వైద్య వివరాలు ఇవ్వకపోవడం నేరం

11 May, 2018 02:29 IST|Sakshi

విశ్లేషణ

ప్రయివేటు డాక్టరయినా ప్రభుత్వ డాక్టరయినా చికిత్సా వివరాల పత్రాలు ఇవ్వకపోతే వైద్యలోపం ఉందని భావిస్తారు. చికిత్సాపత్రాలు నిరాకరిస్తే అది వైద్యంలో నిర్లక్ష్యమే. వైద్యలోపానికి నష్టపరిహారం చెల్లించకతప్పదు. కేరళ హైకోర్టు రాజప్పన్‌ వర్సెస్‌ శ్రీ చిత్ర తిరునాల్‌ ఇన్సిటిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐ ఎల్‌ ఆర్‌ 2004 (2) కేరళ 150) కేసులో రోగుల సమాచార హక్కును చాలా స్పష్టంగా నిర్దేశించింది.‘‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌ 1.3.1 ప్రకారం  రోగ నిర్ధారణ, పరిశోధన, వాటిపైన సలహా, పరిశోధన తరువాత రోగ నిర్ధారణ జరిగితే ఆ వివరాలు, రోగికి ఇవ్వాలి.

రెగ్యులేషన్‌ చివర ఇచ్చిన మూడో అనుబంధంలో పేర్కొన్న  ప్రకారం కేస్‌ షీట్‌ ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తి మరణిస్తే అన్ని కారణాలు తెలియజేసే వివరాలు అందులో ఉండాలి, డాక్టర్‌ ఏ మందులు ఎప్పుడు వాడాలో నర్సింగ్‌ సిబ్బందికి చెప్పిన సూచనలు కేస్‌ షీట్‌లో తేదీల వారీగా ఉండాలి. చికిత్స వివరాలు చాలా సమగ్రంగా ఉండాలి. రోగి గానీ అతని బంధువులు గానీ మెడికల్‌ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో మొత్తం కేస్‌ షీట్‌ తదితర వివరాలు అందించాలి. ఈ రెగ్యులేషన్‌ల ద్వారా రోగికి తన రికార్డు కోరే హక్కును చట్టం గుర్తించింది. పొందే మార్గాలను కూడా నిర్దేశించింది.’’

రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్‌ ప్రాక్టీషనర్‌కు ఏ మినహాయింపూ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేస్‌ షీట్, మూడో అనుబంధపు వివరాలతో పాటు సంబంధిత  పత్రాలు ఇంకేమయినా ఉంటే వాటినీ ఇవ్వాలి.  ఏ చట్టంలోనూ దీనికి మినహాయింపు లేదనీ కనుక మొత్తం చికిత్స వివరాల ఫోటో కాపీలు ఇవ్వక  తప్పదని కేరళ హైకోర్టు వివరించింది. హాస్పటల్‌ ఇచ్చిన ఈ మెడికల్‌ రికార్డును తమకు వ్యతిరేక సాక్ష్యంగా రోగులు వాడుకుంటారని వైద్యశాల యజమానులు వాదించారు. కాని ఈ కారణంపై వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదని హైకోర్టు తెలిపింది.  ఒకవేళ వైద్యులు సక్రమంగా వైద్యం చేసి  ఆ వివరాలే నమోదు చేసి ఉంటే డాక్టర్లకు అది అనుకూల సాక్ష్యమవుతుంది. డాక్టర్లు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు సాక్ష్యంగా వాడుకోవలసిందే.

మంచి చికిత్స చేసిన వారు కేసులు వస్తాయని భయపడాల్సిన పనే లేదు. తప్పుడు చికిత్స నిరోధించాలంటే రోగులకు చికిత్సచేసిన వివరాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాల్సిందే. ఈ కేసులో న్యాయార్థికి తన కూతురికి చేసిన చికిత్సవివరాలు తీసుకునే హక్కు ఉందనీ, ఇచ్చే బాధ్యత డాక్టర్లపైన హాస్పటల్‌ పైన ఉందని హైకోర్టు వివరించింది. ఈ వైద్యవివరాలను నిరాకరించడం అంటే తన బాధ్యతానిర్వహణలో అది లోపమో నిర్లక్ష్యమో అవుతుందని అనేక హైకోర్టులు వినియోగదారుల హక్కుల న్యాయస్థానాలు వివరించాయి.

కన్హయ్యాలాల్‌ రమణ్‌ లాల్‌ త్రివేది వర్సెస్‌ డాక్టర్‌ సత్యనారాయణ విశ్వకర్మ (1996, 3 సి.పి.ఆర్‌ 24 గుజరాత్‌) కేసులో ఆస్పత్రి అధికారులు, వైద్యులు రోగికి రికార్డులు ఇవ్వలేదు. దీన్ని వైద్య లోపంగానూ, నిర్లక్ష్యంగానూ నిర్ధారించింది. వారు మెడికల్‌ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి కూడా నిరాకరించారు. నివేదికలను నిరాకరించడం వల్ల ఆ వైద్యులు అందించిన చికిత్సలో ప్రమాణాలు లోపించాయని భావించడానికి ఆస్కారం ఏర్పడింది. వారు రోగికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.

పైగా రికార్డులలో ప్రస్తావించవలసిన వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక హాస్పటల్‌ వారు కేస్‌షీట్‌లో అనస్థటిస్ట్‌ పేరును తమ ఆపరేషన్‌ నోట్స్‌లో వెల్లడించలేదు. ఆకేసులో ఇద్దరు అనస్థటిస్టులు రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఒకే రోగికి రెండు రకాల ప్రోగ్రెస్‌ కార్డులు ఉన్నాయని తేలింది. రెండు పత్రాలు విడిగా సమర్పించారు. దీన్ని బట్టి హాస్పటల్‌ వర్గాలు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీనాక్షి మిషన్‌ హాస్పటల్‌ అండ్‌ రిసర్చ్‌ సెంటర్‌ వర్సెస్‌ సమురాజ్‌ అండ్‌ అనదర్‌ [I(2005)  CPJ(NC)] కేసులో జాతీయ కమిషన్‌ తీర్పు చెప్పింది.
(కేంద్ర సమాచార కమిషన్‌ నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యరంగం పారదర్శకతపై రచ యిత సమర్పించిన పరిశోధనా పత్రంలో భాగం).

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌,  కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు