గట్టికోట వట్టికోట

5 Feb, 2019 01:13 IST|Sakshi

నిజాం రాచరిక పాలనను అంతమొందించేందుకు తన రచనలతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన ధీశాలీ, కమ్యూనిస్టు నేత, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, గ్రంథాలయోద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్నింటికీ మించి తెలుగులో రాజకీయ నవలకు ఆద్యుడు, గట్టికోట మన వట్టికోట ఆళ్వార్‌ స్వామి.  

వట్టికోట ఆళ్వార్‌ స్వామి నవంబర్‌ 1, 1915న  పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లా నకిరేకల్‌ దగ్గర చెరువు మాదారంలోని ఒక పేద వైష్ణవ కుటుంబంలో సింహాద్రమ్మ,రామచంద్రాచార్యులకు జన్మించాడు. తన పదకొండేళ్లకే తండ్రి మరణంతో కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయాడు వట్టికోట. అప్పటి నుంచి  ఒక ఉపాధ్యాయుడ్ని ఆశ్రయించి అతనికి వండి పెడుతూ అతని వద్దే విజ్ఞానాన్ని సముపార్జించి తన సాహిత్య ప్రస్థానం ప్రారంభించాడు. ఇండ్లల్లో వండిపెడుతూ విజయవాడలోని హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూనే ఇంగ్లీష్, ఉర్దూ భాషలపై  పట్టు సాధించాడు. ఇదే సమయంలో  పెద్ద ఎత్తున సాగుతున్న భారత స్వాతంత్య్ర సంగ్రామానికి వట్టికోట ఆకర్షితుడై  జైలుకెళ్లాడు.

ఆ తర్వాత 1933లో హైదరాబాద్‌ రావడం గోల్కొండ పత్రికలో ప్రూఫ్‌ రీడర్‌గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభకు తొలిసారిగా హాజరై 1944లో కమ్యూనిస్టు ఉద్యమంవైపు పయనం సాగిస్తూనే తెలంగాణ రైతాంగ  పోరా టంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1938లో హైదరాబాద్‌లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి సుమారు 800 మందిని సభ్యులుగా చేర్పించారు. దీని ద్వారా దాదాపు 35 పుస్తకాలను ప్రచురించారు. ప్రజల భాషను తన సాహిత్యంలో రుచి చూపించి, తెలంగాణ నుడికారాలతో ఎన్నో రచనలకు వట్టికోట పెద్దపీట వేశారు. ఆయన రచనల్లో నిబద్ధత, వాస్తవికత దాగి ఉంటుంది. ఆ కోవకి చెందిన ప్రముఖ తెలంగాణ రాజకీయ తొలి నవల ప్రజల మనిషి. ఆనాటి తెలంగాణలో రాచరిక వ్యవస్థ కారణంగా జాగీర్దార్, జమిందార్లు కష్టజీవులను ఏవిధంగా అణగదొక్కారో ఆ నవలలో వట్టికోట అక్షరాలతో బొమ్మకట్టారు. మరో మేటి నవల గంగులో 1940 తర్వాత తెలంగాణలో పరిస్థితులు ప్రత్యక్షమవుతాయి. తను అనుభవించిన జైలు జీవితాన్ని ఆధారంగా చేసుకొని జైలు లోపల కథలు రాశారు. 1948లో నిజామాబాద్‌ జైలులో దాశరథికి పోరాట పాఠాలు నేర్పుతూ,దాశరథి పద్యాలను జైలు గోడలపై రాసి జైలు అధికారితో దెబ్బలు తిన్నాడు. చివరగా ఫిబ్రవరి 5, 1961లో 46 ఏళ్ల ప్రాయంలోనే తుది శ్వాసవిడిచి తెలంగాణ సమాజానికి తీవ్ర శోకాన్ని మిగిల్చిపోయారు. ఆయన సాహిత్య కృషిని  స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పిద్దాం.                                      
-బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా
(నేడు వట్టికోట అళ్వార్‌ స్వామి వర్ధంతి)    

మరిన్ని వార్తలు