కపట సామర్థ్యం బట్టబయలు

6 Nov, 2018 00:48 IST|Sakshi

విశ్లేషణ

ఇన్నేళ్లూ భారతీయ జనతాపార్టీ, దాని వ్యూహకర్తలు ఒకవైపు, భక్తులు మరోవైపు మోదీ యొక్క అమోఘమైన పాలనా సామర్ధ్యం గురించి చెవులు దిబ్బళ్లు పడేలా ఊదరగొట్టారు. మన్మోహన్‌ సింగ్‌ చేతకానితనం వల్లనే ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయని, సరిహద్దులో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారనీ, ఆర్థిక వ్యవస్థ అడుగంటిందనీ ఇంకా అనేక జరిగిన, జరగని విషయాలకు ఆయన్ను ఆడిపోసుకున్నారు. మోదీ పాలన సామర్థ్యం వల్లనే గుజరాత్‌ ప్రగతి పథంలో పరుగులెత్తిందనీ ఊదరగొట్టారు. మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారానికి వస్తే అక్రమార్కుల ఆగడాలు ఎదుర్కొనే విక్రమార్కుడు అవుతాడని డప్పు కొట్టారు. ఎన్నికలయ్యాక మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు.  

దేశంలో నల్ల డబ్బు అంతా విదేశాల్లో ఉందనీ దాన్ని విమానాల్లో తీసుకురావటానికే  దేశదేశాలు తిరుగుతున్నట్టు నమ్మబలికారు. ఓ యాభై దేశాలు తిరిగాక హఠాత్తుగా జ్ఞానోదయం అయ్యింది. నల్ల ధనం అంతా ఈ దేశంలోనే ఉంది, ఆదాయపు పన్నుకట్టని వారి ఇళ్లల్లో దాగుందని నమ్మించారు. నోట్ల రద్దు అన్నారు. మీ సొమ్ము మీ కష్ట ఫలితం అయితే వెళ్లి బ్యాంకుల్లో మార్చుకోండి అన్నారు. 2016 నవంబరు డిసెంబరులో జరిగిన పరిణామాలు గుర్తు తెచ్చుకుంటే ఈ దేశ ప్రజలను మోసగించటం పాలకులకు ఎంత తేలికో అర్ధం అవుతుంది.   ఈ మధ్యలోనే అటు క్యాబినెట్‌ను ఇటు పార్లమెంట్‌ను తడిసిన మతాబులా మార్చేశారు. సుప్రీం కోర్టు తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ సమయం లో రాఫెల్‌ వివాదం రాజుకుంది. సీబీఐని దాని ప్రతిష్టను దుంపనాశనం చేస్తే తప్ప మోదీ ఈ వివాదం నుండి బయటపడలేరు. అందుకే సీబీఐ వర్సెస్‌ సీబీఐ అనే ఆటకు తెర తీశారు. దర్శకత్వం జాతీయ భద్రతా సలహాదారు. ఈ మొత్తంలో సీబీఐ మీద ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తే తప్ప దాని ద్వారా నిగ్గు తేలే నిజాలు నమ్మశక్యం కానివన్న వాదన ప్రజలకు చేరదు. ఈ లక్ష్యం కోసం సీబీఐని దాని అధిపతి వర్మను పణంగా పెట్టారు. ఈ క్రమంలో అదే సీబీఐలో పనిచేస్తున్న మోదీ ఉప్పుతిన్న అధికారి ఆస్థానాను పావుగా ఉపయోగించుకున్నారు. ఆయనకు మద్దతుగా ఆరెస్సెస్‌ కరసేవకులు రంగ ప్రవేశం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. గత్యంతరం లేని ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అర్ధరాత్రి డ్రామాకు ముందు అక్టోబరు 24న మోదీకి కళ్ళు చెవులుగా పనిచేసే జాతీయ భద్రతా సలహాదారుని కలవాల్సిందిగా ఆలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్థానాలకు కబురు అందింది. ఇద్దరూ  దోవల్‌ ను కలిశారు. కానీ అక్కడ రాకేష్‌ ఆస్థానాను కేసుల నుండి తప్పించాలన్న కొరికనో లేదా రాఫెల్‌పై దర్యాప్తు వద్దన్న కోరికనో వర్మ ఒప్పుకోకపోయినందునే సాయంత్రం కేంద్ర విజిలెన్స్‌ సంఘానికి పురమాయింపులు వచ్చాయని భావించటానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ఆ ముగ్గురు రహస్య సమావేశంలో ఏం మాట్లాడారు అన్నది కనీసం సుప్రీంకోర్టు కన్నా నివేదిస్తారా లేదా అన్నది చూడాలి. ఇలాంటి పరిణామాల నేపధ్యంలోనే అర్ధరాత్రి బలవంతంగా అధికారులకు సెలవు చీటీలు చేతిలో పెట్టారు. ఇవన్నీ మోదీ ఉక్కుమనిషి అన్న మేకప్‌ కోసమే తప్ప మరోటి కాదు. గత నాలుగేళ్లుగా ఢిల్లీ అధికార వర్గాల్లకు నిద్ర కరువైంది. ఒక సీనియర్‌ విలేఖరి ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతి మంత్రి నివాసంలోనూ కార్యాలయంలోనూ ఒక్కో కొత్త వ్యక్తి వచ్చి చేరాడు. అతని పనల్లా సదరు మంత్రిని, మంత్రిత్వశాఖ అధికారులను ఎవరెవరు ఎన్నెన్నిసార్లు కలుస్తున్నారు అన్నది 7 రేస్‌ కోర్స్‌ రోడ్‌కు, నాగపూర్‌కు నివేదిక పంపటమే. ఇలాంటి చర్యలన్నీ తినను తిననివ్వను అన్న ఇమేజిని కాపాడుకునే ప్రయత్నమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తిరుగుబాటు బావుటాతో మోదీ ఉక్కు మనిషి అన్న వాదనలో పస లేదని తేలిపోయింది. సిబీఐ వ్యవహారంతో మోదీ సామర్థ్యం రాజుగారి కొత్త బట్టల సామెత అని రుజువయ్యింది. ఈ తాజా పరిణామాల నేప«థ్యంలో నోరు తెరిస్తే మరింత అభాసుపాలుకావాల్సి వస్తుం దని ఆయన మౌన ముద్ర వహిస్తున్నారు. ఇలాంటి కపట సామర్థ్యాలతో దేశాన్ని కాపాడుకోగలమా  అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలదే.

వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు
మొబైల్‌ : 98717 94037
కొండూరి వీరయ్య

మరిన్ని వార్తలు