జాతీయాలు

10 Sep, 2016 22:04 IST|Sakshi

ఈగకు పోక పెట్టినట్లు!
అన్ని పనులూ అందరూ చేయలేరు.  ఒక్కో పనిలో ఒకరు నిష్ణాతులై ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే...పని బాధ్యతలు అప్పగించే సమయంలో వారి సమర్థతను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే... పనిలో చాలా తేడా వస్తుంది.
 అలాగే ఇష్టాల్లో కూడా ఒకరికి ఒక రకం ఇష్టాలు ఉంటే, మరొకరికి మరోరకం ఇష్టాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే మాటే... ‘ఈగకు పోక పెట్టినట్లు’
 ఈగకు బెల్లం అంటే ఇష్టం. ఇంకా రకరకాల మిఠాయిలు అంటే ఇష్టం.
 మరి ఈగకు మిఠాయి కాకుండా పోక పెడితే?!
 హాస్యాస్పదంగా ఉంటుంది కదా!
 
కందాల రాజు
వెనకటికి జమీందారుల ఇండ్లల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కోసం, అతిథుల కోసం భోజనశాల ఉండేది. బయటి నుంచి వచ్చిన వారు అందులోకి వెళ్లి భోజనం చేయవచ్చు. ఎవరి అనుమతీ అక్కర్లేదు. ‘మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని అడిగేవారు ఉండరు.
 ఈ భోజనశాలలో పెట్టే భోజనానికి కందా అని పేరు.
 ఈ భోజనశాలలో తిని వెళ్లేవాళ్లను ‘కందాల రాజు’ అని వ్యంగ్యంగా అనేవాళ్లు.
 పెద్ద మనిషి హోదాలో కనిపిస్తూ తేరగా ఎక్కడ భోజనం దొరికినా తినేవాళ్లను కందాల రాజు అంటారు.
 ‘ఆయన సంగతి నాకు తెలియదా ఏమిటి? కందాల రాజు. జేబు నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు’
 ‘మా ఇంటికొచ్చే కందాల రాజుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది’ ఇలా వివిధ సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
 
కాకః కాకః పికః పికః
ఒకరిలో ఉన్న సమర్థత, ప్రతిభ ఇతరులలో ఉండకపోవచ్చు.
 లేదు కదా... అని ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు.
 అనుకరించాలని ప్రయత్నించే వాళ్లు అపహాస్యం పాలు కావచ్చు.
 వెనకటికి ఒక కాకి కోకిలను అనుకరించబోయి నవ్వులపాలైందట. తమ సహజత్వాన్ని మరచి గొప్పల కోసం, పేరు ప్రతిష్ఠల కోసం ఇతరులను అనుకరించేవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఉపయోగించే జాతీయం ఇది.
 ఉదా: ఎవరి స్వభావానికి తగ్గట్టు వారు ఉంటే మంచిది. లేకుంటే అభాసుపాలవుతాం. కాకః కాకః పికః పిక: అనే సత్యాన్ని  మరచిపోవద్దు.
 
గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు!

అనుకున్నది ఒకటి అయినదొకటి అయినప్పుడు, విషయాలు తారుమారైనప్పుడు, ఊహించని చిత్రాలు జరిగినప్పుడు... ఉపయోగించే మాట ఇది.
 నీళ్లలో ఇనుపగుండ్లు మునగడం...
 బెండ్లు తేలడం సాధారణం.
 అలా కాకుండా... బెండ్లు మునిగి, గుండ్లు తేలితే?
 అది నమ్మశక్యం కాని విషయం.
 అసాధ్యం అనుకున్న విషయం సాధ్యం అయినప్పుడు, ఊహించిన విధంగా పరిస్థితి తారుమారైన సందర్భాల్లో ఉపయోగించే జాతీయం ఇది.
 
ఉదా:
‘అందరూ అప్పారావే గెలుస్తారనుకున్నారు. చిత్రంగా సుబ్బారావు గెలిచాడు. గుండ్లు తేలి బెండ్లు మునగడం అంటే ఇదేనేమో!’

మరిన్ని వార్తలు