కొత్త ఉపద్రవం

1 Feb, 2018 01:07 IST|Sakshi

జీవన కాలమ్‌
బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్యమాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. 

దావోస్‌లో జరుగుతున్న సర్వదేశ సమ్మేళనంలో సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ కొద్దికాలంలో మానవుడు 140 సంవత్సరాలు జీవించబోతున్నాడని సోదాహరణంగా వక్కాణించారు. ఇది మానవాళి మీద పెద్ద గొడ్డలిపెట్టు. మా చిన్నతనంలో ఏదైనా అనర్థం జరిగినప్పుడు మా నాయనమ్మ అంటూండేది: ‘ఈ ఘోరాలు చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను. నన్ను త్వరగా తీసుకుపో దేవుడా!’ అని. ఇది తేలికగా 70 సంవత్సరాల కిందటిమాట. ఇప్పటి మనుషులు 140 ఏళ్లు బతకబోతున్నారు.

రోజుకి లక్షల గాలన్ల చమురును తవ్వుకుంటున్న నేపథ్యంలో భూమిలో చమురు నిల్వలు మరో 22 సంవత్సరాలలో పూర్తిగా నిండుకుంటున్నాయి. మనం ఇప్పుడే తాగే మంచినీళ్లని కొనుక్కుంటున్నాం. అచిరకాలంలో పీల్చే గాలిని కొనుక్కోవలసిన రోజులు వస్తాయని ఒక శాస్త్ర జ్ఞుడు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఇప్పటిలాగ విరివిగా వాడుకోడానికి నీరు దొరకదు. స్నానానికి బదులు రసాయనాలతో ఒళ్లు శుభ్రం చేసుకునే ప్రత్యా మ్నాయ ధోరణులు వస్తాయన్నారు. ధృవాలలో మంచు కరిగిపోతోంది. ఈ సీజనులోనే ఒక హరియాణా రాష్ట్ర మంత మంచు శకలం కరిగి సముద్రంలోకి దూసుకు వచ్చిందట. ఇది ఒక పార్శ్వం.

ఈ మధ్య అమెరికాలో ఉద్యోగం చెయ్యని పిల్లలు లేని కుటుంబాలు లేవు. లక్షల ఆస్తి ఉన్న, పోస్టు మాస్ట ర్‌గా రిటైరయి పెన్షన్‌ తీసుకుంటున్న ఒకాయన తమ కూతురు అమెరికాలో 40 ఏళ్లుగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోతూంటే– ఆయన వృద్ధాశ్రమంలో కాలం చేశారు. ఒక దశలో సంపాదనకి విలువ పోయి, జీవితం యాంత్రికమై, తమ పిల్లలు– బంధువులకీ, భాషకీ, భారతీయ జీవన విధానానికీ దూరమై బతుకు తూంటే– నిస్సహాయంగా ఆత్మవంచన చేసుకుంటు న్నారు. ఇది మరొక పార్శ్వం.

ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులనే ఖాతరు చేయ కుండా–ఓ సినీమాలో లేని అభ్యంతరాలని, లేవని నిరూపించినా–మారణ హోమాన్ని సృష్టించే గూండాలు, వారి అకృత్యాలకు భయపడి.. సుప్రీంకోర్టు అదిలించినా చేష్టలుడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు, పరీక్షలు వాయిదా కోసం హత్య అవసరమని భావించే హింసాత్మకమైన ‘ఆలోచన’లకి పసితనంలోనే పునాదులు పడుతున్న విష సంస్కృతి, చదువుకోలేదని గదమాయించిన టీచర్ని కాల్చి చంపిన విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ దశ లోనూ కోట్లు నొల్లుకునే ‘నీచపు’ ఆఫీసర్ల ఉద్యోగుల వీర విహారం– ఇది మరొక పార్శ్వం.

సరే. 140 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ప్రతీ పౌరుడికీ కనీసం రెండు హత్యలు–సజావయిన కారణాలకు చేసుకునే రాయితీని ప్రభుత్వం కలిగిం చవచ్చు. లల్లూ వంటి మహా నాయకుల ఆరో తరం మునిమనుమడు–ప్రతీ మనిషీ తన జీవితంలో 570 టన్నుల గడ్డి తినే అనుమతిని కల్పించవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా మోసుకుతిరిగే ఆక్సిజన్‌ సిలిండర్ల దొంగ తనం చేసి అమ్ముకునే వ్యాపారాలు దావూద్‌ ఇబ్రహీం ఏడో తరం వారసుడు ప్రారంభించవచ్చు. ఏ భక్తుడైనా తన జీవితకాలంలో తనకు నచ్చిన మూడు క్షేత్రాలలో క్షుద్ర పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు–సాలీనా కనీసం 120 కోట్లు భక్షించవచ్చునని అనుమతిని ఇవ్వవచ్చు.

తన ఆరో తరం ముని మనుమడు చదువుతో హింసి స్తున్న బడిపంతుల్ని క్లాసులో బాంబు పెట్టాలనుకుంటు న్నట్టు 120 ఏళ్ల ముత్తాతకి తెలిస్తే–రెండు హత్యలకు రాయితీ ఉన్న ఈ మనుమడు–తాతని పొడిచి చంపవచ్చు. గూండాలు నాయకులవొచ్చు. హంతకులు ప్రవచనాలు చెప్పవచ్చు. సెక్స్‌ కథలు పాఠ్య పుస్తకాలలోనే చోటు చేసు కోవచ్చు. సాయంకాలం పార్కుల్లో కనిపించే ముసిలి గుంపుల లక్ష్యం ‘ఆరోగ్యం’ కాదు– ఇంట్లో వారి చాద స్తాన్ని భరించలేని పిల్లలు, కోడళ్లూ కనీసం ఆ రెండు గంటలు విశ్రాంతికి వాళ్లకి కార్లిచ్చి తగలెయ్యడం. మరి 80, 100, 120, 130 సంవత్సరాల ముసిలి వొగ్గుల మాటే మిటి? వృద్ధాశ్రమాలు మాత్రమే కాక, ముసిలివారి ‘చాదస్త’ విముక్తి ఆశ్రయాలు కల్పిస్తారేమో!

ఇర్విన్‌ షా అనే ఆయన ‘బరీ ది డెడ్‌’ (Bury the Dead) అనే నాటిక రాశాడు. చచ్చిపోయినవాళ్లు చచ్చి నట్టు సమాధుల్లో ఉండక లేచి నిలబడ్డారు. ఎంత పెద్ద విపత్తు? ఎవరి బంధువులు వారి దగ్గరికి వచ్చి ‘చచ్చి నవారు చచ్చినట్టు’ ఉండటం ఎంత అవసరమో నచ్చ చెప్తారు. ఈ ఇబ్బంది ఇప్పుడు బతికున్నవారికి రాబో తోంది. బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్య మాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభు త్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. ఇందులో మళ్లీ దొంగదారిన అనుమతులు తెచ్చుకుని బతికేస్తున్నవారూ, లంచాలిచ్చి బతికేసేవారు...
‘అయ్యో దేవుడా! నన్ను ఎప్పుడు తీసుకు పోతావు!’ అని మా నాయనమ్మలాగా ప్రాధేయపడే రోజులు ముందున్నాయి.


 - గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు