బీజేపీ రథయాత్రకు హైకోర్టు బ్రేక్‌ 

7 Dec, 2018 02:29 IST|Sakshi

జనవరి 9న విచారణ తర్వాతే యాత్రపై తుది నిర్ణయం 

కోల్‌కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు కలకత్తా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. శుక్రవారం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలో ‘సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ’పేరుతో అమిత్‌ షా ప్రారంభించాల్సి ఉన్న రథయాత్రకు అనుమతులు ఇవ్వలేమని గురువారం తేల్చిచెప్పింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్‌ శాఖ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కిశోర్‌ దత్త వాదనలు వినిపిస్తూ.. బీజేపీ కూచ్‌బెహర్‌ రథయాత్రకు అనుమతి ఇవ్వలేమని, యాత్ర వల్ల రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు కూచ్‌బెహర్‌ ఎస్పీ అనుమతి నిరాకరించినట్లు దత్త కోర్టుకు చెప్పారు. గతంలో ఈ జిల్లాలో మతపర ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని వివరించారు. అలాగే ఈ కూచ్‌ రథయాత్రకు బీజేపీ అగ్రనేతలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇవన్నీ మతపరంగా సున్నితమైన ఈ జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. 

ఎవరిది బాధ్యత..? 
రథయాత్రలో భాగంగా ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో 3 యాత్రలను నిర్వహిస్తామని బీజేపీ హైకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. రథయాత్రల్లో ఏమైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు. అయితే ఘర్షణలు జరుగుతాయన్న కారణాలు చూపి అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ తరఫు న్యాయవాది తెలిపారు. రథయాత్రకు సంబంధించి తాము అక్టోబర్‌లోనే అనుమతికి దరఖాస్తు చేసుకున్నామని, ఇన్నాళ్లు జాప్యం చేసి ఇప్పుడు అనుమతి నిరాకరిస్తున్నారని అన్నారు. తదుపరి విచారణను కోర్టు జనవరి 9కి వాయిదావేసింది. 

>
మరిన్ని వార్తలు