సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ

18 Aug, 2019 10:57 IST|Sakshi

శంకర విజయం 10

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

‘‘పాపం ఆ దూర్వాస మహర్షి ఎప్పుడనగా తిన్నాడో ఏమో... కాస్త ఆ సంగతి చూడరాదూ’’ అన్నాడు వశిష్ఠుడు.
సరేనంటూ బయలుదేరింది అరుంధతి. దూర్వాసుడు తపస్సు చేస్తున్న చోటికి, వశిష్ఠాశ్రమానికి మధ్యగా ఒక వాగు ప్రవహిస్తోంది. అరుంధతి వెళ్లే సమయానికి అది కాస్తా పొంగింది. దాటివెళ్లడానికి భయమేసి బేలగా వెనక్కు తిరిగి వచ్చిందామె.
‘‘సదా బ్రహ్మచారి దారివ్వమన్నాడని చెప్పు’’ అన్నాడు వశిష్ఠుడు.
అరుంధతి వందమంది కొడుకుల్ని కన్నతల్లి. అక్షరాలా భర్త చెప్పినట్లే చేసింది. వాగు దారిచ్చింది. దూర్వాసునికి భక్తిప్రపత్తులతో భోజనం వడ్డించింది. తినేదాకా వేచివుంది. తిరిగి వెళదామని చూస్తే మళ్లీ అదే సమస్య. వాగు ఇందాకటి కంటే ఎక్కువ పరవళ్లు తొక్కుతోంది.
‘‘నిత్యోపవాసి దూర్వాసుడు దారివ్వమన్నాడని చెప్పు’’ అన్నాడు బ్రేవున త్రేనుస్తూ ఈసారి ఈ మహర్షి. ఇద్దరి పుణ్యమా అంటూ ఏ అడ్డంకీ లేకుండా అరుంధతి ఇల్లు చేరగలిగింది. అంతలేసి మహర్షులు అబద్ధాలాడారని చెప్పగలమా? వారు నిజమే చెప్పి ఉంటే ఎలా సాధ్యం?!.... ఇంతవరకూ కథ చెప్పి ప్రశ్న అడిగాడు ఆనందగిరి. 
శంకరుడు కన్నులు విప్పి చూశాడు. అప్పుడు వారు విద్యామంటపంలో ఉన్నారు. ఎదురుగా శిష్యులతో పాటు కాశీపుర ప్రజలు కూడా అనేకమంది వచ్చారు. శంకరునితో వాదానికి సిద్ధమై వచ్చినవారు అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఆనందగిరి అడిగిన ప్రశ్నకు మందస్మితుడై సమాధానం చెప్పబోయాడు శంకరుడు. అంతలో సభలోని చివరి పంక్తి నుంచి ఇలా వినిపించింది.... 

యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ
యోగరతుడే కానివ్వు... భోగాలన్నీ అనుభవిస్తూ ఉండనివ్వు. జనారణ్యంలో సంచరిస్తూ ఉండేవాడే కానివ్వు... కారడవులలో తపస్సు చేస్తుండనివ్వు. ఎవడి చిత్తం బ్రహ్మమునందు మాత్రమే క్రీడిస్తూ ఉంటుందో వాడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు.
సభ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. 
‘‘ఎలాగండీ అది సాధ్యమా?’’ మళ్లీ శంకరుణ్ణే అడిగాడు ఆనందగిరి.
 ‘‘సాధ్యమేనని మహర్షులు నిరూపించారు కదా! ప్రయోగించే శబ్దానికి పటుత్వం ఉండాలి’’ అన్నాడు శంకరుడు.
‘‘అయితే అది కేవలం శబ్ద ప్రభావమేనా?’’ ఇందాక శ్లోకం చెప్పిన వ్యక్తి నుంచి ప్రశ్న వచ్చింది. 
ఆ ప్రశ్నకు సమాధానంగా శంకరుడు శ్లోకరూపంగానే సంభాషించాడు. ‘‘కాదు... అది యోగదృష్టి. యోగులైన వారు పుణ్యపాపాలకు అతీతంగా సంచరిస్తారు. దారిలో కనిపించిన చిరుగు పేలికలు బొంతల్లా కప్పుకుంటారు. పసిపిల్లల్లా, ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తారు’’ అన్నాడు.
ప్రశ్న అడిగిన వ్యక్తి భోరుమని విలపించాడు. లేచి నిలబడ్డాడు. అతడు బవిరి గడ్డం, చింపిరి జుట్టుతో ఉన్నాడు. ఒంటిమీద వస్త్రాలు చిరుగులు పట్టాయి. పరుగు పరుగున వచ్చి శంకరుని పాదాలపై పడ్డాడు. 
శంకరుడు తాను అప్పుడే చెప్పిన శ్లోకంలో మొదటి రెండు పాదాల్నీ పునరావృత్తి చేశాడు. చివరి రెండు పాదాల్లోనూ, ‘‘నువ్వు లేవు. నేను లేను. ఈ భూలోకమే లేదు. నీదీ నాదీ ఇలాంటి స్థితి అయినప్పుడు శోకం ఎందుకు?’’ అని ప్రశ్నించాడు.

‘‘నిజమే స్వామీ! ఇది కాదు ఇది కాదనుకుంటూ ఆత్మవిచారణ చేసి ఉంటే ఈ గతి పట్టి ఉండేవాడిని కాను. కొద్ది సాధనతో అబ్బిన సిద్ధులన్నీ గొప్పవనుకుంటూ భ్రమల్లో చిక్కుకున్నాను. యోగం చేస్తున్నాననుకుంటూ అపమార్గం పట్టాను. చూస్తూండగానే కల కరిగి పోయింది. ఇలా పిచ్చివాడిలా స్థిరపడ్డాను. మీ ఉపదేశం నా మోహాన్ని పటాపంచలు చేసింది. ఇకపై నన్ను మీరే నడిపించాలి’’ అన్నాడు అతడు.
‘‘అస్తు’’ అన్నాడు శంకరుడు. అతడే తరువాతి కాలంలో ప్రసిద్ధులైన శంకరుని పద్నాలుగు మంది శిష్యుల్లో నిత్యానందునిగా గుర్తించబడ్డాడు.
సభలోనుంచి వేరొకవ్యక్తి లేచి నిలబడ్డాడు. ‘‘అయితే స్వామీ! ఏదీ కాదనుకోవాలి... లేదనుకోవాలంటారు. ఎదురుగుండా దేవుణ్ణి పెట్టుకుని... నువ్వు దేవుడివి కాదు. అయినా నువ్వు నా పూజలందుకో అనాలంటారా?’’ ప్రశ్నించాడు అతడు.
శంకరుని ముఖంపై చిరునవ్వు చెరగలేదు. ‘‘నువ్వు పూజించే బొమ్మ కదలదు. అది చైతన్య విహీనమైనది. అయినా పూజ చేస్తున్నావు. అది విష్ణువు అనుకుని పూజించడం వల్ల... ఆ బొమ్మయే విష్ణువుగా నీ పూజలు స్వీకరిస్తోంది. నీకు ఇష్టఫలాలను ఇస్తోంది. ఇక్కడ దృష్టి ప్రధానం. ‘ఏతేనైవ ఆయతనేన ఏకతర మన్వేతి’ అని శ్రుతి చెప్పింది’’ అన్నాడు.
‘‘అయితే పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చుంటే చాలా? ఏమిటి వాటివల్ల ప్రయోజనం?’’
‘‘తపసా కల్మషం హంతి విద్యయా అమృత మశ్నుతే.... అంటోంది స్మృతి. తపస్సు వల్ల కల్మషాలు నశిస్తాయి. విద్య అమృతత్వాన్నిస్తుంది. కర్మాచరణ చేసిన వాడు విశుద్ధ తత్త్వుడు అవుతాడు. అందువల్ల ఎవ్వరైనా బ్రహ్మజిజ్ఞాసతో కర్మలు ఆచరించవలసిందే.’’
శంకరుడు చెబుతున్న మాటతో సనందాచార్యుని ఘంటం ఆగింది. ‘‘జ్ఞాని అయినవాడు కూడా కర్మలు చేయాల్సిందేనా?’’ అని ప్రశ్నించాడు.

‘‘చేయాల్సిందే! కర్మలే విద్యాప్రాప్తికి హేతువులు. జ్ఞానోదయానంతరం కూడా కర్మలు చేసి తీరవలసిందే. కర్మాచరణ అవసరం లేని స్థితికి చేరుకోవాలి కానీ, అక్కర్లేదు అని చెప్పడానికి ఉపనిషత్‌ నియమాలు అంగీకరించడం లేదు’’ అన్నాడు శంకరుడు. 
ఆ ప్రస్తావనలన్నీ వ్రాయసకాడుగా ఉండి సనందుడు తైత్తిరీయంలోని శిక్షావల్లి 11వ అనువాకంలో నమోదు చేశాడు.
‘‘కర్మలు చేయడం ఎందుకు... మోక్షం కోసమే కదా?’’ అడిగాడు ఇందాకటి వ్యక్తి.
‘‘కాదు. పుణ్యకర్మల వల్ల స్వర్గాదులు మాత్రమే లభిస్తాయంటున్నాయి ఉపనిషత్తులు. మోక్షం కావాలంటే జ్ఞానమార్గమే శరణ్యం’’ అన్నాడు శంకరుడు. 
‘‘కానీ జ్ఞానం అనంతం కదా... తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతూ... చివరకు అంతా తెలుసునన్న స్థితి ఎప్పటికి స్వామీ వచ్చేను?’’ ప్రశ్నించాడు ఇందాకటి వ్యక్తి.
‘‘నిజమే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు. ఇక్కడ జ్ఞానమనే పదానికి లౌకికమైన అర్థాన్ని చెప్పకూడదు. జ్ఞానాన్ని క్రియారూపంలో చూడకూడదు. అలా చూస్తే దానికి అనంతత్వం ఉండదు. బ్రహ్మ చైతన్యం అనంతమైనది. బ్రహ్మజ్ఞానమే ఉపాసన చేయవలసింది’’ సమాధానమిచ్చాడు శంకరుడు.
‘‘క్రియారూపంగా లేనిదాన్ని నమ్మడమెలాగా? ఇది ఎలా ఉందంటే... ఒకడు బాగా పొద్దువాలాక నిద్దర లేచాట్ట. ఎండమావుల్లో కాసేపు స్నానం చేశాడు. ఒళ్లు శుభ్రంగా తుడుచుకుని ఆకాశ పుష్పాలతో చేసిన మాలను తలకు చుట్టుకున్నాట్ట. కుందేటి కొమ్మును ఊడబెరికి విల్లులా పట్టుకున్నాట్ట. ఇంక యుద్ధానికి బయల్దేరాడు. అదుగో వచ్చేస్తున్నాడు... వాడే గొడ్రాలి కొడుకు’’ అన్నాడు ప్రశ్న వేసిన వ్యక్తి. సభమొత్తం ఫక్కుమంది.

‘‘వేదం ఎప్పుడూ శూన్యార్థాన్ని కల్పించదు. అక్కడ సత్యం... అనంతం అని చెప్పింది బ్రహ్మతత్త్వాన్ని గురించి మాత్రమే. ఏది మూడు కాలాల్లోనూ ఎటువంటి వికారాలూ లేకుండా మార్పు చెందకుండా ఉంటుందో అది మాత్రమే సత్యం. బ్రహ్మ అటువంటి వాడు. అతడు కూడా సృష్టి చేయాలి అనుకున్నప్పుడు తనయందు జ్ఞాన కర్తృత్వం ఆపాదించుకుంటాడు.... జ్ఞానం కోసం అన్వేషిస్తాడు అంటారు కొందరు. కానీ అవన్నీ సమర్థనీయాలు కాదు. పరబ్రహ్మ సాక్షి మాత్రమే. జీవుడే తొమ్మిది రంధ్రాలు కలిగిన దేహాలను మార్చుకుంటూ తన కర్మలకు కొనసాగింపును, నశింపును తెచ్చుకుంటున్నాడు’’ శంకరుడు నిష్పక్షపాతంగా చెప్పాడు.
‘‘మొత్తంమీద జ్ఞానాన్ని ఉపాసించాలా? కర్మలు చేయాలా?’’ అమీతుమీ తేల్చుకుంటున్నట్లుగా అడిగాడు అతగాడు.
‘‘జ్ఞానమే బ్రహ్మ. అదొక్కటే సత్యం. అవశ్యం ఉపాసించాల్సింది దానినే. కర్మలు దానికి ఉపాయాలు అవుతాయంతే. యజ్ఞ యాగాదులకు దూరమై కర్మపరిత్యాగులైన మావంటి పరివ్రాజకులు కూడా నిత్యం జ్ఞానాగ్నిని అనుష్ఠిస్తూనే ఉంటారు. రాత్రింబవళ్లనే ఇటుకలుగా మార్చి, పక్ష మాస అయన సంవత్సరాలను సమిధలుగా చేసి, వాయు సంచారమే ఆజ్యం కాగా వారి జ్ఞానయజ్ఞం పూర్ణాహుతి రహితమై కొనసాగుతుంది. అలా లౌకికమైన ఉపకరణాలను మనసా కల్పించుకున్న వాడు నిజమైన కర్మాచరణ శీలి అవుతున్నాడు’’ అన్నాడు శంకరుడు.
ప్రశ్నించిన వ్యక్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి సంశయం తీరిన ఆనందం శ్లోకరూపంలో వెలువడింది.

త్వయిమయిచాన్యత్ర ఏకోవిష్ణుః వ్యర్థం కుప్యసిమయ్యసహిష్ణుః
సర్వస్మిన్నపి పశ్యత్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానం
– సర్వమూ విష్ణుమయం. నీలో, నాలో ఇతర వస్తువులన్నింటిలోనూ ఉన్నది విష్ణువే. అతి ముఖ్యమైన ఆ విషయాన్ని గ్రహించకుండా అనవసరంగా కలవరం దేనికి? అంతటా ఆత్మనే చూడు. ఎల్లవేళలా భేదభావాలను విడిచిపెట్టు... అన్నాడు. అతడే తరువాతికాలంలో శంకరశిష్యులలో ప్రసిద్ధుడైన సురేంద్రాచార్యుడు.
ఇప్పుడు నావంతు అన్నట్లు సభలో నుంచి ఓ పాశుపత శైవుడు లేచి నిలబడ్డాడు. అతడు శరీరంమీద అయిదు స్థానాల్లో శివలింగాలను ధరించి ఉన్నాడు.  
‘‘పశుపతి చేతిలోని పాశమే అవిద్యను ధ్వంసం చేస్తుంది. జీవుణ్ణి అతడితో సమానుణ్ణి చేస్తుంది. అప్పుడు మోక్షం కరతలామలకం అవుతుంది’’ అన్నాడు అతడు.
‘‘ఎలా కుదురుతుంది?’’
‘‘పువ్వులోని పరిమళం అంటించుకుంటే గాలి సుగంధంగా మారిపోయినట్లే! జీవుడు కూడా శివభక్తిని పెంపొందించుకుంటే ఈశునిగా మారిపోతాడు. అప్పుడు దుఃఖం తీరి ముక్తి లభిస్తుంది.’’
‘‘పరిమళం గాలికి సహజ లక్షణం కాదు. ఏ గంధాన్ని అంటించుకుంటే అదే వాసన వస్తుందంతే. ఆత్మ అటువంటిది కాదు. దానికి ముక్తి నిత్యమై ఉంటుంది. అది భావనామాత్రం కాదు.’’
‘‘అలా ఎలా కుదురుతుంది? అవిద్యలోనే కొట్టుకుపోయే మానవుడు నిత్యముక్తుడు ఎలా అవుతాడు?’’ అని ప్రశ్నించాడు పాశుపతుడు.

‘‘ఒక విషయం తెలుసుకోగానే... అదే విషయానికి సంబంధించి నీకున్న పూర్వపు అభిప్రాయం ధ్వంసమైపోతుంది. కొత్త అభిప్రాయం ఏర్పడుతుంది. స్పష్టత పెరిగే కొద్దీ జ్ఞానం నుంచి జ్ఞానం నుంచి మళ్లీ జ్ఞానం వైపుకే మనిషి ప్రయాణిస్తాడు. పూర్వపూర్వ జ్ఞానాలు ధ్వంసమై పోతుండగా ఉత్తరోత్తర జ్ఞానియై మానవుడు వికాసం పొందుతాడు. ఒకసారి జ్ఞాని అయినవాడు తిరిగి అవిద్యావంతునిగా వెనక్కు పోడు కదా! ఇక్కడ అవిద్యా ధ్వంసమనే క్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది ఎలాంటిదంటే చీకట్లను ధ్వంసం చేస్తూ వెలుగు వస్తుంది. చీకటి అనేదానికి ప్రత్యేకమైన అస్తిత్వం అంటూ ఉందా? వెలుగు లేకపోవడమే చీకటి అని మనం చెప్పుకుంటాం అంతే. కాబట్టి సృష్టిలో ధ్వంసరచన మాత్రమే నిత్యమైనది’’ అన్నాడు శంకరుడు.

‘‘ఎవరైనా అయిదు నియమాలు పాటిస్తే చాలు... ముక్తి పొందగలరని మా మతం చెబుతోంది’’ అన్నాడు పాశుపతుడు. 
‘‘కాదు.... ఉపాసన పంచముఖాలుగా కొనసాగాలని తైత్తిరీయం చెప్పిన విషయాన్ని వివరిస్తాను. విను..
1. అధిలోకము: భూలోకానికి ఉత్తరరూపమే ద్యులోకం. ఒకప్పుడు రెండూ కలిసే ఉండేవని చెబుతారు. వాయువు సంధానకర్తగా ఉండి, ఆ రెంటినీ వేరుపరిచాడు. 
2. అధి జ్యోతిషం: అగ్ని పూర్వరూపం. ఆదిత్యుడు ఉత్తరరూపం. దీనికి జలమే సంధి అంటే మధ్యభాగం. విద్యుత్తు సంధానకర్త.
3. అధి విద్య: ఆచార్యుడు పూర్వరూపం. శిష్యుడు ఉత్తరరూపం. విద్య సంధి. ప్రవచన పాఠమే సంధానం.
4. అధి ప్రజ: తల్లి పూర్వరూపం. తండ్రి ఉత్తరరూపం. ప్రజ సంధి. ప్రజననం అంటే సంతానాన్ని కనడమే సంధానం.
5. అధ్యాత్మ: క్రింది దవడ పూర్వరూపం. పై దవడ ఉత్తరరూపం. ఆ రెండు హనువుల సాయంతో కదలాడే వాక్కు సంధి. జిహ్వ దానిని సంధానిస్తుంది. అధ్యాత్మ అన్నప్పుడు ఆత్మ అంటే దేహమే. దేహ అవయవ విషయమైన ఉపాసనే అధ్యాత్మ. 
– ఈ అయిదు మహాసంహితలనూ ధ్యేయ దేవత ఆకారాన్ని చిత్తమందు నిలుపుకుని అహం స్ఫురణతో ఉపాసించాలి. ఈ రకమైన చిత్తవృత్తి తైలధారలా అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ చింతన చేసినవాడు గురువునే తదేక ధ్యానంతో ఉపాసించే శిష్యునిలా, రాజుని శ్రద్ధగా కనిపెట్టుకుని ఉండే భృత్యునిలా సిద్ధిపొందుతాడు’’ ముగించాడు శంకరుడు.

తన్మయుడై అప్పటివరకూ విన్న పాశుపతుడు.... 
కురుతే గంగాసాగర గమనం వ్రతపాలన మథవా దానం
జ్ఞానవిహీనే సర్వమనేన ముక్తిర్న భవతి జన్మశతేన
.... గంగాసాగర సంగమ తీర్థాన్ని సేవించినా, ఎన్నెన్ని వ్రతాలు ఆచరించినా, దానాలు ఎన్ని చేసినా, తత్త్వజ్ఞానం పొందనివాడికి నూరు జన్మలకైనా ముక్తి లభించదు – అని ఆలపించాడు. అతడే తరువాతికాలంలో సుబోధాచార్యుడై శంకరశిష్యునిగా ప్రసిద్ధికెక్కాడు.
ఆనాటి సభ ముగిసింది. ఆ మరునాడే నిత్యానందుడు, సురేంద్రుడు, సుబోధాచార్యుడు సంన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. 
కొంతకాలం గడిచింది. కాశీపండితులతో నిరంతరం కొనసాగుతున్న వాద ప్రతివాదనలు శంకరుని భాష్యరచనకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల కాశీని విడిచి బదరికాశ్రమానికి తరలిపోవాలని శంకరుడు నిర్ణయించుకున్నాడు. ఒకనాటి ఉదయాన్నే ప్రారంభమైన శంకరయతి ప్రయాణం పాణిని మహర్షి ఆలయం ముందు కొద్దిసేపు ఆగింది. లోపల నుంచి ధాతుపాఠం వినిపిస్తోంది.
‘ఊ.. సరిగ్గా చెప్పు. తను విస్తారే... షణు దానే’ 
‘కొట్టకండి గురువుగారూ! తను విస్తారే... షణు దానే... క్షణు హింసాయాం’ అంటున్నాడు శిష్యుడు.
- నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా