అధిక రైతాంగం తిరోగమన సంకేతం

21 Jul, 2020 00:41 IST|Sakshi

సందర్భం

సేద్యంలోనే స్వేదం చిందిస్తున్న 70 కోట్ల మంది కలిగిన రైతు రాజ్యం భారతావని. 40 కోట్ల ఎకరాల సువి శాల సాగుక్షేత్రం. ప్రతీఏటా 28.5 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న సుఫల ధరిత్రి. జీడీపీలో 16.5 శాతం వాటా కలిగిన వ్యవసాయ ప్రభావ ఆర్థిక వ్యవస్థ. ఈ గణాంకాలు చూస్తే వ్యవసాయ రంగంలో భారతదేశం అద్భుతం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ ఎక్కువ మంది రైతులు, ఎక్కువ సాగుభూమి, జీడీపీలో ఎక్కువ శాతం వ్యవసాయం వాటా... ఈ లెక్కలన్నీ వాస్తవానికి తిరోగమన సంకేతాలు. 

జంతువుల మాదిరిగానే, ఒకప్పుడు మానవులకు కూడా ఆహార అన్వేషణలోనే కాలమంతా గడిచేది. కానీ, మానవ జీవితం అక్కడే ఆగిపోలేదు. ఆహారం సంపాదించడానికే మొత్తం కాలం, శ్రమ ఖర్చు చేయడం లేదు. చాలా దేశాలు తమకు కావల్సిన తిండిని ఉత్పత్తి చేసుకుంటూనే, జేబులు నింపే మరో పని చేసుకుంటున్నాయి. కానీ కొన్ని సమాజాలు మాత్రం ఆరంభ దశలోనే ఆగిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితానుంచి బయట పడడం లేదు. అలాంటి కొన్ని దేశాల జాబితాలో భారతదేశం ఉండడం ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత వైఫల్యం. 

1950 దశకంలో నోబెల్‌ బహుమతి గ్రహీత ఆర్థర్‌ లూయిస్‌ ప్రతిపాదించిన ‘నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల నుంచి ద్వితీయ, తృతీయ రంగాలుగా పేర్కొన్న పారిశ్రామిక, సేవారంగాలకు ఎంత ఎక్కువ మంది బదిలీ కాగలిగితే ఆ దేశాలు అంత తక్కువ సమయంలో వృద్ధి చెందుతాయని ఆ సిద్ధాంతం తేల్చి చెప్పింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్‌ ఇలా పరివర్తన చెందినవే. ఫోర్‌ ఏసియన్‌ టైగర్స్‌గా పేరొందిన హాంగ్‌ కాంగ్, సింగపూర్, సౌత్‌ కొరియా, తైవాన్‌ ఈ థియరీని అనుసరించి, కేవలం 30 ఏళ్లలో (1960–90) తమ స్థితిని అమాంతం మార్చుకున్నాయి. భారతదేశంలో సగానికిపైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతుంటే, అమెరికాలో కేవలం 0.7 శాతం మంది, జపానులో 3.9, జర్మనీలో 2.4, ఇంగ్లండులో 1.4, రష్యాలో 5.9 శాతం మంది మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. మనలాంటి దేశమే అయిన చైనాలో 26 శాతం, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయిల్‌లో 2 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయం మీదనే ఆధారపడిన మిగతా జనమంతా పారిశ్రామిక, సేవా రంగాలకు మారి వ్యక్తిగతంగా బాగుపడ్డారు. దేశాలు బాగుపడ్డాయి. 

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, భారతదేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 16.5 శాతమైతే, అమెరికాలో అది 0.9 శాతం. చైనాలో 7.9, జపానులో 1.1, జర్మనీలో 0.7, ఇంగ్లండులో 0.7, రష్యాలో 3.55, ఇజ్రాయిల్లో 2.4 శాతం వ్యవసాయ రంగం వాటా. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉన్నప్పటికీ ఈ దేశాలన్నీ ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి కలిగిన దేశాలు. ఆయా దేశాలు వ్యవసాయాన్ని తమకు తిండి పెట్టే రంగంగా, మిగతా రంగాలను ఆర్థికంగా శక్తినిచ్చే రంగాలుగా చూస్తున్నాయి. కానీ భారతదేశంలో రెండింటికీ వ్యవసాయమే దిక్కయింది. తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామీకరణకు తరలించడం సాధ్యమయ్యే పనికాకపోవచ్చు. అందుకే వ్యవసాయాధారిత పరిశ్రమలను పెంచే పని వేగం అందుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు స్థాపించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ఆలోచన అందులో భాగంగానే కనిపిస్తున్నది.

నిర్మాణాత్మక పరివర్తన ఆర్థిక సిద్ధాంతం అమలు చేసి తీరాలని భారతదేశంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. నెహ్రూ నాయకత్వంలో రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం కూడా వేగవంతమైన పారిశ్రామికీకరణే. కానీ వేర్వేరు కారణాల వల్ల ఆ స్ఫూర్తి కొనసాగలేదు. దేశంలో ఆహార కొరత ఏర్పడి, హరితవిప్లవం అత్యవసరం అయిపోయి, పారిశ్రామికీకరణ ఆశించిన వేగం అందుకోలేదు.  హరిత విప్లవం కారణంగా దేశంలో ఉత్పత్తి పెరిగింది కానీ, ఉత్పాదకత పెరగలేదు. పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిన దేశాలే వ్యవసాయ రంగంలోనూ ఉత్పాదకతను బాగా పెంచుకోవడం గమనించదగ్గ విషయం. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించిన వివరాలు భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత డొల్లతనాన్ని బయట పెడుతున్నవి.

భారతదేశంలో 40 కోట్ల ఎకరాల్లో ఏటా 285 మిలియన్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించగలుతున్నారు. కానీ మనలాంటి వాతావరణ పరిస్థితులే కలిగిన చైనాలో కేవలం 38 కోట్ల మంది రైతులు, 34 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో ఏటా 571 మిలియన్‌ టన్నుల పంట పండిస్తున్నారు. దేశంలో ఎకరానికి ఏడాదికి సగటున 17.8 క్వింటాళ్ల వరిధాన్యం పండిస్తే, చైనాలో 28.4 క్వింటాళ్లు పండిస్తున్నారు. అమెరికాలో 34.8, జపాన్‌లో 26.7, రష్యాలో 20 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. వరి, గోధుమ లాంటి తిండి గింజలు, పప్పుల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంటే, ఉత్పాదకతలో మాత్రం 38వ స్థానంలో ఉన్నది.

సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలప్మెంట్‌ సొసైటీస్‌ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో తాము విధిలేక వ్యవసాయం చేస్తున్నామని 65 శాతం మంది రైతులు చెప్పారు. అవకాశం వస్తే మరో రంగంలోకి పోతామని 62 శాతం మంది రైతులు చెప్పుకున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేయడం కన్నా పట్టణాలకు పోయి కూలీ చేసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని 69 శాతం మంది వెలిబుచ్చారు. మరో అవకాశం వస్తే వెళ్లిపోతామని రైతులూ అంటున్నారు, ఇది దేశానికీ అవసరం కాబట్టి భారతదేశంలో కొత్త వృత్తుల సృష్టి జరిగి తీరాలి. అందరూ ఒకే పంట వేయడం ఎట్ల లాభదాయకం కాదో, అందరూ ఒకే పనిలో ఉండడం కూడా ప్రయోజనకరం కాదు. చైనాలో కేవలం పదేళ్ల కాలంలోనే వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్యను 70 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు. ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్దేశించుకునే లక్ష్యాల్లో వ్యవసాయ రంగం నుంచి ఈసారి ఇంత మందిని ఇతర రంగాలకు తరలించాలనే లక్ష్యం కూడా ఉండి తీరాలి. పారిశ్రామిక, సేవా రంగాల్లో వచ్చే గణనీయ ఆదాయంలో కొంత భాగాన్ని (క్రాస్‌ సబ్సిడీగా) వ్యవసాయ రంగాభివృద్దికి ఉపయోగించడం ఉత్తమ ఆర్థిక విధానం అవుతుంది. దేశ రక్షణ బాధ్యతల్లో ఉండే సైనికుల సంక్షేమం మాదిరిగానే, ప్రజల ఆహార భద్రత బాధ్యత నిర్వరిస్తున్న రైతు సంక్షేమం అమలు కావాలంటే కూడా ఇతర రంగాల పురోగతి తప్పనిసరి.

వ్యాసకర్త
గటిక విజయ్‌కుమార్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత ప్రజా సంబంధాల అధికారి
Vijaynekkonda@gmail.com 

మరిన్ని వార్తలు