క్రిస్మస్ ట్రీ: జగానికి జర్మనీ కానుక

19 Dec, 2015 23:01 IST|Sakshi
క్రిస్మస్ ట్రీ: జగానికి జర్మనీ కానుక

క్రిస్మస్ వేడుకలో చెట్టు అలంకరణ ఎంతో ముచ్చటగా ఉంటుంది. రకరకాల పరిమాణాలలో ఉండే క్రిస్మస్ చెట్టు, రకరకాల బొమ్మలతో, పూలతో, మెరుపుల అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక వేడుకలో కనిపించే కళాత్మక దృష్టికి ఈ చెట్టు నిదర్శనంగా ఉంటుంది.  నిజానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ క్రిస్మస్ చెట్టు అలంకరణను వేడుకలో భాగం చేసినప్పటికీ, మొదట్లో దీనికి అంత ఆమోదం లభించలేదు.
 
నిజానికి పాత నిబంధనలోనే క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఉంటుందని చెబుతారు. కానీ రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొని 19వ శతాబ్దానికి గానీ ఈ చెట్టు ప్రపంచమంతా విస్తరించలేదు. ఒక పచ్చని చెట్టును నరికి తెచ్చి ఇంటిలో అలంకరించుకోవడం ఇష్టం లేక, ఇది దేవతారాధన సంప్రదాయం కలిగిన మత చిహ్నం కావడం (పాగన్ రెలిజియన్) వల్ల మొదటి దశలో క్రిస్మస్ చెట్టు పెట్టే సంప్రదాయానికి వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ రాజ్యాలలో మాత్రమే క్రిస్మస్ చెట్టును అలంకరించే అలవాటు కనిపిస్తుంది. చెట్టును కొట్టడం, కొంతవరకు పాగన్ మతాల లక్షణాలు కనిపించడ మే ఇందుకు కారణం.
 
ప్రాచీన రోమన్లు క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేసి, దానిని 12 కొవ్వొత్తులతో అలం కరించే సంప్రదాయాన్ని పాటించేవారు. ఆ అంకె వారి ఇష్టదైవం. సూర్యునికి ప్రతీక. ఇంకా చెట్టు నిండా పలు రకాల దేవతా మూర్తులను అలంకరించేవారు. అందులో ‘బాచుస్ దేవత’ కచ్చితంగా ఉండేది. అంటే భూమిని సారవంతం చేసే దేవత.  
 
ఇంతకీ అసలు ఈ చెట్టు మొదట ఎక్కడ ఏర్పాటైంది? వేయి సంవత్సరాల క్రితం జర్మనీలోనే ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడు దీనిని ఆరంభించాడు. జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే ఆ తర్వాత ఈ సంప్రదాయం కొంతకాలం మరుగున పడినప్పటికీ తిరిగి జర్మనీలోనే మళ్లీ ఆదరణ పొందింది. ఆధునిక చరిత్ర ప్రకారం 16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ దీనిని పారా డెయిస్ బామ్ (ప్యారడైజ్ ట్రీ) అని పిలుచుకునేవారు.
 
డిసెంబర్ 24న ఒక ఓక్ చెట్టు శాఖను తెచ్చి అలంకరిస్తారు. అదే క్రిస్మస్ చెట్టు. మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఇంగ్లండ్‌లో కూడా ఈ సంప్రదాయానికి అంతగా ప్రాచుర్యం లేదు. ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య విక్టోరియా మహారాణిల కాలంలో, అంటే  1840లో మాత్రమే అక్కడ క్రిస్మస్ చెట్టు ప్రత్యక్షమైంది. ఇందుకు కారణం- అల్బర్ట్ జర్మన్ జాతీయుడు. ఆ యుద్ధకాలంలో తమ ట్రెంచ్‌లలో జర్మన్ సైనికులు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తే, అవేమిటో ఇంగ్లిష్ సైనికులకు అర్థం కాలేదు.

ఆఖరికి అమెరికాలో కూడా 1850 వరకు ఈ చెట్టుకు అంత ప్రాధాన్యత కలగలేదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804-1869) మొదటిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ చెట్టును అనుమతిం చాడు. తర్వాత మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది.

>
మరిన్ని వార్తలు