పద్యానవనం: సమయస్ఫూర్తితోనే కవికి కీర్తి!

20 Apr, 2014 03:12 IST|Sakshi
పద్యానవనం: సమయస్ఫూర్తితోనే కవికి కీర్తి!

రంజన జెడి పాండవులరి
 భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
 సంజాతమేమి చెప్పుదు
 కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్!

 
 ఏనుగుల సమూహము దోమ కుత్తకలో జొచ్చింది! అన్న అసాధారణ విషయాన్ని, ‘‘కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చెన్’’ అనే సమస్యాపూరణంగా ఇచ్చారు ప్రాజ్ఞులు సభలో.  దానికి, సరసకవి తెనాలి రామకృష్ణుడు ఏ మాత్రం తడుముకోకుండా, సాహితీ సమరాంగన సార్వభౌముడైన కృష్ణదేవరాయల సమక్షంలో పై విధంగా పూరించాడు.
 మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత బాగోలేక సాదాసీదా విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు. విధి ఎంత బలీయమైనదో చెప్పజాలమంటూ, ఏనుగుల సమూహం దోమ గొంతుకలో జొచ్చిందనే పోలికచెప్పడమన్నమాట! అవధాన ప్రక్రియల్లో తరచూ జరిగేదే కదా! ఇందులో సరసమేముంది? విశేషమేముంది? అనిపించవచ్చు. కానీ, విషయం ఇది మాత్రమే కాదు. తన సరస-సమర్థ హాస్య, సాహితీ ప్రతిభతో ప్రతిసారీ రాయలవారి వద్ద మార్కులు కొట్టేసే రామకృష్ణ కవిని ఎలాగైనా దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల ఆటలు సాగకపోవడం ఇందులో విశేషం.
 
 విచిత్రమైన సమస్యనిచ్చి, సమస్యాపూరణం చేయాల్సిందిగా అంతఃపురంలో సేవకుడిగా ఉండే ఒక పరిచారకుడితో రామకృష్ణ కవిని అడిగిస్తారు అతనంటే ఈర్ష్య కలిగిన వారు. ఏం చెబుతాడో చూద్దామన్నది ఉత్సుకత. తాము తెరవెనుక ఉండి గోప్యంగా ఇదంతా నడిపిస్తారు. అడిగేవాడిని బట్టి రామకృష్ణుడు ఎలాగూ పెడార్థమొచ్చే పూరణమే చేస్తాడు, ఒకడుగు ముందుకేసి బూతులు మాట్లాడినా మాట్లాడొచ్చు! అప్పుడు సభలో రాజుగారి ముందు ఇదే సమస్యనిచ్చి పూరించమంటూ రామకృష్ణ కవిని ఇబ్బందుల్లో పెట్టాలన్నది వారి ఎత్తుగడ. అనుకున్నట్టుగానే వారి అంచనా కొంతమేర నిజమైంది. సహజంగానే రామకృష్ణకవి విపరీతంగా స్పందించాడు. ‘అయ్యవారూ, ఇదుగో ఈ సమస్యను మీరు పూరించగలరా!’ అని, తెలిసీ తెలియక సేవకుడడిగినపుడు, ‘ఆ... దానికేం భాగ్యం’ అంటూ, ‘‘గంజాయి తాగి, తురకల సంజాతము తోడ కల్లు చవిగొన్నావా? లంజల కొడుకా ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుక జొచ్చెన్?’ అని తిడుతూ  కందపద్యంతో సమస్యా పూరణం చేశారు రామకృష్ణుడు. నాటి పదిహేనో శతాబ్ద కాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణాది వైపు విస్తరిస్తున్న బహమనీ సుల్తానుల హయాంలో ఆ తురుష్కుల సేవకులు, పరివారం గంజాయితో పాటు కల్లును మత్తుపానీయంగా సేవించేవారు. వారితో కూడి తాగి ఉన్నావా? అని తిడుతూ, ఎక్కడరా! ఎక్కడ, ఏనుగుల సమూహమెక్కడైనా దోమ కుత్తుకలో జొరబడగలదా? ఎక్కడ చెప్పు! అన్న అర్థం వచ్చేలా మందలిస్తూ సమస్యా పూరణం చేస్తాడు. పాపం, దానర్థం తెలియని సేవకుడు యధాతథంగా తీసుకువెళ్లి, వ్యూహకర్తలకు అప్పజెప్పాడు. ‘ఆహా! అనుకున్నంతా అయింది, మన రొట్టె విరిగి నేతిలో పడింది, ఇక ఇదేదీ జరుగనట్టు గుంభనంగా ఉండి, నిండు సభలో రాజుగారి ముందు రామకృష్ణుడికి ఇదే సమస్యనిస్తే... అయ్యో ఎంత పనిచేశానని ఆయన నాలుక్కరచుకోవడం ఖాయమ’ని సంబరపడ్డారు.
 
 తర్వాతి రోజు ఏమీ తెలియనట్టు సభలో ఓ సందర్భం సృష్టించి, ‘ఇదుగో ఈ సమస్యను రామకృష్ణుడైతే ఎలా పూరిస్తాడో అడగండి మహారాజా!’ అని, అదే సమస్యను సభ ముందుంచారు. నిన్నటి సంఘటనను గుర్తుకు తెచ్చుకొని, క్షణాల్లో విషయం గ్రహించిన తెనాలి రామకృష్ణుడు అప్పటికప్పుడు ఆశువుగా పైన పేర్కొన్న స్కీమ్-2 పద్యం సృష్టించారు. ఆయన ప్రతిభకు అబ్బురపడి, అభినందించారట కృష్ణదేవరాయలు. ఎప్పటిలాగే ప్రశంసలు తెనాలి రామకృష్ణుడికి, భంగపాటు ప్రత్యర్థులకు. అదీ సమయస్పూర్తి.
 - దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు