ప్రజాకోర్టులో పౌరసత్వ చట్టం

19 Dec, 2019 00:05 IST|Sakshi

సందర్భం

నూతన పౌరసత్వ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పౌరులు సవాలు చేస్తుండటంతో తూర్పు, ఈశాన్య భారతం తగలబడుతోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు చెలరేగుతుండటంతో దేశం అట్టుడికిపోతోంది. అసోంలో ఎన్నార్సీ, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్, రామ మందిరంపై తీర్పు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకురావడం ఏమంత ఆశ్చర్యం కలిగించదు. ఒక ప్రత్యేక మతానికి చెందిన విదేశీయులకు భారతీయ పౌరసత్వాన్ని ఈ సవరణ బిల్లు సమర్థవంతంగా నిరోధిస్తున్నందున భారత్‌ని హిందూ దేశంగా మల్చాలనే బీజేపీ, ఆరెస్సెస్‌ ఎజండాను మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతున్నట్లుగానే కనిపిస్తోంది. 

పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చర్చ సాగుతుండగానే అసోం, ఈశాన్య భారత్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం తమ ప్రాంత జనాభా కూర్పులో గణనీయ మార్పును తీసుకురావడమే కాక తమ సంస్కృతిపై  కూడా దాడికి దిగుతుందని ప్రజలు భయాందోళనలకు గురికావడమే ఈ నిరసనలకు కారణం. పైగా ప్రజా నిరసనలు పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్‌ వంటి మరెన్నో ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా నిరసనలను పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా అణచివేయడంతో ప్రపంచం మెల్లమెల్లగా ఈ నిరసనలను పరిగణనలోకి తీసుకోవడం మొదలైంది. బంగ్లాదేశ్‌ మంత్రి భారత పర్యటన రద్దు కావడం, జపాన్‌ ప్రధాని గౌహతి సందర్శన వాయిదా పడటంతో భారత్‌కు దౌత్యపరంగా తొలి దెబ్బలు తగిలాయి. 

మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్‌హెచ్‌సిఆర్‌ భారత ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ చట్టం ‘ప్రాథమికంగానే వివక్షాపూరితం’గా ఉందని తన అసమ్మతిని వ్యక్తం చేయడమే కాకుండా, భారత్‌ కట్టుబడిన అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐరాస విభాగం ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా పాలనాయంత్రాంగం కూడా భారత్‌లో పరిణామాలను నిశి తంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఇక దేశీయంగా చూస్తే మోదీ ప్రభుత్వ హిందుత్వ అనుకూల చర్యకు ప్రతిపక్షాలు పాలి స్తున్న కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, చత్తీస్‌గర్‌ వంటి రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని తాము అమలుపర్చబోమని ఈ రాష్ట్రాల పాలకులు స్పష్టం చేశారు. దాంతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయనుంది.

అయితే అటు బీజేపీ, ఇటు కేంద్రప్రభుత్వం ఈ వ్యవహారంలో రాష్ట్రాలకు పెద్దగా పాత్ర ఏమీలేదని, కొత్త పౌరసత్వ నిబంధనల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా పాత్ర లేదని చెబుతూ వస్తున్నాయి. పైగా పౌరసత్వ చట్టం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఏమేరకు అడ్డుకుంటాయన్నది చూడాల్సిందే మరి. రాజకీయ పరంగా చూస్తే, పౌరసత్వ చట్టం రూపంలో మతపరంగా ప్రజలను విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలను పాకిస్తాన్‌ అనుకూల, మైనారిటీల అనుకూల సంస్థలుగా ముద్రించడం ద్వారా బీజేపీ మరింతగా మందుగుండు దట్టించింది. 

కాగా, ఈ ఘర్షణలకు సంబంధించిన తొలి పరీక్ష పశ్చిమబెంగాల్‌లోనే జరగనుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోకి మరింతగా చొచ్చుకుపోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పౌరసత్వ చట్టం అంశాన్ని ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చేసింది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ చట్టంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పథక రచన చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో విజయోత్సవ ర్యాలీలను మొదలుపెట్టేసింది. పైగా, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమతో కలిసి నడవాలంటూ రాష్ట్రంలోని శరణార్థులకు పిలుపునిచ్చేసింది కూడా.
కాగా, ఢిల్లీలో జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష దాడులు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీయడం గమనార్హం.


లక్ష్మణ వెంకట్‌ కూచి
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయుడు
 

మరిన్ని వార్తలు