నిను చూసిన ఆనందంలో..

13 Oct, 2019 08:47 IST|Sakshi

‘అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెల్సా. ఇట్స్‌ ఏ క్రైం’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్‌’లో ప్రియాంక మోహన్‌ను చూసి మెలికలు తిరిగిపోతూ ‘నిను చూసే ఆనందంలో  కనుపాపే కడలై పొంగినది’ అని తీయగా పాడుకున్నాడు నాని. తొలి సినిమాతోనే ‘క్యూట్‌ గర్ల్‌’  ‘హోమ్లీ గర్ల్‌’గా  పేరు తెచ్చుకున్న  ప్రియాంక మోహన్‌ తాజాగా శర్వానంద్‌ సరసన ‘శ్రీకారం’లో నటిస్తోంది. ఆమె అంతరంగాలు....

నాటకం
బెంగళూరులో చదువుకున్నాను. అమ్మ కన్నడిగ, నాన్న తమిళియన్‌. రెండు భాషలూ వచ్చు. హైదరాబాద్‌లో మా బంధువులు ఉంటారు. అప్పుడప్పుడూ వచ్చిపోవడం వల్ల కాస్తో కూస్తో తెలుగు కూడా వచ్చు. మా కుటుంబం, బం«ధువుల్లో సినిమా నేపథ్యం ఉన్న వారు లేరు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు అంటే ఇష్టం. ఎన్నో నాటకాల్లో నటించాను. పేరెంట్స్‌ అభ్యంతర పెట్టేవారు కాదు.

సంతోషం
సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ ఆనుకోలేదు. సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, ఆ తరువాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది, ‘సినిమాల్లో మాత్రం ఎందుకు నటించకూడదు’ అనుకున్నాను. నా ఫోటోలు చూసి డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ పిలిపించారు. సెలక్ట్‌ అవుతానా? లేదా? అనేది వేరే విషయం. ఆయన నుంచి పిలుపు రావడమే గొప్పగా భావించాను. విక్రమ్‌ కుమార్‌ సినిమాలు నాకు ఎంతో నచ్చుతాయి. పీసీ శ్రీరామ్‌ ఆఫీసులో ఫోటోషూట్‌ జరిగింది. ఆయన పచ్చజెండా ఊపడంతో ‘గ్యాంగ్‌ లీడర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ‘అచ్చం తెలుగు అమ్మాయిలాగే ఉన్నావు’ అని అంటుంటారు చాలామంది.

ధైర్యం
మొదటి రోజు షూటింగ్‌లో లక్ష్మి, శరణ్యలాంటి సీనియర్‌ నటీమణులను చూసి భయమేసింది. అంత పెద్ద నటీమణులను లైవ్‌గా చూడడంతో టెన్షన్‌ పడ్డాను. వీళ్లతో కలిసి నేను నటించగలనా? అనుకున్నాను. ఆ టెన్షన్‌తోనే...‘సర్, మీరు నన్ను ఎంపిక చేసుకోవడం కరెక్టేనా?’ అని విక్రమ్‌ కుమార్‌ని అడిగాను. ‘సరిౖయెన నిర్ణయమే తీసుకున్నాను. నువ్వు చక్కగా నటించగలవు!’ అని ధైర్యం  చెప్పారు ఆయన. ఆ తరువాత ‘నేను చెప్పానుగా నువ్వు బాగా నటిస్తావని’ అంటూ మెచ్చుకున్నారు కూడా. ఈ సినిమా ద్వారా సీనియర్‌ నటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. కెరీర్‌ మొదట్లో కనిపించే అంకితభావం, ఉత్సాహం ఇప్పటికీ వారిలో కనిపిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే సెట్‌లో ప్రతిరోజూ ఒక కొత్త పాఠం నేర్చుకోవచ్చు. ఒక్క భాషకే పరిమితం కాకుండా రకరకాల భాషల్లో నటించాలని ఉంది. 

మరిన్ని వార్తలు