ఇంతకీ, ఏమాశిస్తున్నామ్?

11 May, 2014 04:06 IST|Sakshi
ఇంతకీ, ఏమాశిస్తున్నామ్?

పద్యానవనం

 విద్యనిగూఢ గుప్తమగు విత్తము, రూపము మానవాళికిన్
 విద్యయశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
 విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
 విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే!

 
 విద్య... ఇది విచిత్రమైన, విస్తృతార్థం కలిగిన పదమనిపిస్తుంది. ఇంతకీ విద్య అంటే ఏంటి? ‘విద్య అంటే తెలియదా! అవ్వ!! విద్య అంటే... చదువు’ అంటారు. చదువు అంటే ఏంటి? మళ్లీ ప్రశ్న. జ్ఞానాన్ని చదువంటారా? అదీ సంపూర్ణార్థం కాదేమో? చదువుకు ఎందరెందరో, ఎన్నెన్నో నిర్వచనాలిచ్చారు. ఒక పదబంధంలో చెప్పజాలనంత, ఒక వాక్యంలో బంధించజాలనంత విస్తృతార్థం ఉంది కనుకే సర్వకాలాల్లోనూ ఇదెంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదివావ్ ఏం లాభం?’’ అని పెదవి విరిచే సందర్భాలు, ‘‘చదవక ముందు కాకరకాయ, చదివాక గీకరకాయ’’ అనే దెప్పిపొడుపులు వింటూనే ఉంటాం. కానీ, ఇవి అరుదయిన విలోమ సందర్భాలు మాత్రమే! అత్యధిక సందర్భాల్లో విద్య మనిషికి ఒక దోహదకారిని గానే ఉంటూ వస్తోంది.
 
 విద్య అంటే ఏంటో సంపూర్ణంగా నిర్వచించలేనపుడు, ఒకింత తెలివిగా కన్యాశుల్కంలో గిరీషం చెప్పినట్టు, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్’ అని సాపేక్షంగా చెప్పాలి. మనకున్న పాటి తెలివితేటలు ఎదుటివాడికి లేవనిపించినపుడు, ‘విద్య రాని వాడు వింత పశువు’ అని ఓ సామెత వదలాలి. లాటిన్‌లో ‘ఎడ్యూస్’ అంటే మనిషి తనలోకి తాను చూసుకొని తనను తాను సమగ్రంగా అర్థం చేసుకోవడం. దాన్నుంచి పుట్టిందే ‘ఎడ్యుకేషన్’ అంటారు. ‘మనిషిలో ఉండే దైవత్వపు బహుముఖీన ఆవిష్కరణే విద్య’ అని వివేకానంద స్వామి వివరించారు. ఆధునికుల నిర్వచనాలకు ఏ మాత్రం తీసిపోని, సమగ్రమైన, సముచితమైన నిర్వచనాలు, వివరణలు ఎంతో పూర్వకాలం నుంచే భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. మచ్ఛుకు ఈ పద్యమే చూడండి!
 
 భర్తృహరి సంస్కృత సుభాషితాలను ఏనుగులక్ష్మణ కవి తెలుగులోకి అనువదించినపుడు చెప్పారీ పద్యాన్ని. పండంటి విద్యకు పది లక్షణాలన్నట్టు ముఖ్యమైన విశేషాలను చెప్పాడు. విద్య రహస్యంగా దాటిపెట్టిన నిధి అంటాడు. అప్పుడున్న పరిస్థితుల్లో, నాటి స్త్రీ-పురుష సంబంధాలు, హెచ్చు-తగ్గు భావనల వల్లనేమో విద్య పురుషులకు సౌందర్యం వంటిదంటాడు. ఏ రంగంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోని ఈ రోజుల్లో ఆ పదాన్ని పురుషులకే పరిమితం చేయకుండా, స్వల్పంగా మార్చి, ‘పూరుషాళికిన్’ అనే చోట ‘మానవాళికిన్’ అనే పాఠబేధంతో చెప్పుకుంటే నష్టం లేదనిపిస్తుంది. విద్య వల్ల కీర్తీ, సౌఖ్యం లభిస్తాయంటాడు. విద్య గురుడని కూడా చెబుతాడు. ‘గు’ అంటే చీకటి, ‘రు’అంటే తొలగించేవాడు, అంటే అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానమనే వెలుగువైపు మనిషిని నడిపించడంలో విద్య కీలక భూమిక నిర్వహిస్తుంది కనుక దీన్ని నేరుగా గురువు అవవచ్చు. అప్పటివరకు పరిచయం లేని పరాయిదేశాల్లో కూడా పనికానిచ్చుకోవాలన్నా, రాణించాలన్నా.... కాస్త తెలివి తేటలు, కొంచెం చదువు ఉండాల్సిందే అనటంలో ఏ సందేహమూ లేదు.
 
 ఈ రోజున మన భారతీయ యువత ప్రపంచం నలుమూలలా విస్తరించి మంచి మంచి హోదాల్లో ఉన్నారంటే, అందుకు వారి కఠోర శ్రమ, విద్యావికాసం, తెలివితేటలే కారణం అన్నది సుస్పష్టం. విద్యతో పోల్చదగిన ధనమేదీ ఈ భూమ్మీద లేదంటారు విజ్ఞులు, ఆ మాటకూడా చెప్పారిక్కడ. నాటి రాజులే కాదు, నేటి పాలకులు కూడా విద్యాబుద్ధులు కలిగిన వారిని తప్పనిసరిగా ఆదరించాల్సి ఉంటుంది. అందుకే, మారుతున్న ప్రస్తుత సమాజంలోనూ విద్య లేని వాడినసలు మనిషి గానే పరిగణించరు. ‘‘ఎన్ని చదువులు చదివి, ఎంత నేర్చినగాని హీనుడవగుణంబు మానలేదు’ అన్న శతకకారుని మాటల్ని బట్టి, అప్పటివరకున్న అవగుణాలు చదువు వల్ల తొలగిపోవాల్సిందే(హీనుని విషయంలో తప్ప)అని కూడా మనం గ్రహించాలి.
 
 ‘‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదవునిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్’’ అని మారద వెంకయ్య కవి భాస్కర శతకంలో చెప్పిన మాట అక్షర సత్యం. చదవుకు ఓ గొప్ప నిర్వచనం అయిదారు వందల ఏళ్ల కింద శ్రీమద్భాగవతంలో పొతన చెప్పాడు. రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని గురువుల వద్ద విద్యాభ్యాసానికి పంపుతూ ఒక మాటంటాడు. ‘‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గల్గున్....’’ ఎంత గొప్ప మాట! చదువని వాడు అజ్ఞానిగా నలుగురు దృష్టిలో పడిపోతాడనే కాకుండా చదువు యొక్క అంతిమ లక్ష్యమేమిటో కూడా చెప్పాడు పోతన. చదువు కేవలం ఉద్యోగం కోసమో, ఉపాధికోసమో, మరో సంపాదన కోసమో కాదట! ‘‘చదివిన సత్, అసద్ వివేక చతురత కల్గున్....’’ అంటే,  ఏది మంచి-ఏది చెడు తేల్చుకోగలిగిన చాతుర్యం మనిషికి చదువు వల్ల అబ్బుతుందట! భేష్!! విద్య ఉద్దేశం, అంతిమ లక్ష్యం కూడా ఇదే!!
  - దిలీప్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు