తపాలా: రాణమ్మ మారాణి!

9 Mar, 2014 00:04 IST|Sakshi
తపాలా: రాణమ్మ మారాణి!

 సాధారణంగా ఇటువంటి సిట్యుయేషన్‌లో బయట వరండాను మాత్రమే పరులకి కేటాయించడం జరుగుతుంది. కానీ, ఆమె  లోపలికి సాదరంగా ఆహ్వానించింది. నిమ్మరసం కలిపిచ్చింది.
 
 అది 2008వ సంవత్సరం. నా ఇద్దరు పిల్లలకు ఓ నాలుగైదేళ్లుంటాయి. అమ్మ, పెద్దమ్మ ఊరు నుంచి రావడంతో నేను, మావారు, పిల్లలు కలిసి వరదయ్యపాలెంలో కొత్తగా పాలరాతితో కట్టిన గుడి గురించి అందరూ విశేషంగా చెప్పుకుంటేనూ... చూడటానికి బయలుదేరాం. వెళ్లేటప్పుడు సంతోషంగా ప్రయాణం చేశాం.
 
 సాయంత్రం తిరుగు ప్రయాణంలో  కారు ట్రబులిచ్చింది. మేం నిస్సహాయ స్థితిలో నిలిచిపోయిన ఊరు... ఒక పల్లెటూరు. పేరు కృష్ణాపురం. చుట్టుపక్కల మెకానిక్‌లు దొరకడం అసంభవమని తేల్చిచెప్పేశారు గ్రామస్థులు. మేం అందరం నజ్జుగుజ్జులాటలో ఉండగానే నలుదిక్కులు ఎప్పుడో చీకటిని ఆక్రమించేసుకున్నాయి. అక్కడ నుండి టౌన్‌కు, టౌన్ టూ మెయిన్ బస్టాండ్, ఆపై మా ఇంటికి ప్రయాణమంతా మూడున్నర గంటల పైమాటే! చివరి బస్సు దొరుకుతుందని నమ్మకం లేదు. కారుని అక్కడే అలా వదిలి వెళ్లలేని పరిస్థితి. కారు మాది కాకపోయినా, డ్రైవర్ తెలిసినవాడే అయినప్పటికీ, నిక్కచ్చిగా చెప్పేశాడు. తను ఏ విధంగానైన అర్ధరాత్రి ఇంటికి చేరిపోవాలని! అతగాడున్నా చేసేదేమీ లేదని తెలిసి వెళ్లిపోమన్నాం. ఇక మావారు, ఆయన కూడా వెళ్లాల్సిందే! తెల్లవారితే మెకానిక్‌ని పిలుచుకురావాలి కదా. మిగిలింది ముగ్గురు ఆడవాళ్లం, ఇద్దరు చిన్నపిల్లలు. మమ్మల్ని ఆ స్థితిలో చూసి ‘‘ఇక్కడే ఉండండమ్మా, ఇప్పుడేం కొల్లపోయిం’దని ఎదురుగా ప్రహరీ గోడ గేటుకానుకొని చెప్పింది ఒకామె (పేరు రాణమ్మ). రాత్రికి వాళ్ల ఇంట్లోనే ఉండమంటున్నారు. మనమెలా ఉండిపోగలం? మా శ్రీవారికి ఎటూ తోచని స్థితిలో ఆమె ధైర్యం చెప్పారు. ఆయన, మమ్మల్నందర్నీ పొద్దున్నే బస్సెక్కి రమ్మని చెప్పి, మెకానిక్ కోసం వెళ్లిపోయారు.
 
 ఏ కారణం చేతలో రాణమ్మగారింటి మూడు గదులలో ఒక గది బయటి నుండి తాళం వేసి, వాడని స్థితిలో ఉంది. మిగిలినవి రెండే గదులు. వంటిల్లు, హాలు! ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఇద్దరే! భార్య, భర్త. సాధారణంగా ఇటువంటి సిట్యుయేషన్‌లో బయట వరండాను మాత్రమే పరులకి కేటాయించడం జరుగుతుంది. కానీ, ఆమె  లోపలికి సాదరంగా ఆహ్వానించింది. నిమ్మరసం కలిపిచ్చింది.
 
 మమ్మల్ని, ఆ సాయంత్రం ఆ ఇంట్లో చూసిన ఆమె బావగారు, రాత్రి తొమ్మిది గంటలకు వారబ్బాయిని బైక్‌పై మేమున్న ఇంటికి పంపించారు. మేం భోజనం చేశామా లేదా? ఒకవేళ హోటల్ నుంచి మీల్స్ ఏమైనా పార్శిల్ తీసుకురావాలా అని! ఆ రాత్రి ఆమె భర్త, మాకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రాత్రి భోజనం ముగించి వెళ్లి, తిరిగి తెల్లవారుఝామున అయిదింటికి వచ్చి, శబ్దం లేకుండా తలుపుతట్టారు.


 ఆవిడ మమ్మల్నెవరినీ చాప వేసి కింద పడుకోబెట్టడానికి ఒప్పుకోలేదు. నేనింత మొహమాటస్థురాలిని అయినా, పిల్లలిద్దర్నీ చెరోపక్క వేసుకొని, వారి పెద్ద మంచంపై పడుకోక తప్పలేదు. అమ్మ, పెద్దమ్మ వేరే సోఫాల్లో సర్దుకున్నారు. తెల్లవారి కళ్లు తెరిచి చూద్దును కదా! ఆమె ఎక్కడా కనిపించలేదు. బయట సన్నని తుంపర. ‘ఆమె’ బయటికి వెళ్లిందని అమ్మ చెప్పింది.  ఇంటిని మొత్తం మాకొదిలేసింది. టీపాయ్‌పై లోటాడు కాఫీ మూతపెట్టి ఉంది. సిద్ధం చేసి ఉంచిన వేణ్నీళ్లతో మొహాలు కడుక్కొని బయలుదేరి ఉన్నాం. నల్లని గొడుగు కింద కూడా అర్ధభాగం తడుసుకుంటూ ఆమె గేటు తీసుకుని వచ్చింది. ‘‘పిల్లలకి వేడిగా ఇడ్లీలు తెచ్చిద్దామని వెళ్లాను. అంగడావిడ ఇంకా పెట్టలేదు. మరో అర్ధగంట పడుతుందట’’ అమాయకంగా అంది.
 
 నా దగ్గర మాటల్లేవ్, ఇక ఆమె గురించి చెప్పటానికి. కాలక్రమంలో... సెల్‌ఫోన్ల మార్పిడిలో ఆమె నంబర్ పోగొట్టుకున్నాను. ఆ రోజు ఆమె తన ఇంటిలో ఆశ్రయం ఇవ్వకపోతే, పెద్ద వైపరీత్యాలేమీ జరగకపోవచ్చు కానీ, ఎన్నో తంటాలు పడి ఇల్లు చేరుకునేవాళ్లం. మా అమ్మ వయసుండే రాణమ్మగారు ఎక్కడున్నా సరే... ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
 - పి.శాంతి, అంగళ్లు, చిత్తూరు

మరిన్ని వార్తలు