జాతీయవాదం పట్టని జార్ఖండ్‌ ఓటరు..!

27 Dec, 2019 01:41 IST|Sakshi

విశ్లేషణ

జార్ఖండ్‌లో పొందిన అవమానకరమైన ఓటమి కేంద్రంలో పాలక బీజేపీకి గట్టి సందేశాన్నే పంపింది. ఆర్థిక మాంద్యం  ఓటర్లపై తన ప్రభావం వేయడం మొదలెట్టిందని, ఓటర్లు కూడు గుడ్డకే ప్రాధాన్యం ఇస్తున్నారని తేలిపోయింది. ఒక చిన్న గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో అఖిల జార్ఖండ్‌ విద్యార్థుల యూని యన్‌ (ఏజేఎస్‌యూ)తో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన బీజేపీ ఆ రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాలు గెల్చుకుని విజయ దుందుభిని మోగించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమి 51 శాతం ఓట్లను సాధించింది.

జార్ఖండ్‌ శాసనసభకు జరిగిన తాజా ఎన్నికల్లో, జార్ఖండ్‌ ముక్తి మోర్చాతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ చేతిలో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. అతి శక్తివంతమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఓడించవచ్చని ఈ ఫలితాలు నిరూపించడమే కాదు.. బీజేపీ బలమే ఇప్పుడు దాని అతిపెద్ద బలహీనతగా మారిపోయిందని స్పష్టమైంది. ప్రత్యేకించి రాష్ట్రాల పరంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ముందు లేక ఆ తర్వాత బీజేపీతో సాగిస్తున్న పొత్తును రద్దు చేసుకున్నాయి. జార్ఖండ్‌ ఎన్నికల్లో ఏజేఎస్‌యూ సాధిం చిన 9 శాతం ఓట్ల షేర్‌ ఆ రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రధాన కారణమైంది. తమ ఆశల్ని, ఆకాంక్షల్ని తీర్చడంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఓటర్లు నిర్దాక్షిణ్యంగా గద్దె నుంచి తప్పిస్తారని, నిత్యావసర అవసరాల విషయానికి వచ్చేసరికి ఓటర్లు ఎలాంటి అపసవ్య విధానాలను సహించబోరని జార్ఖండ్‌ ఎన్నికలు సందేశం ఇచ్చాయి.

దేశంలో అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. కానీ స్థానిక ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, ప్రభుత్వాలపై వ్యతిరేకత ప్రబలిపోయినప్పుడు పార్టీని పైకెత్తడం ప్రధానికి కూడా సాధ్యం కాదని తేలిపోయింది. ఇంతవరకు జార్ఖండ్‌ సీఎంగా వ్యవహరించిన రఘుబర్‌ దాస్‌తోపాటు చాలామంది కేబి నెట్‌ మంత్రులు కూడా ఓడిపోయారంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అంతగా పెరిగిందని అర్థం. 

స్థానిక అంశాలు, కూటమిలో సమస్యలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణం కావచ్చు కానీ, జార్ఖండ్‌ ఓటర్‌ తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను మర్చిపోయారని చెప్పలేం. ఒకవేళ మర్చిపోయారు అనుకున్నా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో హిందుత్వ ఎజెండాలో పురోగతి, ట్రిపుల్‌ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు, రామ్‌ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం వంటి తాము సాధించిన ఘనతల గురించి ఓటర్లకు పదేపదే గుర్తు చేస్తూ వచ్చారు. 

కానీ ప్రజలను విభజించే ప్రయత్నాలకు లొంగని ఓటర్లు తమ తక్షణ సమస్య రోజువారీ జీవిత సమస్యే అని గట్టిగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దాన్ని తిరిగి పట్టాల మీద నిలబెట్టండి అనేది ఓటరు ఇస్తున్న పెద్ద సందేశం. కాకతాళీయంగా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ పార్టీలు స్థానిక, దైనందిన సమస్యలపట్ల దృష్టి కేంద్రీకరించాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 నవంబర్‌లో కాంగ్రెస్‌ మూడు కీలక రాష్ట్రాలను (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌) గెల్చుకుంది. కానీ  తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడే ఘోరంగా దెబ్బతినింది. అయితే ప్రతిపక్షం ఐక్యంగా పనిచేస్తే బీజేపీని ఓడించవచ్చనే వాస్తవాన్ని జార్ఖండ్‌ మళ్లీ స్పష్టం చేసింది. అయితే దేశవ్యాప్తంగా ప్రభావం చూపే విస్తృత స్థాయి తనకుందనీ, బీజేపీకి తాను ప్రత్యామ్నాయం కాగలననే విశ్వాసాన్ని దేశానికి ప్రతిపక్షం కలిగించగలదా? ఇక బీజేపీ విషయానికి వస్తే జార్ఖండ్‌ ఫలి తాలు పెనుదెబ్బే అవుతున్నాయి. అది వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందే. మరికొద్ది నెలల్లో ఢిల్లీలో ఆప్‌ పార్టీతో, 2021లో పశ్చిమబెంగాల్‌లో మమతతో బీజేపీ మరో అతిపెద్ద పరీ క్షను ఎదుర్కోనుంది.
వ్యాసకర్త : లక్ష్మణ వెంకట్‌ కూచి, సీనియర్‌ జర్నలిస్టు 

మరిన్ని వార్తలు