)
 తొలి చిత్రం (తెలుగు): లక్ష్మీ కల్యాణం

మరిన్ని వార్తలు