గోపికనై నేను జలకములాడేను

8 Sep, 2019 11:59 IST|Sakshi

 పాటతత్త్వం

నా తమ్ముడు చిత్రంలోని ‘హే సుందరాకార హేబృంద సంచార/ఏ బండికొచ్చావురా/నేను నా మేను ఇస్తాను నీతోటి వస్తా ను ఛస్తాను నీ కోసమే’ అని సరదాగా సాగే ఈ పాటలో నేను, రాజబాబు నటించాం. ఈ పాటకు పెండ్యాల శాస్త్రీయ సంగీతం, పసుమర్తి కృష్ణమూర్తి శాస్త్రీయ నాట్యం కూర్చారు. నా నాలుగో ఏట నుంచే నాట్యం నేర్చుకోవడం వల్ల సెమీ క్లాసికల్‌ చేయడానికి ఇబ్బంది అనిపించలేదు. చాలా సులువుగా చేశాను. ఏ పాత్రనైనా చేస్తున్నంత సేపు పాత్రలో నిమగ్నమైపోతాను.

‘శ్రీకృష్ణుడి కోసం కల కంటే ఆయన ప్రత్యక్షమైనట్టు భావించే సన్నివేశం’ అని పాట సిట్యుయేషన్‌ చెప్పారు. చాలా సరదా సన్నివేశం. పాట షూటింగ్‌ అయిపోయాక అందరూ ఫక్కున నవ్వేశారు. నేను కూడా నవ్వాను. ‘నీ సొద విన్నాను పింఛము కొన్నాను/రిక్షాలో వచ్చాను దరిశనమిచ్చాను/కలలో కనిపించి పులకలు పెంచావురా/ఇంక పైని చాలజాల జాలి పూని ఏలుకోరా’ చరణంలో నేను రాజబాబు ఇద్దరం పోటీ పడి నాట్యం చేశాం.  ఆయనకి ఈ పాటంటే చాలా ఇష్టం. ఆయన చాలా సరదా మనిషి. అందరితోనూ స్నేహంగా మెలిగేవారు. ఆయన ఇంటి నుంచి షూటింగ్‌ స్పాట్‌కి మధ్యాహ్నం క్యారేజీ వచ్చేది. ఆయన అందరికీ రుచి చూపించేవారు. ఒకవేళ నేను రాలేకపోతే, నాకు గదికి పంపేవారు. 

రాజబాబుగారి భార్య రెండు చేతుల నిండుగా బంగారు గాజులు వేసుకునేవారు. ఆవిడ నాకు అలా గుర్తుండిపోయారు. మా అమ్మకి నేను ఒక్కర్తినే ఆడపిల్లను. ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయించేది. ఒక సంవత్సరం నడుముకి గొలుసు చేయించింది. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా నా నడుముకి గొలుసు తప్పనిసరి. ప్రసన్నరాణి అంటే ‘నడుముకి చెయిన్‌’ అని గుర్తింపు తెచ్చుకున్నాను.

‘ఇది యమునా నది మనకై గదిలో పడుతున్నది/గోపికనై నేను జలకములాడేను/ఇసుకతిన్నెలవిగో పొన్నమాను ఇదిగో/నీ చిలిపి గోపబాలుడనై దాగి చీర దోచుకుని పోయెదనిపుడే’ చరణం చాలా సరదాగా ఉంటుంది. ఈ పాట అంతా ఒకే గదిలో తీశారు. ఒక వాటర్‌ క్యాన్, బేసిన్‌ పెట్టి, క్యాన్‌లో నీళ్లు పడుతుంటే, అదే యమునానది అంటూ, ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ జలకాలాడుతున్నట్లు భావిస్తాం. గదిలో వస్తువులు చూడగానే నవ్వు ఆగలేదు. ఈ పాటలో నా డ్యాన్స్‌కి ఆయన కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. పక్కన ఉన్న స్టూడియోలలో వారు కూడా వచ్చి నన్ను ప్రశంసించారు. ఫస్ట్‌ టేక్‌లోనే ఓకే అయిపోయింది. రెండు రోజుల్లో షూటింగ్‌ పూర్తయిపోయింది. షూటింగ్‌ పూర్తవ్వగానే ఇంటికి వెళ్లిపోయేదాన్ని. ఈ పాట నాకు మంచి గుర్తింపు తెచ్చింది. నాగేశ్వరరావుగారు నన్ను గట్టి పిండం అన్నారు.
చిత్రం: నా తమ్ముడు
రచన: అప్పలాచార్య
గానం: బి. వసంత, ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: పెండ్యాల

సంభాషణ: వైజయంతి పురాణపండ


 

మరిన్ని వార్తలు