కోర్టులో నామకరణం

2 Oct, 2023 05:58 IST|Sakshi

కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక  ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు.

తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్‌ సర్టిఫికెట్‌లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్‌లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్‌ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు.

భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు.

మరిన్ని వార్తలు