కత్తిపోటు... కనిపెట్టిందెవరు?

16 Apr, 2016 22:19 IST|Sakshi
కత్తిపోటు... కనిపెట్టిందెవరు?

పట్టుకోండి చూద్దాం
పోలీసు జీపు హాస్పిటల్ ముందు ఆగింది. ‘‘ఏమైంది?’’... జీపు దిగుతూనే అడిగాడు ఇన్‌స్పెక్టర్ సుభాష్.
 ‘‘వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఎవరో పొడిచేసి పారిపోయారంట సర్’’ అన్నాడు కానిస్టేబుల్ కోటేశ్వర్రావ్.
 ‘‘పేషెంట్ మాట్లాడుతున్నాడా?’’
 ‘‘ఇంకా లేదు సర్.’’
 ‘‘మరి ఈ విషయం నీకెలా తెలుసు?’’
 ‘‘అతని ఫ్యామిలీ మెంబర్‌‌స చెబుతున్నారు సర్. పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు.’’
 తల పంకించాడు సుభాష్. ‘‘పద... అతని ఫ్యామిలీ మెంబర్‌‌సతో మాట్లాడుదాం’’ అంటూ లోనికి నడిచాడు. కానిస్టేబుల్ వెంబడించాడు.
    
ఐసీయూ ముందు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఓ పెద్దాయన, ఓ యువకుడు, ఓ మహిళ. ఇన్‌స్పెక్టర్‌ని చూస్తూనే లేచి నిలబడ్డారు.
 ‘‘ఈ సంఘటన ఎలా జరిగింది?’’ అడిగాడు సుభాష్. ఆ ప్రశ్న వింటూనే బావురుమంది మహిళ. ‘‘ఊరుకోమ్మా’’ అన్నాడు యువకుడు.
 ‘‘ఆయన మా నాన్నగారు సర్. రోజూ ఉదయం వాకింగుకి వెళ్తారు. ఇవాళ కూడా అలాగే వెళ్లారు. వెళ్లిన కాసేపటికే మాకు ఫోన్ వచ్చింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి చేశాడు. వాకింగ్ చేస్తోన్న మా నాన్నగారిని ఎవరో కత్తితో పొడిచి పారిపోయారని చెప్పాడు. అందరూ కలిసి అంబులెన్సును పిలిచి నాన్నగారిని ఆస్పత్రికి పంపించారని చెప్పాడు’’... వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడతను.
 
సుభాష్ ఏదో అడగబోతుండగా డాక్టర్ బయటికి వచ్చాడు. ‘‘ప్రాణాపాయం లేదు. కాకపోతే కత్తి కడుపులో బలంగా దిగింది. స్పృహలోకి రావడానికి టైమ్ పడుతుంది. మీరు ఆయన్ని చూడొచ్చు’’ అనేసి వెళ్లిపోయాడు.
 అందరూ లోనికి వెళ్లారు. సుభాష్ మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకు కావలసిన వివరాలు రాసుకున్నాడు. నిందితుడిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మనసులో మెదిలాడు... ఆ అపరిచిత వ్యక్తి. అతడైతే ఏమైనా క్లూస్ ఇవ్వగలడు. వెంటనే వెళ్లి బాధితుడి కొడుకుని అతని గురించి అడిగాడు.
 ‘‘అతనెవరో నాకూ తెలియదు సర్. తనూ వాకింగ్ చేస్తున్నాడట. అతని కళ్లెదురుగానే ఇదంతా జరిగిందట. నాన్న నా నంబర్ చెప్పి ఫోన్ చేయమనడంతో వెంటనే ఫోన్ చేశానని అన్నాడు. అతని పేరు... పేరు... నాగరాజు అని చెప్పినట్టు గుర్తు.’’
 ‘‘అతను నీకు ఫోన్ చేసిన నంబర్ ఇవ్వు. తనని అడిగితే మరిన్ని వివరాలు తెలియవచ్చు’’ అన్నాడు సుభాష్. యువకుడు ఆ నంబర్ చెప్పాడు. వెంటనే నాగరాజుకి ఫోన్ చేసి అరగంటలో స్టేషన్‌కి రమ్మని చెప్పాడు సుభాష్.
     
 ‘‘మీరేం చేస్తుంటారు నాగరాజుగారూ’’... అడిగాడు సుభాష్.
 ‘‘మెహదీపట్నంలో హోటల్ నడుపుతున్నాను సర్.’’
 ‘‘ఆ సంఘటన మీరు కళ్లారా చూశారా?’’
 ‘‘చూశాను సర్. ఆయన నడచుకుంటూ వస్తున్నారు. నేను ఆయనకు ఎదురుగా వెళ్తున్నాను. ఇద్దరి మధ్యా కొంత దూరం ఉంది. అంతలో ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి ఆయన వెనుకగా వచ్చాడు. వెనుక నుంచి ఆయన్ని కత్తితో పొడిచేసి పారిపోయాడు. అందరం కలిసి ఆయన్ని అంబులెన్సులో హాస్పిటల్‌కి పంపించాం. అంతే సర్’’ అనేసి నిట్టూర్చాడు నాగరాజు.
 
‘‘ఎక్కడా కన్‌ఫ్యూజన్ లేదు కదా? కరెక్ట్‌గానే చెప్తున్నారు కదా?’’
 ‘‘అస్సలు లేదు సర్. కావాలంటే రాసి ఇస్తాను’’ అన్నాడు నాగరాజు కాన్ఫిడెంట్‌గా.
 ‘‘అయితే యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ నాగరాజూ’’ అన్నాడు సుభాష్. నాగరాజుతో పాటు కానిస్టేబుళ్లు కూడా అవాక్కయిపోయారు.
 ‘‘బాధితుడు కూడా మెహదీపట్నంలో ఈ మధ్యనే హోటల్ పెట్టాడు. అదీ నీ హోటల్ పక్కనే. నీ బిజినెస్ దెబ్బ తింటోందన్న అక్కసుతో నువ్వే అతణ్ని చంపాలనుకున్నావ్. అంతే కదా?’’ అన్నాడు సుభాష్.
 తడబడ్డాడు నాగరాజు. తన నేరం బయట పడిపోయింది అన్న తడబాటు అది. ఇంతకీ అతడే నేరస్థుడని సుభాష్ ఎలా కనిపెట్టాడు???
 
జవాబు:  
నాగరాజు సంఘటనను వివరిస్తూ... ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి వెన్నులో పొడిచాడని చెప్పాడు. కానీ కత్తి కడుపులో దిగిందని డాక్టర్ ముందే సుభాష్‌కి చెప్పాడు. అంటే నాగరాజు అబద్ధం చెబుతున్నాడు. దాన్నిబట్టి సుభాష్ ఓ రాయి వేశాడు. కరెక్ట్‌గా తగిలింది.

మరిన్ని వార్తలు