ప్రచారంలో ముందున్నా హోరాహోరీ పోరేనా?

3 Dec, 2017 01:09 IST|Sakshi

అవలోకనం

గుజరాత్‌ ఎన్నికలలో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీకి పెద్ద ఓటర్ల పునాది ఉన్నా, అది సాగిస్తున్నది రక్షణాత్మక ప్రచారం. కాంగ్రెస్‌ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు.

ఊపందుకుంటున్న గుజరాత్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముందుకు వస్తున్న సమస్యలు ఏమిటి? ఇరవై రెండేళ్లుగా అధికార పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. అభివృద్ధి అంటే బీజేపీ, అది కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే అందించగలిగినది అన్న ట్టుగా, అది ఆ పార్టీకి కాపీ రైటున్న పదంలా అనిపిస్తోంది. బీజేపీ చేసేది ఏదైతే అది అభివృద్ధి, ఇతరుల పార్టీలు చేసేది అవినీతి, వంశపారంపర్య పాలన వగైరా. ఈ సూత్రీకరణ అతి సాదాసీదాది. కాకపోతే ఇలాంటి సూత్రీకరణ చేసిన బీజేపీని దాని ప్రత్యర్థులు తప్పించుకు పోనివ్వడమే విశేషం.  

ఒకవేళ బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడాలనే అనుకున్నా, అంటే గణాం కాలు, విధానాలు, ఆర్థిక, సామాజిక వృద్ధి వంటి అంశాలను చర్చించాలనే అను కున్నా... ఆ పార్టీ దృష్టి మరలింది. అది రాహుల్‌ గాంధీ మతం ఏదో తెలుసు కోవాలని అనుకుంటోంది. హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌ లభించినందుకు కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుందని ప్రధానమంత్రి అబద్ధమాడారు. అయినా దానికీ అభివృ ద్ధికి ఉన్న సంబంధం ఏమిటి? ఏమీ లేదనుకోండి. బీజేపీ తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంటే, ఈ ఎన్నికల్లో అసలు సమస్య ఏమిటనే దానిపైన సైతం కాంగ్రెస్‌కు స్పష్టత లేదు. లేదా బీజేపీకి అభివృద్ధిలా చెప్పుకోడా నికి దానికి ఒక్క అంశమైనా లేదు. కాంగ్రెస్‌ పార్టీ యువరాజు రాహుల్‌ గాంధీ ఒక రోజు రాఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన అవినీతి గురించి చర్చించాలనుకుంటే (దానికి మీడియా మద్దతు లభించలేదు), మరుసటి రోజు చర్చనీయాంశం జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. ఇలా దృష్టి కేంద్రీకరణ లోపించడానికి అర్థం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చెల్లా చెదురు సందేశాలను పంపుతున్నదనే.

రెండవది, సమస్యల తర్వాతది పార్టీ నిర్మాణం. ఈ విషయంలో బీజేపీ బలీయమైన శక్తి. ప్రజాస్వామిక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన  పార్టీలలో ఒకటి. అట్టడుగు స్థాయిలో సైతం ఆ పార్టీ ఉనికిలో ఉంది. లక్షలాదిమంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆ నిర్మాణాన్ని నడుపుతోంది. దానికి అంకితభావంగల, సుశిక్షితులైన వ్యక్తులున్నారు. ఇటీవలి కాలంలో వారు నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన నాయ కత్వంతో బాగా ఉత్తేజితులై ఉన్నారు. గుజరాత్‌లో జరగబోయేవి పోటాపోటీగా సాగే ఎన్నికలో కాదో తెలియదు. కానీ హోరాహోరీగా సాగే ఎన్నికలు వేటిలోనైనా బీజేపీకున్న నిర్మాణపరమైన శక్తులు విజయాన్ని సంపాదించి పెడతాయి.

మరోవంక, ఇది రెండు పార్టీల రాష్ట్రం కాబట్టి మనం కాంగ్రెస్‌ వైపు మాత్రమే చూడగలం. ఆ స్థాయి పోటీ అయితే కనబడటం లేదని అంగీకరించక తప్పదు. సేవాదళ్‌ లేదా యువజన కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన పాత కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇప్పుడు లేరు. ఆ నిర్మాణం విచ్ఛిన్నమైపోయింది. వ్యక్తిగత కాంగ్రెస్‌ అభ్యర్థులే పనిచేసే కార్యకర్తలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనికి చాలా డబ్బే ఖర్చవు తుంది. కానీ పార్టీ వరుసగా ఓడిపోతూ ఉండటంతో ఎన్నికల కోసం పెద్దగా డబ్బును పెట్టుబడిగా పెట్టగల నేతలు ఆ పార్టీలో ఎందరో లేరు.

ఇక సమస్యలు, నిర్మాణాల విషయానికి వస్తే, బీజేపీయే ముందుందని నా అభిప్రాయం. దాని బలం లేదా కాంగ్రెస్‌ బలహీనత లేదా ఆ రెండూ కూడా అందుకు కారణం కావచ్చు. మూడవది, ప్రచార వ్యూహం. డజన్ల కొద్దీ బహిరంగ సభలలో బీజేపీ తన అత్యంత శక్తివంతమైన పావు ప్రధాన మంత్రిని ప్రయో గించింది. చాలా ఏళ్లుగా, గుజరాత్‌లో సైతం హిందీలోనే ప్రసంగిస్తూ వస్తున్న ఆయన ఇటీవల గుజరాతీలో ప్రసంగించడం ప్రారంభించారు. నాకైతే అది, ఆయన తన సందేశాన్ని మరింత శక్తివంతంగా ఇవ్వాలనుకుంటున్నారనడానికి, అభిప్రాయ సేకరణలు చెబుతున్నదానికంటే హోరాహోరీ పోటీ జరుగుతుందని భావిస్తున్నారనడానికి సంకేతమేమోనని అనిపిస్తున్నది. మోదీ అసాధారణమైన ఉపన్యాసకులు, రాహుల్‌వల్ల కాని విధంగా ఆయన తన అజెండాను ప్రజల ముందు ఉంచగలరు. సుదీర్ఘంగా ఉపన్యసించేటప్పుడు ఆయన... సాధారణంగా పాత సమస్యనే కొత్త పద్ధతిలో ఎంత చక్కగా లేవనెత్తుతారంటే... మరుసటి రోజు పత్రికల్లో అది పతాక శీర్షికలకు ఎక్కక తప్పదు. ఉదాహరణకు, ‘నేను టీ అమ్ము కున్నానే కానీ  దేశాన్ని అమ్మేయలేదు’ అనే మాటనే తీసుకోండి. అలాంటి స్పష్టత, సరళత గల పద పొందిక గల నాయకుడు ఉండటం ఆ పార్టీకి వరం.

మరోవంక, కాంగ్రెస్‌ తన అజెండాను ప్రజల ముందుంచలేదు. అంతే కాదు, ఓ హాస్పిటల్‌లో అహ్మద్‌ పటేల్‌ ట్రస్టీగా ఉండటం తప్పా కాదా, రాహుల్‌ కాథలిక్కా కాదా అనే అనవసర సమస్యల్లో కూడా అది రక్షణ స్థితిలో ఉండక తప్పడం లేదు. అయితే కాంగ్రెస్‌ ఒక్క పనిని మాత్రం సమర్థవంతంగా చేసింది. మూడు అసమ్మతి బృందాలను సంఘటితం చేయగలిగింది. పాటీదార్లు, దళితులు, ఓబీసీ క్షత్రియులను అది ఐక్యం చేయగలిగింది. వారివి పరస్పర విరుద్ధమైన డిమాండ్లు. కాబట్టి ఇదేమీ సులువుగా చేయగల పని కాదు. అయినా కాంగ్రెస్‌ అ పని చేయ గలిగింది. ఇది ప్రధానంగా అహ్మద్‌ పటేల్‌ వల్లే జరిగిందని అని నా అంచనా. ఈ పరిణామం వల్ల బీజేపీ కలవరపడుతోంది. ఆ పార్టీ నేతలు చేసే పలు ప్రకటనల్లో, ప్రత్యేకించి  ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేసే ప్రకటనల్లో అది కనబడుతుంది.

బీజేపీని ఓడించడానికి ఇది సరిపోతుందా? అనేదే ప్రశ్న. అన్నిటికన్నా ఎక్కు వగా ఈ ఎన్నికలను నిర్ణయించేది పోలింగ్‌ శాతం ఎంత అనేదే. గుజరాత్, ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రం. అభిప్రాయ సేకరణల్లో బీజేపీ ముందున్నా, అది తన పునాది ఓటర్లు వచ్చి ఓటు వేసేట్టు చేయగలగాలి. అది సాగిస్తున్నది రక్షణా త్మకమైన ప్రచారం కాబట్టి అది ఏమంత తేలిక కాకపోవచ్చు. కాంగ్రెస్‌ ఓటర్ల పునాది చిన్నదే, అయినా వారు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఓటు వేయడానికి వస్తారని కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతుంది.
ఆ అర్థంలో గుజరాత్‌లో నిజమైన సమస్యలు ఉద్యోగాలు, అర్థవంతమైన ఆర్థికాభివృద్ధి. అధికార పార్టీ ఆ అంశాలపైనే పోరాడుతున్నట్టు నటిస్తున్నా, అవి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com

మరిన్ని వార్తలు