సాహసోపేతమైన న్యాయమూర్తి

7 Dec, 2018 02:26 IST|Sakshi

కాలమనేది వోల్టేర్‌ని కూడా జయిస్తుంది కాబట్టి దానికి విరామం కలిగిస్తేనే ఉత్తమమని విల్‌ డ్యురాంట్‌ పేర్కొన్నారు.  కాని సీవీ నాగార్జునరెడ్డి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న సాహసోపేతులైన జడ్జీల విషయంలో కాలం కూడా అంతరాయాలను కలిగిస్తుంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఏటికి ఎదురీదే స్వభావం, అప్రమత్తతకు మారుపేరైన ఆయన కూడా కాలం ముందు మరొక బాధితుడిగా మారిపోయారనే చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరిస్తున్న న్యాయవాదుల పట్ల ఆయన తీవ్ర అసహనం ప్రదర్శించేవారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన మొహంలో కని పించే భావాలను, లంచ్‌ లోపలే మరో అంశాన్ని ముగించాలంటూ ఆయన ప్రదర్శించే ఆత్రుతను కాస్త తెలివి ఉన్నవారు ఎన్నడూ మర్చిపోలేరు. అయితే ఎంత వేగంగా పనిచేసినప్పటికీ ఆయన తీర్పుల్లో, నాణ్యత విషయంలో ఎలాంటి తడబాటు ఉండదు. న్యాయవాదులు తమ తమ కేసులను చర్చిస్తున్న సమయంలో వారి చాంబర్లలో ఆయన కూడా ఉంటున్నట్లుగా భావించి అప్రమత్తంగా ఉండేవారు.

జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి సాహసప్రవృత్తి ఆయన స్వభావంలోనే కాకుండా ఆయన తీర్పుల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. న్యాయం కోసం తనముందు నిలిచిన ముసలి రైతు, నిస్సహాయ స్థితిలోని కాంట్రాక్ట్‌ వర్కర్, న్యాయవ్యవస్థ అలసత్వం కారణంగా నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు, ప్రాసిక్యూషన్‌ వారి కేసులో అసంబద్ధ స్వభావంతో కన్నకొడుకును దాదాపుగా కోల్పోయిన తల్లి వీరందరూ ఆయన ముందు సాంత్వన కోసం నిలబడేవారు.

జస్టిస్‌ నాగార్జునరెడ్డికి ముందు కోర్టు వ్యవహారాలు నియమిత వేళల్లో మాత్రమే పనిచేస్తూ వచ్చేవి. సత్వర న్యాయం అనేది శుష్క వాగ్దానంలాగే ఉండేది. జీవిత ఖైదీల అప్పీళ్లు హైకోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న తరుణంలో కనీసం అయిదేళ్ల శిక్షాకాలాన్ని ముగించుకున్న ఖైదీలు బెయిల్‌తీసుకోవడానికి అర్హులేనంటూ ఆయన సాహసోపేతంగా తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తిగా తన 12 ఏళ్ల కెరీర్‌లో సంవత్సరానికి 92 కేసుల చొప్పున 1,102 తీర్పులను ఆయన వెలువరించారు.

ప్రత్యేకించి భూవివాదాలకు సంబంధించిన కేసుల్లో ఆయన ప్రదర్శించిన వైఖరి చరిత్ర సృష్టించింది. జి. సత్యనారాయణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకి సంబంధించిన కేసులో రాష్ట్రంలోని రెవెన్యూ చట్టాలపై అద్భుతమైన తీర్పు చెప్పారు. అది భూ వ్యవస్థ పరిణామ చరిత్రను లోతుగా తడిమింది. న్యాయవాదిగా ఉంటూనే సివిల్, పబ్లిక్‌ చట్టాలపై మంచి అవగాహనను పెంచుకున్నప్పటికీ, నేరన్యాయ చట్టానికి ఆయన చేసిన దోహదం ఆయేషా మీరా హత్య కేసులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు దోషిని వదిలిపెట్టి పోలీసులు నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసిన క్రమాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అమాయకుడిపై విచారణ సాగించి అసలు కారకులను వదిలేసిన దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించి సంచలనం సృష్టించారు.

అలాగే వందలాది ఆరోగ్యమిత్రలు, వైద్య మిత్రలను ఏపీ ప్రభుత్వం తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని అభిశంసించినంత పనిచేశారాయన. ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సంక్షేమ రాజ్యంలో ప్రవేశపెట్టిన పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ భావననే ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని, శాశ్వత నియామకాల పద్ధతి స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామకాలకు తావివ్వడం పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ భావనను తొక్కిపడేయడమే కాకుండా ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న యువతపై తీవ్ర ప్రభావంపడిందని వ్యాఖ్యానించారు. అయిదేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి మరణదండన ఎందుకు విధించలేదంటూ దిగువకోర్టును ఆయన తప్పుపట్టారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల పట్ల ఆయన అత్యంత ఆసక్తి చూపేవారు. ఈ తరహా నేరాలపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే, దేశంలో మహిళలు, పిల్ల లకు భద్రత కరువేనని ఆయన హెచ్చరించారు.

ఎలాంటి భయంకానీ, పక్షపాతంకానీ లేకుండా న్యాయవ్యవస్థను సేవిస్తాను అంటూ చేసిన కీలకమైన హామీని ఆయన నెరవేర్చుకున్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయన తన వృత్తిజీవితం పట్ల ప్రదర్శించిన అంకితభావం అనేకమందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది.

-ఎల్‌. రవిచంద్ర, సీనియర్‌ అడ్వొకేట్‌ 
(జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి పదవీ విరమణ సందర్భంగా) 

మరిన్ని వార్తలు