అష్టముఖ పశుపతినాథుడు

27 Aug, 2016 23:36 IST|Sakshi
అష్టముఖ పశుపతినాథుడు

పశుపతినాథుడి త్రినేత్రం నుంచి పుట్టిన ఆయుధం పాశుపతాశ్రం. దీనిని మించిన ఆయుధం లేదని శివపురాణం చెబుతుంది. త్రిపుర సంహారంలో కాళికాదేవికి, ద్వాపరయుగంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చినవాడు పశుపతినాథుడు.
 
పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్‌లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నా నది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు గలవాడుగా పేరొందాడు. శివ్నా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్‌సౌర్ పట్టణంలో ఉంది. ఈ నదీ తీరంలో ప్రపంచంలో మరెక్కడా లేని మూర్తిగా అష్ట ముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు. శివ్నా నది గలగలలతో, పశుపతినాథుడిని కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామాగా నిలుస్తోంది.
 
 
మంద్‌సౌర్ పట్టణంలోని శివ్నా నదికి 90 అడుగుల ఎత్తులో 30 అడుగుల విస్తీర్ణంలో 101 అడుగుల పొడవుతో పశుపతినాథ్ దేవాలయం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంది. దేవాలయం పైన 100 కిలోల స్వర్ణంతో చేసిన గోపుర భాగం సూర్యకిరణాల కాంతిలో మెరుస్తూ భక్తులను అలౌకికమైన ఆనందానికి చేరువచేస్తోంది. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మహాద్వారాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భక్తులు అంతా పశ్చిమ మహాద్వారం గుండానే లోపలికి ప్రవేశిస్తారు. ముందుగా అతి పెద్ద నంది దర్శనమిస్తాడు. నంది ఆశీస్సులు తీసుకొని గర్భాలయంలో అడుగుపెట్టగానే వర్ణించనలవి కానంత అద్భుతంగా స్వామి మూర్తి దర్శనమిస్తుంది. 3.5 మీటర్ల ఎత్తులో శివలింగం పై భాగంలో 4 ముఖాలు, కింది భాగంలో మరో 4 ముఖాలు మొత్తం ఎనిమిది ముఖాలతో ఉన్న స్వామి మూర్తి ప్రకాశవంతమైన నల్లని అగ్నిశిల. పై 4 ముఖాలు స్పషం్టగా, కింది ముఖాలు అస్పష్టంగా కనిపిస్తాయి. మానవజీవితంలోని 4 దశలకు ఈ ముఖాలను సూచికగా చూపుతారు. రుద్ర మూర్తిగా దర్శనమిచ్చే ముఖం మాత్రం ద్వారానికి ఎదురుగా ఉంటుంది. తలకట్టును పాములతో ముడివేసినట్టుగా, మూడో కంటితో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. నాలుగు తలలపైన ఉండే లింగం మీద ‘ఓంకారం’ దర్శనమిస్తుంది.  భవ, పశుపతి, మహదేవ, ఈశాన, రుద్ర, వర్వ, ఉగ్ర, అశని రూపాల ముఖాలతో స్వామి భక్తులచే పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక ఏకాదశి పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సమయాలలో భక్తులే స్వామికి నైవేద్యాలు సమర్పిస్తారు.
 
స్వామి బరువును తూచతరమా!
సృష్టికి ఆద్యుడైన స్వామి ఎత్తు, బరువు ఎంతో చెప్పడం అసంభవమని శివపురాణం స్పష్టం చేస్తోంది. అయితే, ఇక్కడ కొలువున్న పశుపతినాథుడి మూర్తి బరువు 4,665 కిలోలని, స్వర్ణయుగంగా భాసిల్లే గుప్తుల కాలంలో స్వామి ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది.

నాలుగు వేల సంవత్సరాలు
అష్టముఖి పశుపతినాథ్ మహాదేవుని రూపాల గురించి వర్ణించడం ఎంత దుర్లభమో ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడం అసంభమని శివపురాణం చెబుతుంది. పశువులను సంరక్షించేవాడు పశుపతి అని,. సింధూ నాగరికతలో పశుపోషణ ప్రధానంగా ఉండేది కాబట్టి ఆ కాలంలోనే ఈ స్వామి ఆవిర్భవించి ఉంటాడనే కథనాలూ ఉన్నాయి. ఆ విధంగా ఆధారాలను బట్టి చూస్తే 46 వేల ఏళ్ల క్రిందటే స్వామి ఇక్కడ వెలశాడనేది అవగతం అవుతుంది. అగ్నిశిల కావడం వల్లే నేటికీ ఈ రూపం చెక్కుచెదరలేదని తెలుస్తోంది.
 
స్వయంభువు
అష్టదిక్కులను సంరక్షించే అధినాయకుడిగా వెలుగొందే స్వామి ఇక్కడ స్వయంభువు. 500 ఏళ్ల కిందట శివ్నా నది ఒడ్డున గల పెద్ద బండరాయి వద్దకు ఒక రజకుడు రోజూ బట్టలు ఉతుక్కోవడానికి వెళుతుండేవాడట. ఒకరోజు అతనికి శివుడు కలలో దర్శనమిచ్చి ఆ చోట బట్టలు ఉతకడం మానేసి, అక్కడ తనను వెలికి తీసి, గుడి కట్టమని, ఈ మూర్తిని దర్శించుకున్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేశాడట. మరునాడు ఆ రజకుడు తన సహచరులతో వెళ్లి, అక్కడ తవ్వి చూడగా స్వామి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట.

వెలుగు చూసిన విధం
వేల ఏళ్లక్రితమే ఇక్కడ వెలిసినా 1940 వేసవి వరకు శివ్నా నది నీటిలో మునిగే ఉన్నాడు పశుపతినాథుడు. నది నీటి మట్టం తగ్గడంతో భక్తులకు పూర్తి రూపంతో 1961లో దర్శనమిచ్చాడు. ఆ మరుసటి యేడు అత్యంత ఘనంగా స్వామి ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తరువాత పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. ఇక్కడ స్వామిని అందరూ చేత్తో స్పర్శించవచ్చు. అభిషేకాలు చేయవచ్చు. మహాశివరాత్రికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు జరుపుతారు.   

జలమే అభిషేకించే పుణ్యస్థలి
శివుడు అభిషేకప్రియుడనే విషయం తెలిసిందే! అయితే, జలమే జలాభిషేకం చేయడం ఇక్కడి అరుదైన ఘటన. ప్రతి వర్షాకాలం శివ్నా నది ప్రవాహం పెరుగుతుంది. 90 అడుగులకు ఉప్పొంగిన నది శివలింగం అగ్రభాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని దూరం నుంచే దర్శించే వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యానికి పులకించిపోతుంటారు.   - చిలుకమర్రి నిర్మలారెడ్డి
 
 ప్రత్యేక ప్యాకేజీ
 మధ్యప్రదేశ్ పర్యాటకశాఖ పశుపతినాథ్, మహాకాళేశ్వర్.. ఇతర ఆలయాల సందర్శ నకు6 రోజుల ప్యాకేజీని అందిస్తోంది.  
 సోమవారం: హైదరాబాద్ - అజ్మీర్ (ట్రెయిన్) ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు స్టార్ట్.
మంగళవారం: మంద్‌సౌర్ రైల్వేస్టేషన్‌కు 21:51 గంటలకు చేరుతుంది. స్టేషన్ నుంచి ట్యాక్సీ, హోటెల్‌లో బస, భోజన వసతి.
బుధవారం: ఉదయం పశుపతినాథ్ ఆలయ సందర్శనం. ఉజ్జయిని వయా రత్నలమ్. ఇక్కడి విరూపాక్ష, బైద్యనాథ్ మహాదేవ్‌ల దర్శనం.
గురువారం: ఉదయం మహాకాళేశ్వర్ భస్మహారతి, జ్యోతిర్లంగ, హరసిద్ధి మాత శక్తిపీఠం, గడకాళిక, కాలభెరవ్, మంగళనాథ్ దేవాలయాల సందర్శన.
శుక్రవారం: ఉదయం ఓంకారేశ్వర్ దర్శ నం, మహేశ్వర్ కోట, సాయంకాలం ఓంకార మాంధాత, అమలేశ్వర్ జ్యోతిర్లింగం, నర్మదా నది హారతి దర్శనం.
శనివారం: ఉదయం దేవాలయాల సందర్శన. అల్పాహారం. 11 గంటలకు ఖండ్వా రైలేస్టేషన్ నుంచి హైదరాబాద్‌కు అజ్మీర్ ఎక్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం. ఈ మొత్తం సందర్శన ప్యాకేజీ ధర ఒకరికి: రూ. 8200/- (మినిమమ్ 6 పర్సన్స్) అన్ని చోట్ల బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, బస.
 అన్ని చోట్ల లగ్జరీ వసతి సదుపాయాలున్నాయి.  మరిన్ని వివరాలకు: మధ్యప్రదేశ్ టూరిజమ్, టూరిజమ్ ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్
 ఫోన్: 040-40034319, 9866069000

 

మరిన్ని వార్తలు