వారెవ్వా... వాయనాడ్

10 Jul, 2016 00:41 IST|Sakshi
వారెవ్వా... వాయనాడ్

టూర్‌దర్శన్
ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రానికి ‘దేవుడి సొంత రాజ్యం’ అనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజ్యం అన్నాక రాజధాని ఉండాలి కదా! రాజకీయంగా చెప్పుకుంటే కేరళకు తిరువనంతపురమే రాజధాని కావచ్చు కాని, ‘దేవుని సొంత రాజ్యానికి’ రాజధాని ఏది? అంటే వాయనాడ్ పేరునే చెప్పుకోవాలి. పడమటి కనుమల్లో ఉన్న వాయనాడ్ జిల్లాలో ప్రకృతి అందాలన్నీ రాశి పోసినట్లుగా కనువిందు చేస్తాయి. వాయనాడ్ అడవుల్లో సంచరించే అరుదైన వన్యప్రాణులు, విహంగాలు సరేసరి! వీటన్నింటినీ ఒక్కసారి చూస్తే చాలు... ‘వారెవ్వా... వాయనాడ్’ అనక తప్పదు.

 
ఏం చూడాలి?

వాయనాడ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొత్త రాతియుగం నుంచే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు తమ వాణిజ్య అవసరాల కోసం వాయనాడ్ కొండలపై రోడ్లు వేయడంతో ఇక్కడకు పర్యాటకుల రాకపోకలకు మార్గం సుగమమైంది.

* పడమటి కనుమల్లో అడుగడుగునా కనిపించే జలపాతాలు వాయనాడ్‌లోనూ కనిపిస్తాయి. సూచిపరా, మీన్‌ముట్టి, కాంతన్‌పరా, చెతాలయం వంటి జలపాతాల సొగసులను చూసి తీరాల్సిందే. వానాకాలంలో ఇవి మరింత ఉధృతంగా ఉరకలేస్తూ సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇక పాపనాశిని, పంచతీర్థ వంటి పుష్కరిణులు, సరోవరాలు కూడా ఇక్కడ చూడాల్సినవే.

* వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్, నీలిమల వ్యూపాయింట్ నుంచి చూస్తే కొండలు, లోయలు, పచ్చని అడవుల అందాలు కనివిందు చేస్తాయి. ఈ ప్రదేశాల నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు.

* వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వనవిహారం మరపురాని అనుభూతినిస్తుంది. ఈ అభయారణ్యంలో ఎక్కడ చూసినా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, కుందేళ్లు, పులులు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కేరళ అటవీ శాఖ ఏనుగులపై సవారీ అవకాశం కూడా కల్పిస్తోంది.
 
* బ్రహ్మగిరి కొండలపై కీకారణ్యంలో ఉన్న పక్షిపాతాళం పక్షుల అభయారణ్యంలో పక్షులను తిలకించడం వింత అనుభూతినిస్తుంది. నెమళ్లు, రకరకాల కొంగలు, మైనాలు, పిచ్చుకలు వంటి పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి.
 
* వాయనాడ్ జిల్లాలో పురాతనమైన ఎడక్కల్ గుహలలోని కుడ్యచిత్రాలు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాల నాటివని చెబుతారు. ఈ గుహలను తిలకించడంతో పాటు చీన్‌గిరిమల, చెంబ్రా వంటి శిఖరాలను అధిరోహించేందుకు పర్వతారోహకులు ఉబలాటపడతారు.
 
* తిరునెల్లిలోని ప్రాచీన విష్ణుభగవానుడి ఆలయం, కాల్పెట్టలోని వారంబెట్ట మసీదు వంటి పురాతన కట్టడాలు కూడా ఇక్కడ చూసి తీరాల్సినవే.
 
ఏం చేయాలి?
* పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారికి ఇక్కడి కొండలు, గుట్టలు చాలా అనువుగా ఉంటాయి. కొండలపెకైక్కి దిగువ కనిపించే లోయలను, అడవులను తిలకించడం మరపురాని అనుభూతినిస్తుంది.
 
* జలపాతాల ఒడ్డున పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఉధృతి తక్కువగా ఉన్న జలపాతాల దిగువన జలకాలాటల్లో సేదదీరవచ్చు.
 
* వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఏనుగులపై ఊరేగవచ్చు. పక్షిపాతాళంలోని పక్షుల అభయారణ్యంలో పక్షుల కిలకిలలను ఆలకిస్తూ తన్మయత్వం చెందవచ్చు. పక్షిపాతాళంలోని పురాతన గుహలను కూడా సందర్శించవచ్చు.
 
* వాహనాల రొదలేని వాయనాడ్ రోడ్లపై వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేయవచ్చు.
 
ఏం కొనాలి?
* వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల చిన్న చిన్న దుకాణాలతో పాటు అధునాతనమైన షాపింగ్ మాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొబ్బరిచిప్పలతో స్థానిక కళాకారులు రూపొందించిన సంప్రదాయ కళాకృతులు ఇక్కడి దుకాణాల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇవి సరసమైన ధరల్లోనే దొరుకుతాయి.

* ఏనుగు దంతాలు, పేము, వెదురు, కలపతో తయారు చేసిన కళాకృతులు, చైనా సిరామిక్ వస్తువులు కూడా ఇక్కడి దుకాణాల్లో విరివిగా దొరుకుతాయి.
 
* వాయనాడ్ కాఫీ గింజలు, కాఫీ పొడి, మున్నార్ తేయాకుతో పాటు ఇక్కడి అడవుల్లో విరివిగా పండే యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు వంటివి తక్కువ ధరల్లోనే దొరుకుతాయి.
 
* స్వచ్ఛమైన తేనె, కరక్కాయలు, వనమూలికలు, ఇక్కడి అడవుల్లో పండే పండ్లు చౌకగా దొరుకుతాయి.
 
ఎలా చేరుకోవాలి?
* దూరప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు.
* వాయనాడ్ జిల్లా కేంద్రం కాల్పెట్టకు సమీపంలోని రైల్వేస్టేషన్ కూడా కోజికోడ్‌లోనే ఉంది. కోజికోడ్ నుంచి 72 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి కాల్పెట్ట చేరుకోవాల్సి ఉంటుంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్‌ల మీదుగా బస్సులు లేదా ట్యాక్సీల్లో వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు.

మరిన్ని వార్తలు