100 సూక్తుల వివేకం

7 Jan, 2018 00:17 IST|Sakshi

కవర్‌ స్టోరీ

ఇంటలెక్చువల్‌ మాంక్‌ ఆఫ్‌ ఇండియా

షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ‘సోదర సోదరీమణులారా’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించిన ప్రసంగం పాశ్చాత్య ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన పాశ్చాత్య మేధావులు ఆయనను ‘ఇంటలెక్చువల్‌ మాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని శ్లాఘించారు. తొలిసారిగా పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ తాత్విక విశిష్ఠతను ప్రత్యక్షంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గురువు ఆయన. చిన్నప్పుడు అల్లరి పిల్లాడిగా అమ్మ చీవాట్లు తిన్న నరేంద్రుడు, పెరిగి యువకుడయ్యాక రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారాడు. ఆయన మార్గదర్శకత్వంలో అంతులేని జిజ్ఞాసతో ఆధ్యాత్మిక మర్మాలను ఆకళింపు చేసుకుని, స్వామీ వివేకానందగా ఎదిగాడు.

భారతీయ ఆధ్యాత్మిక సంపద ఘనతను ప్రపంచానికి చాటే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని, ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాడు. ‘మనుషులను తీర్చిదిద్దడమే నా పని’ అని ప్రకటించి, మనుషులను తీర్చిదిద్దే పనికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ‘ప్రపంచమే పెద్ద వ్యాయామశాల. మనల్ని మనం మరింత దృఢంగా తీర్చిదిద్దుకునేందుకే ఇక్కడకు వచ్చాం’ అంటూ మానవ జన్మ ప్రయోజనాన్ని ఉద్బోధించిన మహనీయుడు స్వామీ వివేకానంద. యువశక్తిపై అపారమైన విశ్వాసం గల ఆయన తన బోధనలతో యువకుల్లో నూతనోత్సాహాన్ని నింపాడు. అందుకే ఆయన జయంతిని మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా గుర్తించింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన పలికిన ఆణిముత్యాల్లాంటి మాటలు..సత్యం కోసం దేనినైనా త్యాగం చేయవచ్చు. అయితే, దేనికోసమైనా సత్యాన్ని త్యాగం చేయకూడదు.

►బలమే జీవనం.  బలహీనతే  మరణం
సత్యం, స్వచ్ఛత, నిస్వార్థం... ఈ మూడు లక్షణాలూ ఉన్నవారిని సృష్టిలోని ఏ శక్తీ నాశనం చేయలేదు. 

అన్ని శక్తులూ మీలోనే ఉన్నాయి. మీరు ఏదైనా చేయగలరు. మీరు అన్నీ చేయగలరు. ఇది నమ్మండి. మిమ్మల్ని మీరు బలహీనులని ఎప్పుడూ అనుకోకండి.

మీ అంతట మీరే లోపలి నుంచి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు. ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు.

ఎవరిపైనా ఆధారపడవద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు.

నిజమైన మార్గదర్శకత్వం చీకట్లో చిరుదీపంలాంటిది. అది అన్నింటినీ ఒకేసారి చూపించదు. అయితే, మీరు వేసే ప్రతి అడుగు సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది.

మీకు సాయం చేసేవారిని మరచిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించవద్దు. మిమ్మల్ని నమ్మినవారిని మోసగించవద్దు.

అస్తిత్వంలోని అసలు మర్మం భయం లేకపోవడమే. దేనికీ భయపడవద్దు. భయపడితే మీరే భయంగా మారిపోతారు. 

నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది.

మతాల మర్మం వాటి సిద్ధాంతాల్లో కాదు, ఆచరణలోనే ఉంది. మంచిగా నడుచుకోవడం. ఇతరులకు మంచి చేయడం. ఇదొక్కటే అన్ని మతాల సారాంశం.

ఆదర్శవంతుడు వెయ్యి తప్పులు చేస్తాడనుకుంటే, ఆదర్శరహితుడు యాభైవేల తప్పులు చేస్తాడనేది నిస్సంశయం. అందువల్ల ఆదర్శాలను కలిగి ఉండటం మంచిది.

మహిళలను తగిన రీతిలో గౌరవించిన దేశాలే ఔన్నత్యాన్ని సాధిస్తాయి. మహిళలను గౌరవించని దేశాలేవీ ఉన్నతిని సాధించలేవు.

బలహీనతలూ బంధనాలూ ఊహాజనితాలే. బలహీనపడవద్దు. దృఢంగా నిలబడండి. అనంతమైన శక్తి మీలోనే ఉంది.

రాజకీయంగా, సామాజికంగా ఎవరైనా స్వాతంత్య్రం సాధించవచ్చు. ఎవరైనా ఒక మనిషి తన వ్యామోహాలకు, ఆకాంక్షలకు బానిసగా ఉన్నంత కాలం నిజమైన స్వేచ్ఛలోని స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదించలేడు.

మీపై మీకు నమ్మకం లేనంత కాలం మీరు దేవుడిని నమ్మలేరు.

విశ్వాసం... విశ్వాసం... విశ్వాసం... మన విశ్వాసమే మనం. విశ్వాసమే దైవం. ఔన్నత్యానికి విశ్వాసమే మార్గం.

మీ విధికి మీరే విధాతలని గ్రహించండి. బాధ్యతలను స్వీకరించి ధైర్యంగా ముందడుగు వేయండి.

ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు.

కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు.

మీ సహచరులకు నాయకత్వం వహించాలనే ఆలోచన చేయకండి. దానికి బదులు వారికి మీ శాయశక్తులా సాయం చేయండి.

మతాలన్నీ సమానమే. వాటి పద్ధతుల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, వాటి సారాంశం ఒక్కటే. 

వేదాలు, ఖురాన్, బైబిల్‌... ఇవేవీ లేని చోటుకు మానవాళిని ముందుకు నడిపించాలనుకుంటాం. అయితే, వేదాలు, ఖురాన్, బైబిల్‌ మధ్య సామరస్యంతోనే అది సాధ్యమవుతుంది. 

మతాలన్నీ పిడివాదాలకు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. మనుషుల్లో హేతుబద్ధతకు దోహదపడేవిగా ఉండాలి.

హేతుబద్ధమైన కార్యాచరణతోనే బాల్యవివాహాలు, అవిద్య వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది.

సమాజంలో మార్పు తెచ్చేందుకు చేపట్టే ఎలాంటి కార్యాచరణ అయినా ఉపరితలానికే పరిమితం కారాదు. హేతుబద్ధమైన కార్యాచరణ ఏదైనా అట్టడుగు స్థాయి నుంచి మొదలైతేనే సమాజంలో సమూలమైన మార్పులు సాధ్యమవుతాయి.

కరువు కాటకాలతో, ప్రకృతి విపత్తులతో, మహమ్మారి రోగాలతో మనుషులు అల్లాడే చోటుకు వెళ్లండి. ఆపన్న హస్తాల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారికి శక్తివంచన లేకుండా సేవ చేయండి.

జీవుడే దేవుడు. ఎవరైనా మానవసేవ ద్వారా భగవంతుడికి చేరువ కావచ్చు. 

ఒక వితంతువు కన్నీళ్లు తుడవలేని, ఒక అనాథ నోటికి అన్నం అందించలేని ఏ దేవుడినైనా, ఏ మతాన్నైనా నేను విశ్వసించను. ఆకలితో అలమటిస్తున్న సాటి మానవులను పట్టించుకోని ప్రతి మనిషినీ నేను ద్రోహిగానే పరిగణిస్తాను.

ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే చాలు. జరగాల్సిన పనులు వాటంతట అవే జరిగిపోతాయి.

ప్రతి గొప్ప పనికీ మూడు దశలు ఎదురవుతాయి– అవహేళనలు, వ్యతిరేకత... చివరకు ఆమోదం. తాము ఉన్న కాలాని కంటే ముందు ఆలోచించే వాళ్లను ప్రపంచం అపార్థం చేసుకుంటుంది.

ఎల్లప్పుడూ అత్యున్నత ఆదర్శాలను కలిగి ఉండండి. ఈర్ష్యను, స్వార్థాన్ని విడిచి మనో స్థైర్యంతో ముందుకు సాగండి. అప్పుడు మీరు ప్రపంచాన్నే కదిలించగలరు.

ధర్మానికీ, దేశానికీ ఉపయోగపడని శరీరం, ధనం ఎంతగా పెరిగినా వ్యర్థమే.

సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు.

మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించండి.

అనాలోచితంగా తొందరపడి ఏ పనీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల... ఈ మూడూ కార్యసిద్ధికి ఆవశ్యకాలు. అయితే, ఈ మూడింటి కంటే ప్రేమ మరింత ఆవశ్యకం.

దయార్ద్ర హృదయంతో ఇతరులకు సేవ చేయడం మంచిదే గాని, సర్వజీవులను భగవత్‌ స్వరూపాలుగా ఎంచి సేవించడం ఇంకా మంచిది.

జీవితంలో ధనం నష్టపోతే కొంత పోగొట్టుకున్నట్లు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే మాత్రం సర్వస్వం కోల్పోయినట్లే.

నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయ తీరాల వైపు నడిపిస్తుంది.

అసత్యానికి దూరంగా ఉండండి. సత్యానికి కట్టుబడి ఉండండి. సత్యానికి కట్టుబడి ఉంటే ఆలస్యమైనా విజయం సాధించి తీరుతాం.

భయాన్ని వీడండి. మనిషి పతనానికైనా, పాపానికైనా భయమే కారణం.

దృఢ సంకల్పం, పవిత్రాశయం తప్పక ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా ధరించిన వారు అన్ని విఘ్నాలనూ ప్రతిఘటించి నిలువగలుగుతారు.

లక్ష్యం కోసం అలుపెరుగకుండా శ్రమిస్తుంటే నేడు కాకుంటే రేపైనా విజయం సిద్ధిస్తుంది.

ఒక్క క్షణం సహనం ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

మనం మార్పు చెందితే ప్రపంచమంతా మారుతుంది. మనం పరిశుద్ధులమైతే ఈ లోకమంతా పరిశుద్ధమవుతుంది.

మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు.

రోజుకు కనీసం ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఈ ప్రపంచంలోని అద్భుతమైన మనిషిని కలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు.

ధీరులు, సమర్థులు అయిన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. వీరోచిత ధైర్య సాహసాలతో కడవరకు ప్రయత్నాన్ని కొనసాగించే వారికే విజయం వరిస్తుంది.

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతారో, దాన్ని పొందే మార్గాలపైనా అంతే శ్రద్ధ చూపాలి.

అసూయను, అహంభావాన్ని విడనాడండి. ఇతరుల మేలు కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.

తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకవంతుడు చేపట్టే ప్రతి పనినీ తనకు నచ్చేలా మలచుకుంటాడు. ఏ పనీ అల్పమైనది కాదు.

మనకు కావలసినది శ్రద్ధ. మనిషికీ మనిషికీ నడుమ తేడాలకు కారణం వారి శ్రద్ధలోని తారతమ్యాలే. ఒక మనిషిని గొప్పవాడిగా, మరో మనిషిని బలహీనుడిగా చేసేది శ్రద్ధే.

భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి.

వేదాంత పరిభాషలో పాపమనేదే లేదు. మనం పాపాలు అనుకున్నవన్నీ పొరపాట్లు మాత్రమే.

అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో, అపవిత్రమైన ఆలోచన కూడా అంతే చెడ్డది.

ప్రతి బాధ్యత పవిత్రమైనదే. బాధ్యతపై మనకు గల భక్తి మాత్రమే భగవంతునికి మనం చేయగల అత్యుత్తమమైన అర్చన.

మనిషిలో ముందుగానే నిక్షిప్తమై ఉన్న సంపూర్ణతకు ఒక రూపాన్నిచ్చేదే విద్య.

అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించడానికి మీ జీవితాన్నంతా ధారపోయండి.

మానవ జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం.

మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం.

సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు.

ఓర్పుగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం, సత్యానుభూతి కోసం తీవ్రంగా తపించడం... ఇవి మాత్రమే మానవాళి భవిష్యత్తును సుసంపన్నం చేయగలవు.

ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర పనిలోనైనా ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ పని అంత చక్కగా నెరవేరుతుంది.

మన దేశంలో రెండు మహా పాతకాలు ఉన్నాయి. అవి: స్త్రీలను అణగదొక్కడం, నిరుపేదలను కుల నిబంధనలతో వేధించడం.

ఇతరుల దోషాల గురించి ఎన్నడూ ముచ్చటించకు. వారెంత దుష్టులైనా సరే. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు.

బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే కాని, అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. 

విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కాని దైవం విగ్రహం మాత్రమేనని ఆలోచిస్తే మాత్రం పొరపాటే.

సజీవ దైవాలను సేవించండి. అంధుడు, వికలాంగుడు, నిరుపేద, దుర్బలుడు, క్రూరుడు... ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుడిని గుర్తించండి చాలు.

బలమే జీవనం. బలం సంక్షేమాన్ని, అంతులేని జీవితాన్ని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. బలహీనతే మరణం. బలహీనత అంతులేని దుఃఖాన్ని, శ్రమను కలిగిస్తుంది. 

మిమ్మల్ని మీరు అనంత శక్తి సమన్వితమైన ఆత్మ స్వరూపులుగా భావించుకోండి. అప్పుడు ఎలాంటి శక్తి వెల్లడవుతుందో చూడండి.

ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రతే ఏకైక మార్గం.

నిలువెల్లా స్వార్థం నిండిన మనిషే ఈ లోకంలో అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. స్వార్థం లేశమైనా లేని మనిషి పరమానందాన్ని పొందుతాడు.

ప్రపంచంలో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. జీవితకాలంలో మనకున్న సమయం తక్కువ. అందువల్ల మనకు అవసరమైనది ఒంటపట్టించుకోవడమే జ్ఞానం.

అహంకార మమకారాలు, నేను, నాది అనే భావనలే ఈ లోకంలోని అనర్థాలన్నింటికీ కారణం.

శారీరక శుభ్రత అవసరమే అయినా, మానసిక పవిత్రత మరింత ముఖ్యం. మనో మాలిన్యాలను తొలగించుకోనిదే బాహ్యశుద్ధి వల్ల ఉపయోగం లేదు.

మనిషనేవాడు ముందు ఆత్మాభిమానం కలిగి ఉండాలి. ఆత్మాభిమానం లేనివాడు మనిషిగా ఎదగలేడు.

కార్యసాధన శక్తి కంటే కష్టాలను భరించే శక్తి చాలా గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి చాలా చాలా గొప్పది.

స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యిసార్లు విఫలమైనా వెనుకంజ వేయకుండా మరోసారి ప్రయత్నించండి.

ఇతరులకు చేసిన మంచి కొంచెమైనా సరే, అది అంతర్గత శక్తిని మేల్కొలుపుతుంది. మంచిని కనీసం తలచుకున్నా, అది మనసును అనంత శక్తితో నింపుతుంది.

తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు.

తనను తాను కించపరచుకోవడం అన్ని బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.

పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మను దర్శించుకోగలరు.

మిమ్మల్ని మీరు నిరుపేదలుగా అనుకోవద్దు. ధనం కంటే మంచితనం, పవిత్రతలే నిజమైన సంపద.

పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శక్తినే విశ్వసించండి. ప్రపంచంలో పాపమనేది ఏదైనా ఉంటే అది మన బలహీనత మాత్రమే.

డబ్బులేని మనిషి నిరుపేద కాదు. నిజానికి జీవితంలో లక్ష్యం లేని మనిషే నిరుపేద.

ఒక సమయంలో ఒకే పని చేయండి. ఆ పని చేస్తున్నంత సేపూ మీలోని సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించండి.

స్వార్థం లేకుండా ఉండటమే అన్ని నీతుల్లోకీ గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతిపనీ గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

 పవిత్రత ఒక మహత్తర శక్తి. దాని ముందు మిగిలినవన్నీ భయంతో కంపిస్తాయి.

పట్టు విడవకుండా పనిచేయండి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోండి.

పరిపూర్ణమైన అంకిత భావం, పవిత్రత, అత్యంత సునిశిత బుద్ధి కలిగిన కొద్దిమంది పనిచేసినా ప్రపంచంలో పెనుమార్పులు సంభవిస్తాయి.

అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది. యోగం ద్వారా జ్ఞానం, జ్ఞానం నుంచి ప్రేమ, ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి.

నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు గాని, ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే అన్ని ప్రార్థనల కంటే ఎక్కువగా మనల్ని భగవంతుడికి చేరువ చేస్తుంది.

మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానినే అంటిపెట్టుకుని పనిచేయండి.

సహృదయం నుంచి భగవద్వాణి వినిపిస్తుంది. సంకుచితమైన బుద్ధి నుంచి వెలువడేది స్వార్థమే.

 నిరుత్సాహులై, అధైర్యపడేవారు జీవితంలో ఏ పనినీ సాధించలేరు.

ఇతరులు ఏమి అనుకున్నా, ఏమి చేసినా మీరు మాత్రం మీ పవిత్రతను, నైతిక స్థైర్యాన్ని, భగవద్భక్తి స్థాయిని దిగజార్చుకోకండి.

బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే గాని, బలహీనతను గురించి చింతించడం కాదు.

 మెదడుకు, హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్నే అనుసరించండి.

విధేయత, సంసిద్ధత, కర్తవ్యం పట్ల ప్రేమ... ఈ మూడూ మీలో ఉంటే ఏ శక్తీ మిమ్మల్ని అడ్డుకోలేదు.

మనిషిలో దైవత్వం దాగి ఉంది. ప్రతి మనిషీ తనలోని దైవత్వాన్ని వెలికితీసి తన ప్రవర్తనలో వ్యక్తపరచడం సాధ్యమే. అదే మానవ జీవిత లక్ష్యం. 

మరిన్ని వార్తలు