జన మనోరథయాత్ర

6 Jan, 2019 00:42 IST|Sakshi

త్రికాలమ్‌

ఒకానొక చారిత్రక ఘట్టం ఈ నెల తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ విపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబర్‌ 6న ఆరంభించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇచ్ఛాపురంలో పెద్ద బహిరంగసభతో ముగియనున్నది. కన్యాకుమారి నుంచి కశ్మీరం వరకూ జరిగిన ఆదిశంకరుడి పాదయాత్ర వివరాలు మనకు అందుబాటులో లేవు. పాదయాత్రను ఒక సాధనంగా వినియోగించి విజయాలు సాధించిన తొలి ప్రజానాయకుడు మహాత్మాగాంధీ. దక్షిణాఫ్రికాలో బొగ్గుగని కార్మికులను సమీకరించి పోరుబాటలో నడిపించడానికి గాంధీజీ చేసిన ప్రయోగం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక విధానంగా స్థిరపడింది.

1930లో ఆయన ఆధ్వర్యంలో సాగిన దండి  సత్యాగ్రహం దేశప్రజల్లో ఐకమత్యానికీ, స్వాతంత్య్ర పోరాటం తీవ్రతరం కావడానికీ దోహదం చేసింది. అదే మంత్రాన్ని వినోబా భావే 1950 దశకంలో భూదానోద్యమం ప్రచారానికి జయప్రదంగా ఉపయోగించారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ జరిపిన పాదయాత్ర నడివయస్సులో ఉన్నవారికి గుర్తు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో హరిత విప్లవ సారథి సుందర్‌లాల్‌ బహుగుణ ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమానికి పాదయాత్రను వినియోగించుకున్నారు. ఏక్తాపరిషత్, స్వరాజ్‌ అభియాన్‌ వంటి సంస్థలు హక్కుల సాధనకోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

చంద్రశేఖర్‌ భారత్‌యాత్ర
రాజకీయ లక్ష్యంతో, ఎన్నికలకు ముందు ప్రజలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన పాదయాత్ర చేసిన తొలి నాయకుడు జనతాపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌. జయప్రకాశ్‌నారాయణ్‌ ఆశీస్సులతో ఆవిర్భవించిన జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, 1980 ఎన్నికలలో పరాజయం చెందిన తర్వాత కొన్ని మాసాలకే విచ్ఛిన్నమైపోయింది. అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీలు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. చరణ్‌సింగ్, దేవీలాల్, లాలూ ప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్‌యాదవ్, దేవెగౌడ వంటి నాయకులు వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. చంద్రశేఖర్‌ ఒంటరి. ఆ నేపథ్యంలో ప్రత్యా మ్నాయ రాజకీయాలకు అంకురార్పణ చేయాలన్న సంకల్పంతో ఆయన ‘భారత్‌ యాత్ర’ను ప్రారంభించారు.

కన్యాకుమారి నుంచి 4,260 కిలోమీటర్లు ఆరు మాసాలలో (జనవరి6–జూన్‌ 25, 1983) నడిచి రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించడంతో యాత్ర ముగిసింది. కానీ చంద్రశేఖర్‌కు రాజకీయ ప్రయో జనం ఏదీ ఆ సందర్భంలో కలగలేదు. 1967 నుంచి ఎంపీగా ఉండిన చంద్ర శేఖర్‌ భారత్‌యాత్ర అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్య కారణంగా వీచిన సానుభూతి పవనాల ఫలితంగా ఓటమి చవిచూశారు. అనంతరం 1990 నవంబర్‌లో ప్రధాని పదవి చేపట్టి 1991 జూన్‌ వరకూ కొనసాగారు కానీ దానికీ, పాదయాత్రకూ సంబంధం లేదు. ప్రధాని పదవిలో రాణించడానికి అవసరమైన వ్యవధి కూడా లభించలేదు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడానికి కానీ అమలు చేయడానికి కానీ అవకాశం లేకపోయింది.

1990లో బీజేపీ నాయకుడు అడ్వాణీ చేసిన 36 రోజుల రథయాత్ర దేశాన్ని కుదిపివేసింది. ఇది రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించే ప్రయత్నం. హిందువులను మతప్రాతిపదికపైన, బాబరీమసీదును తొలగించి రామాలయ నిర్మాణం జరిపించాలనే నినాదంపైన సంఘటితం చేసే ఉద్దేశంతో సాగిన యాత్ర. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉపయోగించిన రథాన్ని పోలిన వాహనంలో చేసిన యాత్రను బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ అడ్డుకున్నారు. అడ్వాణీని అరెస్టు చేయించారు. అయినా ఆ యాత్ర బీజేపీకి లబ్ధి చేకూర్చింది. 1984లో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ 1998 నాటికి అధికారంలోకి వచ్చింది. రాజీవ్‌ హత్య జరిగి ఉండకపోతే 1991 ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి ఉండేది.

హత్య కారణంగా ఎన్నికల రెండో ఘట్టంలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది. 1996 ఎన్నికల అనంతరం 13 రోజుల స్వల్పకాలం వాజపేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ అల్పాయుష్షు ప్రభు త్వాలకు దేవెగౌడ, గుజ్రాల్‌ సారథ్యం వహించారు. 1998 ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి వాజపేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంమీద  రథయాత్ర ఫలితంగా బీజేపీ బలం పుంజుకొని అధికారంలోకి వచ్చిందని భావించవచ్చు.  పూర్తిగా రాజకీయ, సామాజిక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, ప్రజలను కలుసుకొని వారి కంట నీరు తుడిచే ఉద్దేశంతో సాగిన పాదయాత్ర వైఎస్‌ రాజ శేఖరరెడ్డి 2003లో చేసిన ‘ప్రజాప్రస్థానం.’

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆరంభించి ఇచ్ఛాపురం వరకూ 64 రోజులపాటు 1,470 కిలోమీటర్లు సాగిన యాత్రలో అన్ని వర్గాల,  కులాల, మతాల ప్రజలనూ కలుసుకొని వారి వెతలు వినే అవకాశం నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ఆర్‌కి దక్కింది. పేదప్రజలూ, నిరుద్యోగులూ, మైనారిటీలూ, దళితులూ, ఆదివాసులూ చెప్పిన అనేక సమస్యలను అవగాహన చేసుకొని వాటికి పరిష్కారాలు ఆలోచించి నిర్దిష్టమైన రూపం ఇచ్చే సావకాశం ఆయనకు లభించింది. 2004 ఎన్నికలలో విజయం సాధించాక ఆయన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. జలయజ్ఞం వంటి  బృహత్తరమైన  కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. విద్య, ఆరోగ్య రంగాలలో వినూత్నమైన పథకాలు తెచ్చింది.

పార్టీలకూ, ప్రాంతాలకూ అతీతంగా ప్రజలందరికీ పథకాల ఫలాలు అందే విధంగా అమలు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఆ పథకాల ఫలితంగానే 2009లో మహాకూటమిని ఒంటరిగా ఎదుర్కొని వైఎస్‌ఆర్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2009 సెప్టెంబర్‌ 2న ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. వైఎస్‌ఆర్‌ స్థానంలో రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. 2012 అక్టోబర్‌ 2న టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 208 రోజులపాటు సుమారు 2,800 కిలోమీటర్లు నడిచి 2013 ఏప్రిల్‌ 27న యాత్ర ముగించారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ గెలిచింది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు జరిపిన పాదయాత్రలు ఫలించాయి. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పక్షం రోజులకు, 2012 అక్టోబర్‌ 18న వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిల ఇడు పులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర మొదలు పెట్టారు. 2013 జులై 29 వరకూ 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల దూరం నడిచి కొత్త రికార్డు నెలకొల్పారు. జగన్‌ జైలులో ఉన్న కారణంగా ఆయన చెల్లెలు అన్నకు సంఘీభావ సూచనగా ‘మరోప్రజాప్రస్థానం’ పేరుతో ఈ పాదయాత్ర చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ విజయావకాశాలు పెంపొందించడమే తప్ప తనకు వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనం ఆశించలేదు కనుక షర్మిల పాదయాత్రకు నిర్దిష్టమైన ఫలితం అంటూ ఉండదు. 

ఈ పాదయాత్ర ప్రత్యేకతలు ఏమిటి? 
బుధవారం ముగియనున్న జగన్‌ పాదయాత్ర ఇంతకు మునుపు జరిగిన పాద యాత్రల కంటే పలు విధాల భిన్నమైనది. తెలుగునాట ఇంతకు పూర్వం పాద యాత్రలో నెలకొల్పిన రికార్డులన్నంటినీ ఇది అధిగమించింది. ఆయన ఇంత వరకూ 338 రోజులపాటు 3,600 కిలోమీటర్ల పైచిలుకు నడిచారు. కాలమూ, దూరంలోనే కాదు ప్రత్యేకత. వైఎస్‌ పాదయాత్ర చేసిన రోజులలో రాష్ట్రంలో కరువు తాండవించింది. వ్యవసాయదారుల సమస్యలను అధికంగా ప్రస్తావించే వారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంటు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఆ యాత్ర ఫలితమే. చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో రైతుల సమస్యలనూ, ఇతర వర్గాల సమస్యలనూ ప్రస్తావించారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రైతులనూ, పేదలనూ విస్మరించి సింగపూర్‌ స్వప్నంలో మునిగారు. ఇప్పటికీ తేలలేదు.

ఏడు మాసాల పాదయాత్రలో ఆలకించిన విన్నపాల ఆధారంగా ప్రజల ఎజెండా రూపొందించుకొని అమలు పరచవలసిన ముఖ్యమంత్రి సొంత ఎజెండాను తలకెత్తుకున్నారు. బహుశా ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ చంద్రబాబు పట్టించుకోని ఫలితంగానే జగన్‌ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకు జరగనట్టు ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి రెండు రోజులకూ ఒక బహిరంగసభ జరుగుతోంది. ఇదివరకు ఎరగనట్టు ప్రతి సభకూ ప్రజలు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. ఒక పాద యాత్రకు ఇంతమంది ప్రజలు హాజరుకావడం చరిత్ర. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రాష్ట్రం పొడవునా పాదయాత్ర చేయడం ప్రపంచ  రికార్డు. బహిరంగ సభలతో పాటు వివిధ కులాలవారూ, వృత్తులవారూ ఆత్మీయసభ లలో జగన్‌ను కలుసుకొని తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకుంటున్నారు. ప్రతి పక్ష నాయకుడు అందరు చెప్పినవీ శ్రద్ధగా ఆలకించి పరిష్కారం సూచిస్తున్నారు. అందరి ఆశీస్సులతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని అనుకుంటున్నారో చెబుతున్నారు.

ఇసుకవేస్తే రాలని జనం ఎందుకు వస్తున్నారు?
టీడీపీ ఎన్నికల వాగ్దానాలు సక్రమంగా అమలు జరగడం లేదని ప్రజలు ఆవే శంగా, ఆవేదనతో చెబుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. అవే అంశాలు జగన్‌ ఉపన్యాసాలలో విమర్శనాస్త్రాలుగా వెలువడుతున్నాయి. విమర్శ సూటిగానే, ఘాటుగానే ఉంటున్నది. ప్రత్యర్థిని చులకన చేసి మాట్లాడటం లేదు. ‘ఈ పెద్దమనిషి, చంద్రబాబునాయుడుగారు...’ అంటూనే వాక్యం ప్రారంభం అవు తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనూ, ప్రభుత్వ వైఫల్యాలనూ పేర్కొంటూనే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఏమి చేయాలని అను కుంటున్నదో కూడా స్పష్టంగా చెబుతున్నారు.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారికే చెల్లించడం, వృద్ధాప్య పింఛన్‌నూ, వికలాంగులకు ఇచ్చే పింఛన్‌నూ వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం, పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకాలు అందించే అమ్మఒడి పథకం, పేదలందరికీ ఇళ్ళు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, దశలవా రీగా మద్యనిషేధం అంటూ నవరత్నాల పేరుమీద తొమ్మిది పథకాలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ప్రతిపథకం గురించి వివరంగా చెబుతున్నారు. ఇలా ప్రజల మధ్య నిత్యం ఉండటం,వారి మాటలు వినడం, మాట్లాడటం కంటే ముఖ్యమైన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఉండదు. ప్రజల సంక్షేమమే పరమావధి అని భావించే నాయకులకు ఇది మహోపకారం చేస్తుంది.

2009లో తండ్రి ఆకస్మిక మరణం నుంచి నేటి వరకూ ఆయన పట్టుమని వారం రోజులు ఇంటి దగ్గర భార్యాపిల్లలతో కలసి ఉండలేదు. మొదట్లో ఓదార్పు యాత్ర, అనంతరం జైలు జీవితం, ఆ తర్వాత ప్రత్యేకహోదా సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు, అటుపిమ్మట పాదయాత్ర. 2018 పూర్తిగా పాదయాత్రలోనే గడిచిపోయింది. వాస్తవానికి ఇది 2017లో ఆరంభమై 2019లో పూర్తవుతున్న చరిత్రాత్మకమైన పాదయాత్ర. ‘ప్రజల సంక్షేమం కోసం  నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే మీ జగన్‌ రెండడుగులు ముందుకేస్తాడు’ అంటూ అడుగడుగునా చెబుతున్న జగన్‌ 2019లో అద్భుతమైన విజయం సాధిస్తారనడంలో సందేహం ఏ మాత్రం లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు.

ప్రజలు ఒకసారి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రత్యర్థుల ఎత్తుగడలూ, కూడికలూ, తీసివేతలూ, వ్యూహాలూ, ప్రలోభాలూ, కుట్రలూ, ధనప్రవాహాలూ, విషప్రచారాలూ పని చేయవు. 2004లో, 2009లో పని చేయలేదు. ఈసారీ పని చేయవు. గెలిచిన తర్వాత జగన్‌ ఎట్లా వ్యవహరిస్తారో ప్రజలు పరిశీలిస్తారు. శాసనసభ్యుల చేత రాజీనామా చేయించిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నట్టు, ఆచరణసాధ్యమైన వాగ్దానాలనే ప్రజలకు చేసినట్టు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టు... ఇదే  రక మైన విలువలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తే, పాద యాత్రలో చేసిన బాసలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం నిజాయితీగా చేయగలిగితే ‘ప్రజాసంకల్పయాత్ర’ పూర్తిగా సార్థకం అవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి జన్మ ధన్యమౌతుంది. 


కె. రామచంద్రమూర్తి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా