నోట్ల రద్దు మోసం ఇక చెల్లదు!

7 Nov, 2017 01:15 IST|Sakshi

రెండో మాట

ఎన్నికల సంస్కరణలకు వ్యతిరేకం కాదని చెబుతూనే, ఈ భారీ ఆస్తులు పెరగడానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావటం లేదని సుప్రీం విమర్శించింది. ఎన్నికల్లో చలామణి అవుతున్న ‘కానరానంత దొంగ డబ్బును పట్టుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంద’నీ, కనుకనే ఈ నల్లధనాన్ని అదుపు చేయడానికే ‘నోట్ల రద్దును, వస్తు–సేవలపై దేశవ్యాపిత పన్నుల విధానాన్ని’ రూపొందించామని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం చెబుతున్నది.

‘మోదీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోంది. ఆకస్మికంగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కోలుకోలేని ఆర్థిక విపత్తుకు దారితీస్తోంది. పేదరికాన్ని చాలా దగ్గర నుంచి చూశానని ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడా పేదరికాన్ని భారత ప్రజలు స్వయంగా అనుభవించేలా చేసేందుకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. రంగాల వారీగా ముఖ్యంగా పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పరిస్థితి దుర్భరంగా మారింది. వస్తు–సేవారంగాలపై భారీగా తలపెట్టిన సామూహిక పన్ను పెంపుదల విధానం (జీఎస్టీ) దేశ వస్తూత్పత్తుల వృద్ధి రేటునే దిగజార్చింది.’ – యశ్వంత్‌ సిన్హా (27–9–17), బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి

‘పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, లంచగొండితనం, అక్రమ వ్యాపార లావాదేవీలు అన్నీ రద్దవుతాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఇందుకు నిదర్శనం వరల్డ్‌ బ్యాంక్‌ తాజా నివేదిక అంచనా. నవంబర్‌ 8వ తేదీన (పెద్ద నోట్ల రద్దు నిర్ణయం) భారత ఆర్థిక వ్యవస్థకు దుర్దినంగా, విచారకరమైన రోజుగా జరిపేందుకు ప్రయత్నిస్తున్న వారికి, అక్రమ నిల్వలదారులకు, నల్లధనం కుబేరులకు దేశప్రజలు సమాధానం చెబుతారు.’
– నరేంద్ర మోదీ

దాదాపు పద్దెనిమిది రాజకీయ పక్షాలు, ఇతర సామాజిక కార్యకర్తలు పాటించబోతున్న ఆ దుర్దినం (నవంబర్‌ 8) రానే వచ్చింది. బీజేపీ పరివార్‌ అన్నా, ప్రధాని మోదీ అన్నా బొత్తిగా పడని పలు ప్రతిపక్షాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల పట్ల ఆందోళన చెందడం లేదు. నవంబర్‌ 8, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, జూలై, 2017 నుంచి అమలులోకి తెచ్చిన జీఎస్టీ పేరిట రుద్దిన భారీ పన్నుల విధానాన్ని పలువురు బీజేపీ పరివార్‌ నేతలు, తల నెరసిన ఆర్థికవేత్తలు కూడా మొదటిసారిగా వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. యశ్వంత్‌ సిన్హాతో పాటు, మరో బీజేపీ ప్రముఖుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రఖ్యాత పత్రికారచయిత అరుణ్‌శౌరి, ప్రసిద్ధ నటుడు శత్రుఘ్న సిన్హా, ఆ పార్టీ అనుబంధ సంస్థలు, ముఖ్యంగా మాజ్దూర్‌ సంఘ్‌ నాయకులు కూడా మోదీ విధానాలను వ్యతిరేకించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయడానికి ఉద్దేశించినదని ఏడాది క్రితం చేసిన ప్రకటన వల్ల ఒరిగింది శూన్యమని శత్రుఘ్న సిన్హా చెప్పారు. ఇటీవల క్లిష్టతరంగా తయారైన చిక్కురు ఒక్కురు పన్నుల విధానం వల్ల లాభపడినవారు చార్టర్డ్‌ అకౌంటెంట్ల ద్వారా బడా కంపెనీల చిఠా ఆవర్జాల తప్పుడు లెక్కలు చూపించే సంపన్న వర్గాలేనని కూడా ఆయన ఆరోపించారు.

అవినీతి నిర్మూలన పేరుతో నాటకం
అయినా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని వాదించగల మోదీ, నల్లధనంపైనా, లంచగొండితనంపైన తాను ప్రారంభించిన దాడిని ఆపేది లేదని చెబుతున్నారు. మరింత గుప్త సంపదను, ఆస్తులను, పెట్టుబడులను వెలికి తీస్తానని హిమాచల్‌ప్రదేశ్‌ తాజా పర్యటనలో ప్రగల్భించారు (5–11–17). ఆయన మాట్లాడుతున్నది కేవలం కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం గురించేననిపిస్తుంది. మూడున్నర సంవత్సరాలలో దేశంలోను, విదేశాలలోను మేటలు వేసుకున్న 24 లక్షల కోట్ల రూపాయలను (స్విస్, పనామా బ్యాంకుల నుంచి) తీసుకు వస్తానని మోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ నేటి దాకా చిల్లి గవ్వ కూడా దేశ ప్రజలు, బ్యాంకులు చూడలేదు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీల సభ్యులు, మంత్రుల అక్రమ చర్యలకూ, సామాజికులపై తలపెట్టే నేరాలకూ వారిని శిక్షించి జైళ్లకి పంపిన ఉదాహరణ ఇంతదాకా లేనేలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, నిబద్ధత విషయంలో వాటికీ మనకీ ఉన్న తేడా తెలుస్తుంది.

మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను లంచగొండితనం ఆరోపణలతో ఆ దేశ సుప్రీంకోర్టు పదవి నుంచి తప్పించింది. కొందరు రాజకుమారులను, మంత్రులను, కొందరు బడా వ్యాపారవేత్తలను సౌదీ అరేబియా ప్రభుత్వం పదవులనుంచి తప్పిం చింది. అరెస్టు చేయించింది. అటు ఒక రాజరిక వ్యవస్థలోను, ఇటు ఒక పౌర ప్రభుత్వ హయాంలోను కూడా అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న స్పందన చూస్తుంటే మన ప్రజాస్వామ్య రాజకీయ పాలకుల నిబద్ధత అవమానకరమనిపిస్తుంది. 1990ల నాటి టెలికాం కుంభకోణంలో కాంగ్రెస్‌ మంత్రి సుఖ్‌ రామ్‌ విషయంలో తప్ప మరే సీనియర్‌ మంత్రినీ కొరత వేసిన ఉదాహరణలు లేవు. కానీ సుఖ్‌రామ్‌ కొడుకు పదవి కోసం పెదవి మడతపడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో, ‘అవినీతి’ తొలగిపోయినట్టుగా మోదీ భావించడం విడ్డూరం కాదా?! ధనబలం, వారసత్వ రాజకీయాలు రాజకీయ న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయనీ, ఈ కాలుష్యంలో రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన రాజకీయ సమానత్వం దెబ్బ తింటున్నదనీ, ప్రజా బాహుళ్యానికి న్యాయం చేయడంలో మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ సుప్రీం న్యాయమూర్తి చలమేశ్వర్‌ ఇటీవలే (16.9.17న అలహాబాద్‌) పేర్కొన్నారు.

రాజ్యాంగ లక్ష్యాలకు నీళ్లు
రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ తారుమారు చేసే ప్రక్రియలో బీజేపీ పాలకులున్నారు. ఎన్నికల నామినేషన్‌ల ఘట్టంలో పార్టీల అభ్యర్థులు కమిషన్‌కు చూపే ఆస్తులు 500 శాతం మేరకు ‘హనుమంతుడి తోకలా’ ఎలా పెరిగిపోయాయో గుర్తు చేస్తూ, ఈ అసాధారణ సంపాదన గురించి ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టలేదని సుప్రీంకోర్టు (6.9.17) విమర్శించింది. ఎన్నికల సంస్కరణలకు వ్యతిరేకం కాదని చెబుతూనే, ఈ భారీ ఆస్తులు పెరగడానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావటం లేదని సుప్రీం విమర్శించింది. ఎన్నికల్లో చలామణి అవుతున్న ‘కానరానంత దొంగ డబ్బును పట్టుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతోంద’నీ, కనుకనే ఈ నల్లధనాన్ని అదుపు చేయడానికే ‘నోట్ల రద్దును, వస్తు–సేవలపై దేశవ్యాపిత పన్నుల విధానాన్ని’ రూపొందించామని మోదీ, షా ద్వయం చెబుతున్నది. కానీ ఆచరణలో అనేక దేశాల్లో విఫలమైన జీఎస్టీని యూపీఏ హయాంలో అడ్డుకుని మరీ తమ హయాంలో ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో బీజేపీ ఈనాటికీ చెప్పలేదు.
 
ప్రజాస్వామ్య సంస్కరణల అమలు తీరుతెన్నులపై విచారణ జరిపే జాతీయ సంస్థ సర్వే ప్రకారం 2012–2016 మధ్య దేశంలోని ఐదు జాతీయ పార్టీలకు (రూ. 20 వేలు ఆ పై) అందిన విరాళాల మొత్తం రూ. 1,070.68 కోట్లు. కాగా ఇందులో 89 శాతం విరాళాలు (రూ. 956.77 కోట్లు) కార్పొరేట్‌ రంగం నుంచి, వ్యాపార సంస్థల నుంచే అందాయనీ, మళ్లీ ఇందులో కూడా 2,987 కార్పొరేట్‌ సంస్థల దాతల నుంచి బీజేపీ పొందిన మొత్తం రూ. 705.81 కోట్లనీ ఆ సంస్థ వివరాలిచ్చింది (17.8.17). అలాగే, 2016 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాల్లో 90 శాతం పార్టీ ఖజానాకి వెళ్లాయని వెల్లడైంది. అందువల్ల ధనికవర్గ వ్యవస్థలో ఈ ధనస్వామ్య పార్టీలు మనకు వినిపించే కోతలు, వేసే కూతలూ ప్రజాస్వామ్య రక్షణకు పనికిరావని గమనించాలి. అందుకే అందరికీ తెలిసిన సహజ ఆదాయ వనరులకు మించిన, పొంతనలేని సంపద కలిగి ఉండి విచారణ ఎదుర్కొంటున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులే తరచుగా తిరిగి అధికారంలోకి వస్తున్నారని సుప్రీం ధర్మాసనం (12.9.17) పేర్కొన్నది. డజన్ల కొలదీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, 215మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలపై విచారించాలని వచ్చిన ‘లోక్‌ ప్రహరి’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది.

ఇదీ మోదీ సర్కారు నిర్వాకం
మన లంచగొండి, అవినీతికర రాజకీయ వ్యవస్థ ఇలా అభాసుపాలవుతున్న దశలోనే మోదీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ రంగ బ్యాంకులకు కార్పొరేట్‌ సంస్థలు బకాయిపడిన రూ. 10 లక్షల కోట్లనూ వసూలు చేసి ఆర్థిక వ్యవస్థకు పుష్టిని చేకూర్చాల్సింది పోయి, అందుకు భిన్నంగా నడుచుకుంటోంది. లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో, మరికొన్ని లక్షల కోట్ల రెవెన్యూ లోటుతో కునారిల్లుతున్న ప్రభుత్వం పబ్లిక్‌ రంగ బ్యాంకులను భారీ పెట్టుబడులతో సాకడానికి నిర్ణయించింది. ఉదాహరణకు, పెట్టుబడుల కోసం ప్రత్యక్ష పన్నుల భారాన్ని కార్పొరేట్, గుత్త సంస్థలపైన తగ్గించి, ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని పెంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ తేరుకోలేని సంక్షోభంలో కూరుకుంటుందని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’, ‘ది ఎకానమిస్ట్‌’ (లండన్‌) హెచ్చరించాల్సి వచ్చింది.

ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ అంతర్జాతీయ సంస్థలు అందించే సర్వేలు అంతర్జాతీయ గుత్త సంస్థల పెట్టుబడులకు మన దేశంలోని పాలక వర్గాలు అందించే సహాయ సహకారాలను బట్టి ఉంటాయి. వాటిని చూసి మనం ఇక్కడ ‘లొట్టలు వేస్తే’ గుండంలో పడిపోతాం. కొన్ని అంతర్జాతీయ సంస్థలు (సుమారు నాలుగు మాసాలనాడే) మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని ‘సంక్షోభం’గా చిత్రించిన సంగతి విస్మరించలేం. ఇంతలోనే మోదీకి అనుకూలంగా ప్రపంచ బ్యాంకు గొంతు మార్చడానికి కారణం–బ్యాంక్‌ ప్రతినిధులు మోదీతో సమావేశమైన తరువాత పరిణామమేనని భావించాలి. జాతీయోత్పత్తుల సగటు వృద్ధిరేటు విలువ 5.6 శాతానికి పడిపోతున్నట్టు, ఇది 2016–17లో నమోదైన వృద్ధి రేటేననీ, కనుక మన దేశం వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నమోదు చేయలేమనీ డి.కె. శ్రీవాస్తవలాంటి ఆర్థిక సలహాదార్లు (ఇ.వై. ఇండియా) పేర్కొంటున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు పుంజుకునేందుకు మోదీ ఇటీవల ప్రకటించిన ‘పెట్టుబడుల సమీకరణ’ పద్ధతి ఎలా ఉందంటే, ‘తిని పడేసిన ఖాళీ టిఫిన్‌ డబ్బాలను పోగేసుకొనే యత్నం’గా ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ ఎగతాళి చేసింది. బ్యాంకులనేవి డిపాజిటర్ల నుంచి సేవింగ్స్‌ను సేకరించి, వడ్డీతో అప్పులిచ్చే మధ్యవర్తులు మాత్రమేననీ చెప్పింది. అంతేగానీ మొండి బకాయిలను వసూలు చేయడం మధ్యవర్తుల వంతుకాదని సలహాలి చ్చింది. ఇక ప్రక్షాళన చేయడం అంటారూ, ఆ పని ‘పోగేయకుండా ఉపయోగించి వదిలేసిన టిఫిన్‌ బాక్సులను పోగేసుకొచ్చినంత పనికిమాలిన చెత్తపని’ అని ఎత్తి పొడిచింది. ఇందువల్లనే రేపటి దేశవ్యాప్త నిరసనకు అంత విలువ!


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు